పుట్టినరోజు బహుమతి!

‘హ్యాపీ బర్త్‌డే అభిరామ్‌..! హ్యాపీ బర్త్‌ డే టూ యూ’ అంటూ చప్పట్లు కొడుతూ పాడుతున్నారు పిల్లలందరూ. వారి మధ్యలో కొత్తదుస్తులతో మెరిసిపోతూ అభిరామ్‌ కేక్‌ కట్‌ చేస్తున్నాడు.అభిరామ్‌ ఆరో తరగతి చదువుతున్నాడు.

Published : 19 Oct 2022 00:05 IST

‘హ్యాపీ బర్త్‌డే అభిరామ్‌..! హ్యాపీ బర్త్‌ డే టూ యూ’ అంటూ చప్పట్లు కొడుతూ పాడుతున్నారు పిల్లలందరూ. వారి మధ్యలో కొత్తదుస్తులతో మెరిసిపోతూ అభిరామ్‌ కేక్‌ కట్‌ చేస్తున్నాడు.

అభిరామ్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. చాలా చురుకుగా ఉంటాడు. ప్రతి సంవత్సరం అతని స్నేహితుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉంటారు అతడి తల్లిదండ్రులు. పుట్టినరోజుకు నెల రోజుల ముందు నుంచే తెగ హడావిడి పడుతూ ఉంటాడు అభిరామ్‌.

కట్‌ చేసిన కేకులోని చిన్న ముక్కను అభిరామ్‌ నోటిలో పెట్టి, అతడి నుదుటన ముద్దు పెట్టింది తల్లి మాధురి. రకరకాల తినుబండారాలున్న పాత్రల్లో కేకును ఉంచి, వచ్చిన  వారికందించింది అభిరామ్‌ తల్లి. కొంత సమయం పిల్లలంతా ఆటపాటల్లో మునిగి పోయారు. అభిరామ్‌ నాన్న కూడా వచ్చి.. పిల్లలతో కలిసిపోయి వాళ్లను ఉత్సాహపరిచారు.

‘హాయ్‌! అభిరామ్‌.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ఇంటి లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి.. ‘హా! మావయ్య’ అంటూ పరుగునవెళ్లి.. ‘మావయ్యా.. నువ్వు ఆలస్యంగా వచ్చావు. నేను కేక్‌ కట్‌ చేయడం కూడా అయిపోయింది. నేను నీతో మాట్లాడను పో’ అన్నాడు అభిరామ్‌ బుంగమూతి పెట్టి.

‘పుట్టిరోజున నువ్వు అలా అలగకూడదు. నీ ఫ్రెండ్స్‌ అందరినీ నాకు పరిచయం చేయి’ అంటూ అభిరామ్‌ను పట్టుకుని స్నేహితుల వద్దకు తీసుకుని వచ్చాడు మావయ్య.

‘ఈయన మా మావయ్య. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌’ అంటూ స్నేహితులకు గర్వంగా పరిచయం చేశాడు అభిరామ్‌.

ఆయన అందరి పేర్లు అడిగి తెలుసుకున్నాడు. మరికొంత సమయం అభిరామ్‌ మావయ్య కొన్ని కొత్త కొత్త ఆటలు ఆడించాడు. చివరగా స్నేహితులందరూ ఇళ్లకు బయలుదేరుతూ.. తాము తెచ్చిన గిఫ్ట్‌ బాక్సులు అభిరామ్‌కు ఇవ్వసాగారు. మెరుస్తున్న కళ్లతో ఆ ప్యాకెట్లలో ఏమున్నాయో అనుకుంటూ వాటిని అందుకుంటూ.. థాంక్స్‌ చెబుతున్నాడు అభిరామ్‌.

ఇంతలో దీప, రఘు, శాంతి తాము తెచ్చిన మొక్కలున్న చిన్న కుండీలను పుట్టిన రోజు కానుకగా అభినందనలు చెబుతూ అభిరామ్‌కు అందించారు. వాటిని అందుకునేటప్పుడు అభిరామ్‌ మొహంలో చిరునవ్వు, కళ్లలోని మెరుపు మాయమవడం గమనించారు అభిరామ్‌ తండ్రి. ఆఖరుగా మావయ్య.. అభిరామ్‌కు కేకు తినిపించి అతని చేతిలో తాను తెచ్చిన బహుమతి ఉంచాడు.

దాన్ని చూస్తూనే అభిరామ్‌ కళ్లు పెద్దవయ్యాయి ఆనందంతో. అది ఒక కొత్త ట్యాబ్‌. దాంట్లో కార్టూన్‌ షోలు, సినిమాలు ఇలా ఎన్నో చూడొచ్చు. ఇంతకుముందు అభిరామ్‌ వాళ్ల మావయ్య ఇంటికి వెళ్లినప్పుడు ట్యాబ్లో తనకిష్టమైన కార్టూన్‌ షోలు చూసి అలాంటిది తనకు కావాలని పేచీ పెట్టాడు కూడా. అలాంటివి పిల్లలకు అవసరం లేదని, అతణ్ని అమ్మానాన్న మందలించారు. 

‘థాంక్యూ మావయ్యా! థాంక్యూ... థాంక్యూ...’ అంటూ ఆనందంతో దాన్ని అందుకొన్నాడు. స్నేహితులందరూ చుట్టూ ఉన్నా.. అభిరామ్‌ దృష్టి మాత్రం ట్యాబ్‌ మీదే ఉంది. అందరూ వెళ్లిపోయాక తనకొచ్చిన బహుమతులన్నీ పక్కన పెట్టి మావయ్య ఇచ్చిన ట్యాబ్‌ను ఆనందంగా ఆన్‌ చేశాడు.

మ్యూజిక్‌తో పాటు ‘హ్యాపీ బర్త్‌డే అభిరామ్‌’ అంటూ వచ్చింది స్క్రీన్‌ మీద. ‘భలే భలే’ అంటూ చప్పట్లు కొట్టాడు. తర్వాత ఒక కార్టూన్‌ షో చూసి నిద్రపోయాడు. మరునాడు ఉదయం నిద్ర లేస్తూనే అభిరామ్‌ తండ్రి వద్దకు వెళ్లి.. ‘నాన్న! నిన్న నా ఫ్రెండ్స్‌ ఇచ్చిన మొక్కల్ని మన గార్డెన్‌లో నాటుదామా’ అని అడిగాడు. కొడుకు వైపు ఆశ్చర్యంగా చూశాడు తండ్రి.

‘నిన్న మావయ్య ఇచ్చిన ట్యాబ్‌లో ఒక కార్టూన్‌ షో చూశాను. దాంట్లో మొక్కల వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, మనం ఎక్కువ మొక్కలు నాటితే గాలిలో ఆక్సిజన్‌ పెరుగుతుందని చెప్పారు. మన చుట్టూ ఉండే వాతావరణంలో కాలుష్యం కూడా తగ్గుతుందట నాన్నా! చెట్ల వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. అందుకనే మనం మా ఫ్రెండ్స్‌ తెచ్చిన మొక్కలు నాటుదాం. నేను ఇక నుంచి ప్రతిరోజూ కొంతసేపు మన తోటలో మొక్కలకు నీళ్లు పోసి అవి బాగా పెరిగేలా చూస్తాను. తర్వాత ప్రతి పండక్కి, మన ఇంట్లో అందరి పుట్టిన రోజులకు ఆ కార్టూన్‌ షోలో చెప్పినట్లుగా మొక్కలు నాటుదాం. కానుకలుగా మొక్కలనే ఇద్దాం. సరేనా, నాన్నా!’ అన్నాడు అభిరామ్‌.

‘‘అబ్బో! నీకు చాలా విషయాలు తెలిశాయి. ‘నేటిబాలలే రేపటి పౌరులు’ అంటారు కదా.. అలాగే ‘నేటి మొక్కలే రేపటి పర్యావరణ కల్పతరువులు’ అయి మనకు అన్ని రకాలుగా  ఉపయోగ పడతాయి. మొక్కలను నాటడం, చెట్లను సంరక్షించడం ద్వారా మనం సమాజానికి చాలా మేలు చేసిన వారమవుతాం’’ అంటూ అభిరామ్‌ తండ్రి అభిరామ్‌తో పాటు గార్డెన్లోకి నడిచారు. టెక్నాలజీ పేరుతో అభిరామ్‌ను ప్రకృతికి దూరం చేయకుండా దగ్గర చేసినందుకు, అభిరామ్‌ మామయ్యకు ఆయన మనసులోనే ధన్యవాదాలు తెలియజేశారు.

- ఈశ్వరి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని