చిట్టికి ధైర్యం వచ్చిందోచ్‌!

చిన్నా అయిదో తరగతి చదువుతున్నాడు. ఒకరోజు సాయంత్రం బడి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. రహదారి పక్కన పొదల మాటున ఏదో మూలుగుతున్న శబ్దం రావడంతో ఒక్కసారి ఆగి పొదలకేసి పరిశీలనగా చూశాడు. అక్కడ ఒక చిలుక కింద పడి పోయి ఉంది.

Published : 24 Oct 2022 00:44 IST

చిన్నా అయిదో తరగతి చదువుతున్నాడు. ఒకరోజు సాయంత్రం బడి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. రహదారి పక్కన పొదల మాటున ఏదో మూలుగుతున్న శబ్దం రావడంతో ఒక్కసారి ఆగి పొదలకేసి పరిశీలనగా చూశాడు. అక్కడ ఒక చిలుక కింద పడి పోయి ఉంది.

అలసిపోయిన రెక్కలతో పైకెగర లేక అలా పడి ఉందని చిన్నా గ్రహించాడు. ఆలస్యం చేయకుండా చిలుకను తన చేతుల్లోకి తీసుకుని, నీళ్లు తాగించాడు. సేద తీరిన చిలుక పైకి గాలిలోకి చూసింది. ‘పైకి ఎగిరి వెళ్లిపోవాలని ఉందా?’ అని చిన్నా, చిలుకను అడిగాడు. అప్పుడు చిలుక ఇలా పలికింది.

‘అమ్మా, నేను కలిసే బయలు దేరాం. కానీ నేను దారి తప్పాను. అలసిపోయి కింద పడ్డాను. అమ్మ తప్పకుండా నన్ను వెతుక్కుంటూ వస్తుంది. నాకా నమ్మకం ఉంది. ఆదరించిన వారి దగ్గర ఉంటేనే ఏ ఆపదా రాదని అమ్మ అంటూ ఉంటుంది. అమ్మ వచ్చేవరకూ నీ దగ్గర ఉండవచ్చునా?’ అని అడిగింది దీనంగా.

‘అయ్యో! నువ్వంతలా అడగాలా? మా ఇంటికి తీసుకెళతాను చిట్టీ!’ అన్నాడు చిన్నా. ‘‘నన్ను ‘చిట్టీ’ అని పిలిచావు. మరి నీ పేరు ఏంటి?’’ అని అడిగింది చిలుక.

‘చిన్నా!’ అని చెప్పాడు. ‘భలే! భలే!..నా పేరు చిట్టి, నీ పేరు చిన్నా... మనిద్దరి పేర్లు చాలా బాగున్నాయి’ ఆనందిస్తూ అంది చిట్టి. సంతోషంగా చిన్నాతో కలసి ఇంటికి వెళ్లింది. చిన్నా, చిట్టికి రోజూ ద్రాక్ష పండ్లు, జామ పండ్లు పెడుతున్నాడు.

చిట్టి ఆనందంగా తింటూ చిన్నాతో ఎన్నో కబుర్లు చెబుతోంది. ఒకరోజు ‘చిన్నా! నన్ను పంజరంలో పెట్టలేదే?’ అడిగింది చిట్టి. ‘నా మీద నమ్మకంతో నువ్వు మా ఇంటికి వచ్చావు. నాకు చెప్పకుండా ఎగిరి వెళ్లిపోవని నాకు తెలుసు. నేస్తం మీద నాకా నమ్మకం ఉంది!’ అన్నాడు చిన్నా. ఆ మాటలు చిట్టికి ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ‘చిన్నా! నా ప్రియ నేస్తం.. నువ్వు’ అంటూ నవ్వుతూ చూసింది.

ఒకరోజు చిన్నా, నాన్న కొన్న బొమ్మ తుపాకీని పేలుస్తున్నాడు. తుపాకీ చేసే శబ్దం చిట్టికి ఇబ్బంది కలిగించింది. ‘చిన్నా! ఏమిటిది? ఎందుకిలా చేస్తున్నావు?’ అడిగింది అర్థంకాక! ‘చిట్టీ! రెండు రోజుల్లో దీపావళి పండుగ వస్తోంది. దీపావళి అంటే పిల్లలందరికీ ఇష్టమే’ అన్నాడు చిన్నా.

‘దీపావళి! అంటే?’ పూర్తిగా తెలుసుకోవాలని అడిగింది చిట్టి. ‘పూర్వం రోజుల్లో నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టేవాడు. ఎన్నో బాధలు పడేలా చేసేవాడు. ప్రజల బాధలు విన్న శ్రీకృష్ణుడు, సత్యభామా సమేతుడై నరకాసురుణ్ని సంహరించాడు. అలా ప్రజల బాధలను తొలగించాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఆ ఆనందానికి గుర్తుగా అందరూ దీపావళి పండుగ జరుపుకొంటారు. మతాబులు, చిచ్చుబుడ్లు వెలిగిస్తారు. టపాసులు పేల్చుతారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. అర్థమైందా?’ అన్నాడు చిన్నా.

‘భలేగా చెప్పావు. కానీ టపాసులు, తుపాకులు కాల్చుతుంటే వచ్చే చప్పుడు వినలేను. నాకు భయం’ అంది చిట్టి. ‘నాకు ఎంతో ఇష్టం. కానీ నేస్తం కోసం ఈ రోజు నుంచి కాల్చను. పేల్చను. సరేనా?’ అంటూ చిన్నా తుపాకీని పక్కన పెట్టేశాడు. తనకోసం చిన్నా చేసిన పని చూసి చిట్టికి ముచ్చట వేసింది. ఆ రోజు దీపావళి పండుగ. చిన్నా ఉదయమే స్నానం చేశాడు. కొత్త దుస్తులు వేసుకున్నాడు. అమ్మ చేసిన లడ్డు తిన్నాడు. చిట్టికి కూడా పెట్టాడు.

‘చిన్నా! దీపావళికి నీకు ఇష్టమైన మందుగుండు సామగ్రి కొనుక్కుందాం. బజారుకు వస్తావా?’ అని నాన్న అడిగాడు. ‘ప్రమిదలు, కొవ్వొత్తులు తప్ప టపాసులు, మతాబులు వద్దు’ అని చిన్నా, నాన్నతో అన్నాడు. ‘ఏ? ఎందుకని? నీకు భయం లేదుగా?’ ఆశ్చర్యంగా అడిగాడు నాన్న.

‘చిట్టికి అవి కాల్చడమంటే భయం. ఆ చప్పుడు వినలేనని చెప్పింది. అందుకే వద్దు నాన్నా!’ అని చెప్పాడు చిన్నా. ‘సరే!’ అన్నాడు నాన్న. అప్పుడే చిట్టిని వెతుక్కుంటూ తల్లి చిలుక వచ్చింది. అమ్మా! వచ్చావా?’ అంటూ చిట్టి తన అమ్మ ఒడిలో వాలిపోయింది. ‘నువ్వు క్షేమంగా ఉన్నావు. చాలా సంతోషం. నిన్ను చూడగానే నాకు దిగులు పోయింది!’ అని తల్లి చిలుక, చిట్టికి ముద్దులు పెడుతూ అంది.

‘చిన్నా నన్ను ఎంత బాగా చూసుకున్నాడో! నువ్వు లేవని తప్ప, మరే దిగులు లేకుండా నన్ను చూసుకుంటున్నాడు!’ చిట్టి అమ్మతో నవ్వుతూ అంది. చిన్నాను అమ్మకు చూపించింది. చిట్టి వాళ్ల అమ్మ చిన్నాకు కృతజ్ఞతలు చెప్పింది.
‘అమ్మతో వెళతాను!’ అని చిట్టి చిన్నాతో చెప్పింది. ‘అలాగే! అమ్మ తోడు లేకుండా ఎక్కడికి వెళ్లకు. జాగ్రత్త!’ అంటూ చిన్నా, చిట్టికి వీడ్కోలు చెప్పాడు.

‘అలాగే! నేస్తమా!’ అంటూ చిట్టి అమ్మతోపాటుగా గాలిలోకి ఎగురుకుంటూ వెళ్లిపోయింది. చిట్టి ఇక్కడ లేదన్న దిగులుతో చిన్నా తన గదిలోకి వెళ్లాడు. ‘దిగులు పడకు చిన్నా! చిట్టి వెళ్లిపోయిందిగా! టపాసులు కొనుక్కుందామా?’ చిన్నాలో దిగులు తగ్గించేందుకు ఊరడింపుగా అన్నాడు నాన్న.

‘చిట్టికి మాటిచ్చాను. అవి కాల్చనని. కొనవద్దు నాన్నా!’ అని చిన్నా బదులిచ్చాడు. అంతలో ‘చిన్నా!’ అన్న పిలుపు విని ఆశ్చర్యపోతూ బయటకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. తన ఎదురుగా ఉన్న చిట్టిని చూసి ఆనందంతో మురిసిపోయాడు.

‘నన్ను అమ్మలా ఆదరించావు. నాన్నలా అన్నీ తెచ్చిపెట్టావు. నా కోసం నీకిష్టమైన టపాసులు కాల్చనన్నావు. ఇన్ని చేసిన నా నేస్తాన్ని వదిలి నేను రాలేనని అమ్మతో చెప్పాను. నిన్ను వదిలి ఉండడం నాకిష్టం లేదన్నాను. అమ్మ నా కోరిక మన్నించింది. తానే నా కోసం రోజూ ఇక్కడకు వస్తానని చెప్పింది. అంతే కాదు! నువ్వు నా తోడుగా ఉన్నప్పుడు నాకెందుకు భయం. నీతో పాటు నేనూ టపాసులు కాల్చుతాను.సరేనా!’ అంటూ చిట్టి నవ్వుతూ చిన్నాకేసి చూసింది.

‘నువ్వు నా ప్రియ నేస్తం! చిట్టీ! నువ్వు లేకుండా నేనూ ఉండలేను’ చిన్నా ఆనందిస్తూ బదులిచ్చాడు. నాన్నతో టపాసులు, మతాబులు కొనిపించాడు. రాత్రిపూట దీపాల వెలుగులో జాగ్రత్తగా వాటిని కాల్చాడు. చిట్టికూడా ధైర్యంగా కాల్చింది. అది చూసిన చిన్నా అమ్మా, నాన్నలు.. ‘మా చిట్టికి ధైర్యం వచ్చింది!’ అని మురిసిపోతూ అన్నారు.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని