కుందేలు తెలివి!

ఒక కుందేలుకు చెట్టుపైన ‘కావ్‌..కావ్‌..’ అని అరుస్తూ ఓ కాకి కనిపించింది. అప్పుడు కుందేలు ఆ కాకితో... ‘ఈ రోజు అడవిలో కోకిల వీనులవిందు చేస్తుందట. సింహం అందరినీ రమ్మంది’ అని అంది. అప్పుడు కాకి సంతోషంతో...

Published : 17 Oct 2022 00:21 IST

ఒక కుందేలుకు చెట్టుపైన ‘కావ్‌..కావ్‌..’ అని అరుస్తూ ఓ కాకి కనిపించింది. అప్పుడు కుందేలు ఆ కాకితో... ‘ఈ రోజు అడవిలో కోకిల వీనులవిందు చేస్తుందట. సింహం అందరినీ రమ్మంది’ అని అంది. అప్పుడు కాకి సంతోషంతో.. ‘ఓహో! విందు భోజనమా! తప్పకుండా వస్తాను. విందు భోజనానికి నేను రాకపోవడం ఏమిటి?’ అని అంది.

అప్పుడు కుందేలు నవ్వి.. ‘అయ్యో కాకమ్మా! వీనుల విందు అని అంటే విందు భోజనం అని కాదు. వీనులు అంటే చెవులు అని అర్థం. నిజానికి ఎక్కడైనా చెవులకు విందు ఉంటుందా?.. అదే తెలుగు భాష గమ్మత్తు. వీనులవిందు అంటే మన చెవులకు, హృదయానికి ఇష్టమైనది అని అర్థం. అంటే మనను ఆనందింపజేసేదని అర్థం. కోకిల పాడితే నిజంగా వీనులవిందుగానే ఉంటుంది. నీకేమో ఎప్పుడు తిండి పైనే ధ్యాస’ అని అంది. అప్పుడు కాకి.. ‘ప్చ్‌! వీనులవిందు అని అంటే కమ్మటి విందు భోజనం అని నేను అనుకున్నానే! కోకిల పాట, విందు భోజనం ఎలా అవుతుంది?’ అని అంది.

అప్పుడు కుందేలు నవ్వి.. ‘‘అవును. నీలాంటి దానికి చెడుమాటలు తప్ప మంచి పదాలు పలకడానికి రావు కదా! ఆ.. ‘కావ్‌.. కావ్‌...’ అని అరుపులు ఏంటి? అందరి పనులూ ‘కావు.. కావు..’ అని అరుస్తూ పేరుగాంచావు. అందుకే నిన్ను ఎవరూ దగ్గరికి తీయడం లేదు. మంచి తెలుగు నేర్చుకుని... ‘అవును.. అవును’ అని అనడం అలవర్చుకో... అప్పుడు అందరూ నిన్ను ఆదరిస్తారు’ అంది.

అప్పుడు కాకి... ‘‘అయ్యో కుందేలా! మా అరుపులే అంత. ఏం చేస్తాం? మా కర్మ. అయినా... ‘కావు.. కావు...’ అని అంటే రక్షించు, రక్షించు అని కూడా అర్థం ఉంది కదా! ఇతరుల ఆపదలు చూసి మేము ‘కావు.. కావు..’ అంటే... ‘రక్షించండి, రక్షించండి’ అని అరుస్తున్నాం కదా! అది ఇతరులకు మేము చేసే మేలు కాదా! నువ్వే చెప్పు...’ అని అంది.

‘నిన్ను నువ్వు సమర్థించుకోవాలని చూస్తున్నావు కదా కాకీ...’ అంది కుందేలు. ‘అదేం కాదు. మా అరుపులకు మంచి అర్థం కూడా ఉందని చెబుతున్నానంతే!’ అని సమాధానం ఇచ్చింది కాకి.

అప్పుడు కుందేలు మన తెలుగులో మధురమైన జాతీయాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు చక్కని తెలుగు జాతీయాలు నేర్చుకో’ అంది. అందుకు కాకి.. ‘నీకు ఈ జాతీయాలను ఎవరు నేర్పారు?’ అని అడిగింది. అప్పుడు కుందేలు.. ‘ఒక కోతి నాకు నేర్పింది లే! అది తెలుగు ప్రజల మధ్య తిరుగుతూ వారు పలికే జాతీయాలను నేర్చుకుంది’ అని చెప్పింది. ‘అయితే ఇంకేం.. నువ్వే నాకు తెలుగు భాషలోని జాతీయాలను  నేర్పాలి’ అని దాన్ని అడిగింది. అందుకు కుందేలు సరేనంది.

ఒకరోజు కుందేలుకు అడవిలో ఒక నక్క ఎదురైంది. అది కుందేలును ఆపి, ఏదో విషయం చెప్పబోయింది. అప్పుడు కుందేలు.. ‘ఓ నక్కా! నాకు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నేను తొందరగా ఇంటికి వెళ్లాలి’ అంది. అప్పుడు నక్క ‘అయ్యో! కుందేలా! కడుపులో ఎలుకలు పరిగెడితే పిల్లిని కడుపులోకి పంపు. వాటి తిక్క కుదురుతుంది’ అంది.

అప్పుడు కుందేలు నవ్వి.. ‘నీ తెలివి తెల్లారిపోను! కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని అంటే ఆకలిగా ఉందని అర్థం. నీకు తెలుగు భాష జాతీయాలు తెలియనే తెలియవు. నేను మాంసాహారిని కాదని  నీకు తెలియదా! నువ్వు ఇంత బుద్ధి తక్కువ దానివని నాకు ఇప్పుడే తెలిసింది. నేను వెంటనే వెళ్లి ఆహారాన్ని తినాలి’ అని అంది.

‘నేను అలా అనుకున్నా. నువ్వు తెలుగు జాతీయాన్ని వాడావని నాకేం తెలుసు. నాకు కూడా కొన్ని జాతీయాలు చెప్పవా’ అని అడిగింది నక్క.

‘నువ్వు కపట బుద్ధి మానుకుంటే తప్పకుండా నేర్పుతాను’ అంది కుందేలు. వెంటనే కుందేలు అక్కడి నుంచి ఇంటికి వెళ్లింది. మరునాడు కుందేలుకు చెట్టు తొర్రలోంచి ఒక ఉడుత బయటకు వస్తూ కనిపించింది. ఆ కుందేలు ఉడుతతో.. ‘ఓ ఉడుతా! నిన్న నేను ఒక పెద్ద పులిని ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీరు తాగించి వచ్చాను తెలుసా!’ అని అంది.

అప్పుడు ఉడుత.. ‘కుందేలా! నువ్వు ఈ అబద్ధాలు ఎప్పుడు నేర్చుకున్నావు. ఎవరి కడుపులోనైనా కుండెడు నీళ్లే పట్టవు. అలాంటిది ఒకటి కాదు. రెండు కాదు, ఏకంగా మూడు చెరువుల నీళ్లు పడతాయా? అందులోనూ నువ్వు పెద్దపులికి తాగించి రావడమేంటి? అబద్ధం కాకపోతే!’ అని అంది.

దానికి కుందేలు నవ్వి.. ‘అయ్యో చిట్టి ఉడుతా! మూడు చెరువుల నీళ్లు తాగించి వచ్చానని అంటే, ఆ పెద్దపులిని చాలా కష్టపెట్టి దానికి దొరకకుండా తప్పించుకుని వచ్చానని అర్థం. ఎవ్వరినైనా అడుగు. తెలుగు భాష జాతీయాలు నువ్వు తెలుసుకుంటే మంచిది. మన తెలుగు భాషలో ఎన్నో జాతీయాలు ఉన్నాయి. ఇవి పైకి ఒక అర్థం, లోపల మరో అర్థాన్ని స్ఫురింపజేస్తాయి. ఆ భాష వచ్చిన వారికే ఇవి అర్థమౌతాయి. అందుకే నేను తెలుగుపై అభిమానంతో ఆ భాషను మాట్లాడుతున్నాను తెలుసా! నువ్వూ చక్కని తెలుగు భాషను నేర్చుకో. మన మాతృభాష తెలుగును మనమందరం కాపాడుదాం. తెలుగు వెలుగులను అందరికీ పంచుదాం’ అని అంది. అప్పుడు ఉడుత కూడా సరేనంది.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని