సర్కారు బడి.. అన్నీ ప్రత్యేకతలే మరి!

హలో ఫ్రెండ్స్‌.. ప్రభుత్వ పాఠశాలలంటే ఇంకా చిన్నచూపే. ప్రైవేటులో చదివితేనే గొప్పగా భావిస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా ఓ ప్రభుత్వ బడి అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Published : 22 Oct 2022 00:10 IST

హలో ఫ్రెండ్స్‌.. ప్రభుత్వ పాఠశాలలంటే ఇంకా చిన్నచూపే. ప్రైవేటులో చదివితేనే గొప్పగా భావిస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా ఓ ప్రభుత్వ బడి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆ స్కూల్‌కి ఓ ఛానల్‌తోపాటు ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే చకచకా ఇది చదివేయండి మరి..

కర్ణాటక రాష్ట్రంలోని హెగ్గడహళ్లి ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాల పిల్లలూ ఉత్సాహపడుతుంటారు. ఎందుకంటే, ఈ బడికి సొంతంగా ఓ ఛానల్‌ ఉంది. అంతేకాదు.. పచ్చదనం పెంపొందించడం, ప్లాస్టిక్‌ వ్యతిరేక కార్యక్రమాలు, ఆటలపోటీలు.. ఇలా ఒక్కటేమిటి చదువుతోపాటు బోలెడు ఇతర అంశాలూ ఇక్కడి విద్యార్థుల దినచర్యలో భాగం మరి.

వారానికో బులిటెన్‌..
హెగ్గడహళ్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సంతోష్‌.. బడికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను సోషల్‌ మీడియాలో పంచుకునేవారు. అవి చూసిన వారంతా ఆ విషయాల గురించి ఆయనను అడిగి వివరంగా తెలుసుకునేవారు. అలా అడిగే వారి సంఖ్య ఎక్కువ కావడంతో.. కొద్దిరోజులకు స్కూల్‌ ఆధ్వర్యంలో ఓ ఛానల్‌ ప్రారంభించానుకున్నారు. ఆ ఆలోచనను ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులతో పంచుకోవడంతో.. వారూ సరేనన్నారు. ఇంకేముంది.. వారిదగ్గరున్న సాంకేతిక పరికరాలతోనే విద్యార్థులతో స్కూల్‌కి సంబంధించిన విషయాలను న్యూస్‌ మాదిరి చెప్పించడం మొదలుపెట్టారు. అలా ఏరోజు వార్తలను ఆరోజు రికార్డు చేసి.. వాటన్నింటినీ ఓ బులిటెన్‌లా తీర్చిదిద్ది, ప్రతి ఆదివారం ఉదయం స్కూల్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేస్తున్నారు. ఏదైనా వారం బులిటెన్‌ రాకపోతే.. స్కూల్‌కి ఫోన్‌ చేసి మరీ అడుగుతున్నారట. జనరల్‌ నాలెడ్జ్‌ విషయాలను కూడా చిన్నారులు న్యూస్‌ రూపంలో వివరిస్తున్నారట. దీంతో మిగతా విద్యార్థులతోపాటు ఇతరులకూ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తోందని టీచర్లు, తల్లిదండ్రులు చెబుతున్నారు.

దత్తత.. రివార్డు
ఈ పాఠశాలలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి దాన్ని దత్తత తీసుకుంటారు. ఎవరైతే మొక్కను బాగా చూసుకుంటారో, వారికి విద్యా సంవత్సరం చివరిలో రివార్డు ఇస్తారట. బడి ఆవరణలో పండించిన కూరగాయలనే, మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్నారు. మిగిలిన వాటిని స్థానికంగా మార్కెట్‌లో అమ్ముతారు. వీటితోపాటు స్కూల్‌లో నాటకాలు, ఇతర ఆటలపోటీలూ తరచుగా నిర్వహిస్తుంటారు. వాటికి సంబంధించిన వీడియోలను సైతం యూట్యూబ్‌లో పెడుతుంటారు.

ప్లాస్టిక్‌ అంతానికి..
మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు రకరకాల ప్లాస్టిక్‌ కవర్లు కనిపిస్తుంటాయి కదా. చాలామంది వాటిని పట్టించుకోకుండా, వారి పని వారు చూసుకుంటారు. కానీ, ఈ పాఠశాల విద్యార్థులు మాత్రం.. లోగోలు ఉన్న కవర్లను సేకరించి, వాటిని ఆయా కంపెనీలకే తిరిగి పంపిస్తుంటారట. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించమని వారికి సూచిస్తున్నట్లు అన్నమాట. ‘మీరు చాలా అదృష్టవంతులు. మీ స్కూల్‌లో చదువుతోపాటు చాలా అంశాలు ఉంటాయి’ అని ఇతర బడుల్లో చదివే పిల్లలూ, వారి బంధువులూ.. ఈ పాఠశాల విద్యార్థులతో అంటూ ఉంటారట. నిజంగా వీరంతా చాలా లక్కీ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని