మహారాజు.. గాడిద సవారీ!

ఉదయగిరి రాజ్యాన్ని వసంతుడు పాలించేవాడు. ఒకరోజు మంత్రి, సైన్యాధికారితో కలసి వసంతుడు వేటకు అడవికి బయలుదేరాడు. ఎంతైనా తన గుర్రానికి వేగం ఎక్కువ కావడంతో.. దాన్ని బాగా ఉరికించాడు రాజు. కాస్త నెమ్మదిగా వస్తుండటంతో మంత్రి, సైన్యాధికారి వెనకబడిపోయారు.

Published : 22 Oct 2022 00:10 IST

ఉదయగిరి రాజ్యాన్ని వసంతుడు పాలించేవాడు. ఒకరోజు మంత్రి, సైన్యాధికారితో కలసి వసంతుడు వేటకు అడవికి బయలుదేరాడు. ఎంతైనా తన గుర్రానికి వేగం ఎక్కువ కావడంతో.. దాన్ని బాగా ఉరికించాడు రాజు. కాస్త నెమ్మదిగా వస్తుండటంతో మంత్రి, సైన్యాధికారి వెనకబడిపోయారు. మార్గమధ్యలో ఓ వ్యక్తి గాడిద మీద కూర్చొని వెళుతూ రాజుకు కనిపించాడు. వెంటనే రాజు గుర్రాన్ని ఆపి.. ‘ఏమయ్యా.. నీ పేరేంటి..? నా గుర్రంలా నీ గాడిద దౌడు తీస్తుందా?’ అని ప్రశ్నించాడు ఎగతాళిగా.
‘అయ్యా.. నా పేరు రామయ్య. మీరు చూస్తే మహారాజులా ఉన్నారు. మీ గుర్రంతో నా గాడిద పోటీపడగలదా? ఏదో బరువులు మోయడానికి మాత్రమే నేను దీన్ని ఉపయోగిస్తాను. కాబట్టి ఇది అంతలా పరుగులు పెట్టదు’ అన్నాడతను. ‘మనం సరదాగా ఓ పందెం కాద్దాం’ అన్నాడు రాజు. ‘రాజా.. నాలాంటి చిన్నవాళ్లతో మీకు పందెం ఎందుకు? పైగా మీదేమో గుర్రం, నాదేమో గాడిద’ అని జవాబిచ్చాడా వ్యక్తి. ‘ముందైతే పందెం కాద్దాం. గెలిస్తే నీకు బహుమతి ఇస్తాను. ఒకవేళ నువ్వు ఓడిపోతే, నాకేమీ ఇవ్వనవసరం లేదు’ అన్నాడు రాజు. ‘ఈ జిడ్డు రాజు ఎక్కడ దొరికాడు?’ అని మనసులోనే అనుకున్నాడతను.

‘పందెం కాయకపోతే నిన్ను శిక్షిస్తాను’ అన్నాడు రాజు. ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా’ అని భయపడుతూనే సరేనన్నాడు రామయ్య. ‘అక్కడ దూరంగా కనిపిస్తున్న మర్రి చెట్టు వద్దకు చేరుకోవాలి. నీ గాడిద అంతలా పరుగు తీయదు కాబట్టి నువ్వు ముందుగా బయలుదేరు. నేను కాస్త ఆలస్యంగా వస్తాను’ అని నవ్వాడు రాజు. ‘అలాగే మహారాజా’ అని ముందుగా బయలుదేరాడతను. గాడిద నెమ్మదిగా వెళ్తూ వెళ్తూ మర్రి చెట్టు వద్ద ఆగింది. రాజే ముందుగా చేరుకొని ఉంటాడనుకున్నాడా వ్యక్తి. కానీ,
అక్కడ ఎంతవెతికినా రాజు కనిపించలేదు. చాలాసేపటి తర్వాత రొప్పుతూ గాయాలతో, మాసిన దుస్తులతో అక్కడకు వచ్చాడు రాజు.

‘నువ్వే గెలిచావు’ అని రామయ్యతో అన్నాడు రాజు. ‘ఏమైంది మహారాజా?’ అని అడిగాడతను. ‘దారిలో గొయ్యి చూసుకోకుండా.. నా గుర్రం పరుగు తీసింది. గొయ్యిలో పడటంతో గుర్రం కాలికి దెబ్బ తగిలి అక్కడికక్కడే కూలబడింది. దాంతో నేనే నడుచుకుంటూ వచ్చా’ అని వివరించాడు రాజు. ‘అయ్యో.. ఎంత ప్రమాదం జరిగింది.. ఇలా కూర్చోండి రాజా.. మీ గాయాలకు ఆకుపసరు రాస్తాను’ అని రాజును చెట్టు కింద కూర్చోబెట్టాడు. వెంటనే అటూఇటూ వెతికి కొన్ని ఆకులను తీసుకొచ్చాడు. వాటి పసరుతో రాజు శరీరంపైనున్న గాయాలకు రాశాడతను.

ఇంతలో ఆకలి వేస్తుందని రాజు అనడంతో.. గాడిదపైనున్న సంచిలోంచి రెండు రొట్టెలను తీసి ఇచ్చాడు. ‘మరి నీకు?’ అని అడిగాడు రాజు. ‘నాకు ఆకలిగా లేదు మహారాజా.. మీరు తినండి.. తరువాత ఈ నీళ్లు తాగండి’ అని ముంతను పక్కనే పెట్టి, గుర్రం పరిస్థితి చూసి వస్తానని వెళ్లాడు. గుర్రం కన్నీళ్లు కారుస్తూ పడుకొని ఉండటాన్ని గమనించిన రామయ్య.. దాని తలను నిమిరాడు. కాలికి పసరు రాసి.. కట్టుకట్టాడు. అది నడవలేకపోవడంతో.. దాన్ని అక్కడే వదిలి, తిరిగి రాజు దగ్గరకు వెళ్లాడు. ‘మహారాజా! గుర్రానికి చికిత్స చేశాను. కాసేపటికి లేచి.. కుంటుతూ నడవగలదు కానీ, దాని మీద స్వారీ చేసే అవకాశం లేదు’ అని అన్నాడు.

‘ఇక్కడి నుంచి ప్రధాన రహదారి చాలా దూరం. గుర్రం లేకుండా ఇప్పుడెలా వెళ్లాలి?’ అన్నాడు రాజు. ‘మహారాజా.. మీరు నడవలేరు. నా గాడిద మీదనే సవారీ చేయాల్సి ఉంటుంది. చీకటి పడేలోపే  అక్కడకు చేరుకోవాలి’ బదులిచ్చాడా వ్యక్తి. ‘సరే... గాడిద మీద సవారీ తప్పేలా లేదు’ అనుకుంటూ దానిమీద కూర్చోబోయాడు రాజు. ‘ఆగండి మహారాజా.. ఈ దుస్తుల్లో అయితే మిమ్మల్ని బాటసారులు గుర్తించే ప్రమాదం ఉంది. అందుకే, మీరు నా దుస్తులు ధరించండి. నేను మీవి వేసుకొని.. గుర్రాన్ని మెల్లగా నడిపిస్తూ చెరువు ఒడ్డునే ఉన్న మా ఇంటికి తీసుకెళతాను. రేపు మీ భటులను పంపిస్తే.. వారికి అప్పగిస్తాను’ అని చిరునామా చెప్పాడతను. సరేనని బయలుదేరాడు రాజు.

‘మరి నేను అక్కడకు చేరుకున్నాక గాడిదను ఎలా పంపను?’ అని అడిగాడు రాజు. ‘అయ్యా.. దానికి అన్ని దారులూ తెలుసు. ఎక్కడ వదిలినా అది మా ఇంటికి చేరుతుంది’ అన్నాడు రామయ్య. ‘నీ సహాయానికి గుర్తుగా.. ఇదిగో ఇది తీసుకో’ అంటూ తన ఉంగరాన్ని అతడికి ఇవ్వబోయాడు రాజు. ‘వద్దు రాజా.. ఉచితంగా వచ్చే సొమ్ముతో సోమరులం అవుతాము’ అంటూ సున్నితంగా దాన్ని తిరస్కరించాడు. ‘ఇకపైన ఎవ్వరినీ ఎగతాళి చేయకూడదు’ అనుకుంటూ గాడిదను ఎక్కి ముందుకు కదిలించాడు రాజు. కాసేపట్లోనే మంత్రి తనకు ఎదురయ్యాడు. ‘ఏమయ్యారు మహారాజా.. ఏం జరిగింది?’ అని కంగారుగా అడిగాడు. ‘రాజ్యానికి వెళ్లాక అంతా చెబుతాను’ అంటూ మంత్రి గుర్రం వెనక కూర్చొని బయలుదేరాడు. విషయం తెలుసుకొని, ‘రాజుకు తిక్క కుదిరింది’ అని అనుకున్నాడు మంత్రి.

- యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని