ఆకలేస్తే హాంఫట్‌... కడుపునొప్పి ఫటాఫట్‌!

ఒక చల్లని సాయంత్రం వేళ, తాతయ్య చుట్టూ చేరి కథ చెప్పమని మారాం చేశారు మనవళ్లు. ‘అందరూ మీ హోంవర్కులు చేసుకున్నారా?’ అని తాతయ్య అడగ్గానే, పిల్లలందరూ ‘ఎప్పుడో పూర్తి చేసేశాం’ అని సమాధానమిచ్చారు.

Published : 20 Oct 2022 00:17 IST

ఒక చల్లని సాయంత్రం వేళ, తాతయ్య చుట్టూ చేరి కథ చెప్పమని మారాం చేశారు మనవళ్లు. ‘అందరూ మీ హోంవర్కులు చేసుకున్నారా?’ అని తాతయ్య అడగ్గానే, పిల్లలందరూ ‘ఎప్పుడో పూర్తి చేసేశాం’ అని సమాధానమిచ్చారు. దాంతో సరేనంటూ కథ చెప్పడం ప్రారంభించాడు తాతయ్య.

ఒక ఎలుక తన పిల్లతో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఎలుక పిల్లకి విపరీతమైన కడుపునొప్పి వచ్చింది.  ‘అమ్మా... కడుపునొప్పి, అమ్మా.. కడుపునొప్పి.. భరించలేకపోతున్నాను బాబోయ్‌!’ అంటూ కేకలు వేయసాగింది. ‘చెప్తే వినవు కదా.. కనిపించిన ప్రతి గడ్డీ తినడమే.. అది అరగకపోతే కడుపునొప్పి రాకుంటే ఇంక ఏమొస్తుంది మరి?’ అని చీవాట్లు పెట్టింది తల్లి. ‘పళ్లు దురద పెడుతుంటే నేనేం చెయ్యను. భరించలేక ఏదో ఒకటి కొరుకుతున్నాను’ అంది పిల్ల ఏడుస్తూ. ‘అలాగని ప్రతి ఒక్కటీ తినకూడదు. కొంచెంసేపు ఓర్చుకో.. దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్లి శొంఠికొమ్ము తీసుకొస్తాను. అది తింటే నొప్పి తగ్గుతుందని మా బామ్మ ఎప్పుడూ చెబుతుండేది’ అని దగ్గరలో ఉన్న ఇంట్లోకి వెళ్లింది. వంటింట్లోకి దూరి.. పోపుల పెట్టె ఎక్కడ ఉందో వెతికింది. అందులో తనకు కావాల్సింది కనిపించలేదు.

కాసేపు అటూ ఇటూ అంతా చూసింది. అలా వెతుకుతుండగా.. ఒక డబ్బాలో శొంఠి కొమ్ము దొరికింది. దాన్ని నోట కరచుకుని బయలుదేరడానికి సిద్ధపడింది. ఇంతలో ‘దడేల్‌’మని తలుపు తీసుకుని వంటింట్లోకి వచ్చాడు యజమాని. బిక్కు బిక్కుమంటూ అక్కడే ఓ మూలన నక్కింది తల్లి ఎలుక. ఓ పక్క పిల్ల కడుపునొప్పితో బాధపడుతోంది. వంటింట్లోకి వచ్చిన యజమానేమో ఎంతకూ అక్కడి నుంచి కదలడం లేదు. దానికి ఏం చెయ్యాలో తోచలేదు. కుక్కిన పేనులా ఓ మూలకు నక్కింది.

‘అబ్బా నొప్పి, అమ్మా నొప్పి’ అంటూ హాహాకారాలు చేయసాగింది పిల్ల ఎలుక. అక్కడే మాటువేసి ఉన్న ఓ దొంగపిల్లి ఆ విషయాన్ని గమనించింది. ‘ఓయ్‌ ఎలుక పిల్లా.. ఎందుకలా ఏడుస్తున్నావు?’ అని అడిగిందా పిల్లి. ‘కడుపు నొప్పిగా ఉంది. అస్సలు భరించలేకపోతున్నా’ అంది పిల్ల ఎలుక. ‘అవునా.. కడుపు నొప్పిని ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. నువ్వు నా దగ్గరికి వచ్చావంటే చిటికెలో వైద్యం చేస్తా’ అని తియ్యగా మాట్లాడసాగింది. ‘అమ్మో.. నేను అస్సలే రాను. నాకు చాలా భయం. మా అమ్మ శొంఠి తీసుకొస్తానని వెళ్లింది’ అని జవాబిచ్చింది పిల్ల ఎలుక. ‘అంత భయమెందుకు నీకు? నేనూ, మీ అమ్మా మంచి స్నేహితులం. శొంఠికొమ్ము తీసుకురావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. అందుకే, అప్పటివరకూ నిన్ను చూసుకోమని మీ అమ్మే నన్ను పంపింది. బయటకు వచ్చావంటే.. ఓ మంత్రం వేస్తాను. చిటికెలో నీ నొప్పి తగ్గుతుంది’ అని మాయమాటలు చెప్పింది పిల్లి.

‘అమ్మ వచ్చేవరకూ ఈ నొప్పిని భరించలేను. చచ్చిపోయేలా ఉన్నాను. అలా అయితే, ఇక అమ్మని ఎప్పటికీ చూడలేను’ అని లోలోపలే దిగులుపడింది అమాయకపు పిల్ల ఎలుక. గత్యంతరం లేక.. కలుగు నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి.. పిల్లి దగ్గరికి చేరుకుంది. తన పథకం పారినందుకు లోలోపలే పొంగిపోతూ.. ఆప్యాయంగా ఎలుక పిల్లని దగ్గరకు తీసుకుందది. పొట్టపై చేయి పెట్టి నెమ్మదిగా రాస్తూ.. ‘ఆకలి వేస్తే హాంఫట్‌.. కడుపునొప్పి ఫటాఫట్‌’ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివింది. వంటింట్లోంచి యజమాని కదలడంతో శొంఠి కొమ్ము పట్టుకుని పిల్ల దగ్గరికి పరుగుతీసింది తల్లి ఎలుక. ఇంకేముంది.. అది వచ్చి చూసేసరికి, మూతినిండా రక్తంతో.. చక్కగా నాలుక చప్పరిస్తూ కలుగు దగ్గరే కూర్చుంది పిల్లి.

దాన్ని చూడగానే తల్లి ఎలుక గుండెల్లో రాయిపడింది. ‘అయ్యో దేవుడా.. ఎంత పని జరిగిపోయింది. మాయదారి పిల్లి మాటలు నమ్మి నా బిడ్డ ప్రాణాలు పోగొట్టుకుంది. నాకు కడుపుకోతని మిగిల్చింది’ అంటూ లబోదిబోమని ఏడ్చింది తల్లి ఎలుక.

‘చూశారా పిల్లలు.. మోసపుమాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి. అలాగని, మంచీచెడు ఆలోచించకుండా మనం వారి ఉచ్చులో పడకూడదు. విచక్షణ కలిగి ఉండాలి. లేకపోతే పిల్ల ఎలుకలాగే మోసపోవాల్సి వస్తుంది’ అని కథ ముగించాడు తాతయ్య. ‘అలాగే తాతయ్యా..’ అంటూ ఇంట్లోకి పరుగులు తీశారు మనవళ్లు.

- కాశీవిశ్వనాథం పట్రాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని