కెవ్వుమన్న కాగితం!

ఒక పిల్లవాడు బడి వదిలాక.. పక్కనే ఉన్న మిఠాయి దుకాణానికి వెళ్లాడు. ఆ దుకాణదారు అతడిచ్చిన డబ్బుకు సరిపడా.. మిఠాయి తూచాడు. దాన్ని ఒక కాగితంలో పొట్లం కట్టి ఇచ్చాడు. పిల్లవాడు సంబరంగా ఆ పొట్లాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. త్వరత్వరగా ఇంటికి చేరాడు. పుస్తకాల సంచి, మిఠాయి పొట్లాన్ని బల్లపైన పెట్టి.. స్నానం చేసి వద్దామని వెళ్లాడు.  

Published : 16 Oct 2022 00:13 IST

క పిల్లవాడు బడి వదిలాక.. పక్కనే ఉన్న మిఠాయి దుకాణానికి వెళ్లాడు. ఆ దుకాణదారు అతడిచ్చిన డబ్బుకు సరిపడా.. మిఠాయి తూచాడు. దాన్ని ఒక కాగితంలో పొట్లం కట్టి ఇచ్చాడు. పిల్లవాడు సంబరంగా ఆ పొట్లాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. త్వరత్వరగా ఇంటికి చేరాడు. పుస్తకాల సంచి, మిఠాయి పొట్లాన్ని బల్లపైన పెట్టి.. స్నానం చేసి వద్దామని వెళ్లాడు.  

ఈలోగానే మిఠాయి వాసన పసిగట్టిన చీమలు ఆశగా, ఆత్రంగా అటుగా రాసాగాయి. కలుగులోంచి ఎలుక తలవరకూ మాత్రమే బయటకు పెట్టి.. ఆరాటంగా చూడసాగింది. కిటికీలోంచి ఒక కాకి కావుకావుమని ఆకలిగా అరవడం ప్రారంభించింది. ఇంతలోనే పిల్లవాడు వచ్చేశాడు. ఎప్పుడెప్పుడు మిఠాయి తిందామా అని.. అపురూపంగా పొట్లాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అంతలోనే నాన్న రావడంతో దాన్ని పక్కన పెట్టి, అయిష్టంగానే బ్యాగులోంచి పుస్తకం తీసి చదవసాగాడు.

ఇదంతా గమనిస్తున్న పొట్లంగా చుట్టిన కాగితానికి గర్వం పెరిగింది. బాబు చేతిలో ఉన్న పుస్తకంలోని కాగితాల వైపు ఈసడింపుగా చూసింది. ‘గమనించారా.. ఆ పిల్లవాడికి నేనంటేనే ఇష్టం’ అంది బడాయిగా. ‘సంతోషం మిత్రమా!’ అన్నాయి పుస్తకంలోని కాగితాలు స్నేహంగా. ఇక ఆ పొట్లం కాగితం బడాయిలు ఎల్లలు దాటాయి. ‘నన్ను చూశారా.. ఎలా ఘుమఘుమలాడుతున్నానో! పిల్లవాడితోపాటు ఆ చీమలు, ఎలుక, కాకి నన్ను తాకాలని ఎంత తహతహలాడుతున్నాయో చూశారా..’ అంటూ మురిసిపోయింది. అంతటితో ఆగక ‘అంత ఇష్టంగా మీ ముఖం చూసేవారే లేరు’ అంటూ చిన్నబుచ్చింది.

అన్ని మాటలు అంటున్నా.. పుస్తకాల్లోని కాగితాలు ఏమీ మాట్లాడలేదు. పాఠాలు చదవడం అయ్యాక, హోంవర్కు కూడా పూర్తి చేసిన పిల్లవాడు ఆనందంగా పొట్లం విప్పి మిఠాయి తిన్నాడు. మొత్తం తినేసి కాగితాన్ని ఉండగా చుట్టి, ఇంటి బయటనున్న చెత్తబుట్టలోకి విసిరాడు. పుస్తకాలను భద్రంగా బ్యాగులో పెట్టి ఇంట్లో దాచుకున్నాడు. ‘రేపు మీ గతీ అంతేగా?’ అందా బ్యాగు కాగితాలతో వెక్కిరింపుగా. ‘నువ్వేమైనా శాశ్వతమా.. రేపు కాకపోతే మరో రోజున నువ్వూ చిరిగిపోతావు. నేను అరిగిపోతాను’ అంది పెన్సిల్‌ చిద్విలాసంగా. ‘దిగులు పడకండి నేస్తాలూ.. ఎంతకాలం ఉన్నామని కాదు. ఉన్నంతలో ఎంతమందికి సహాయపడ్డామో, ఎంత తృప్తిగా జీవించామో ఆలోచించాలి. ఈ రెప్పపాటు జీవితానికి గర్వం అవసరం లేదు. దిగులు అంతకంటే వద్దు’ అని ఓదార్చాయి అక్షరాలు ఆత్మీయంగా.

ఎక్కడి నుంచో రివ్వుమని ఎగురుకుంటూ వచ్చిన ఒక కాకి, చెత్తబుట్టలోని కాగితపు ఉండను ముక్కున కరుచుకుని పోయింది. కొంతదూరం వెళ్లాక.. దాన్ని విప్పి చూసింది. అందులో మిఠాయి లేదని తెలుసుకున్న కాకి, దాన్ని అక్కడే వదిలి నిరాశగా ఎగిరిపోయింది. తరవాత ఆ కాగితం ముఖాన్ని ఒక్క చీమ కూడా చూడలేదు. తన పరిస్థితికి దిగులుపడింది కాగితం. ఇంతలో పెద్ద గాలి దుమారం రావడంతో.. అది అలా అలా కొట్టుకుపోయింది. మిఠాయి పొట్లంగా నిండుగా, భద్రంగా ఉన్న కాగితం.. ఖాళీ అయ్యాక తన స్థిరత్వం కోల్పోయింది. అంతసేపు ఇచ్చిన విలువ మిఠాయిది అనీ, తనది కాదని కాగితానికి వాస్తవం బోధపడింది. దొర్లుతూ దొర్లుతూ చివరికి ఒక మురుగు కాల్వలోకి చేరింది. కాసేపటికి తడిసి.. ముక్కలు ముక్కలుగా చిరిగిపోయింది. 

- గుడిపూడి రాధికారాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని