మారిన దృష్టి కోణం!

కృష్ణాపురంలో ఉండే సురేంద్ర బాగా చదువుకున్నాడు. కానీ ఉద్యోగ ప్రయత్నాలు విఫలం కావడంతో వ్యాపారం చెయ్యాలనుకున్నాడు. ఆ విషయం తండ్రితో చెబితే.. ‘వ్యాపారమంటే మాటలు కాదు. పెట్టుబడి కావాలి. నా దగ్గర అంత డబ్బులేదు.

Published : 26 Oct 2022 00:04 IST

కృష్ణాపురంలో ఉండే సురేంద్ర బాగా చదువుకున్నాడు. కానీ ఉద్యోగ ప్రయత్నాలు విఫలం కావడంతో వ్యాపారం చెయ్యాలనుకున్నాడు. ఆ విషయం తండ్రితో చెబితే.. ‘వ్యాపారమంటే మాటలు కాదు. పెట్టుబడి కావాలి. నా దగ్గర అంత డబ్బులేదు. ఉన్నదంతా నీ చదువుకే ఖర్చు పెట్టాను. పట్టణంలో ఉన్న సత్యం మావయ్యకు వ్యాపారాలు ఉన్నాయి. ఆయనను కలిస్తే దారి చూపిస్తాడు’ అన్నాడు.

పట్టణం వెళ్లి మావయ్యను కలిసి తన పరిస్థితి చెప్పాడు సురేంద్ర. దానికాయన ‘నాకున్న వ్యాపారాల్లో సైకిళ్ల టోకు వ్యాపారం ఒకటి. నీ దగ్గర పెట్టుబడి లేకపోయినా వంద సైకిళ్లు అరువు ఇస్తాను. అవి అమ్మితే ఒక్కోదానికి అయిదు వందలు లాభం వస్తుంది. అందులో సగం తీసుకుని మిగతాది నాకివ్వు’ అన్నాడు. సైకిళ్లను ఎంతకు అమ్మాలో కూడా చెప్పాడు. సురేంద్ర సరేననగానే.. ‘రేపు మంచిరోజు. వ్యాపారం ప్రారంభించు’ అని ఒక వ్యాపార స్థలాన్ని బాడుగకు ఇప్పించాడు. సురేంద్ర పగలు దుకాణం దగ్గర ఉంటూ ఉదయం, సాయంత్రాలు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి సైకిళ్లను అమ్మాడు.

తొలిరోజు ఆరు సైకిళ్లు అమ్మాడు. అతడికి చాలా సంతోషం కలిగింది. ‘ఇలా అమ్మితే దాదాపు పదిహేడు రోజుల్లో వంద సైకిళ్లు అమ్మేస్తాను. ఒక్కోదానికి అయిదు వందలు చొప్పున యాభై వేల లాభంలో సగం నాదే’ అనుకున్నాడు. కానీ అతడనుకున్నట్లు జరగలేదు. తరువాత రోజు కేవలం మూడు మాత్రమే అమ్మగలిగాడు. మూడోరోజు ఒక్కటీ అమ్ముడుపోలేదు. నాలుగో రోజున, అయిదో రోజున రెండేసి అమ్మాడు. ఆరు, ఏడు రోజుల్లో ఒక్కొక్కటి మాత్రం అమ్మాడు. ఏడో రోజు సాయంత్రానికి అతడిలో నిరాశ ఆవహించింది.

‘ఇంత ఘోరంగా ఉందేమిటి పరిస్థితి? వారమంతా కష్టపడితే పదిహేను సైకిళ్లు అమ్మాను. వ్యాపారానికి కూడా పనికి రానేమో’ అనుకున్నాడు. వెంటనే దుకాణం మూసేసి మామయ్య కొట్టుకు వెళ్లాడు. సురేంద్రను చూసి ఏమైందని అడిగాడు సత్యం.  
‘నేను వ్యాపారానికి కూడా సరిపోననిపిస్తోంది. మిగతా సైకిళ్లు ఇచ్చేస్తాను’ అన్నాడు బాధగా సురేంద్ర. అసలేం జరిగిందో వివరంగా చెప్పమని సత్యం అడగడంతో సురేంద్ర వివరించి చెప్పాడు.

‘ఇలా.. రోజురోజుకీ నా వ్యాపార పనితనం తగ్గిపోతుంది. రేపటి నుంచి ఇవి కూడా అమ్మలేనేమోనని భయమేస్తోంది’ అన్నాడు. కాసేపు ఆలోచించిన సత్యం.. ఏదో ఆలోచన స్ఫురించగానే ఫక్కున నవ్వాడు. సురేంద్రకు ఆశ్చర్యం, కోపం ఒకేసారి కలిగాయి. ‘నన్ను చూస్తే ఎందుకూ పనికిరాని వాడినని నవ్వొచ్చిందా?’ అనడిగాడు ఉక్రోషంగా. ‘నిన్ను చూసి నవ్వలేదు’ అన్నాడు సత్యం.

‘ఇక్కడ మనిద్దరమే ఉన్నాం. నన్ను కాకపోతే మరెవరిని చూశావు?’ అనడిగాడు సురేంద్ర. ‘నిజమే చెబుతున్నా.. నిన్ను చూసి నవ్వలేదు. కానీ నీ దృష్టికోణం చూస్తే నవ్వొచ్చింది’ అని జవాబిచ్చాడు సత్యం.

‘అదేంటి? నా దృష్టికోణం చూసి నవ్వొచ్చిందా? ఆశ్చర్యంగా ఉందే’ అన్నాడు సురేంద్ర. ‘అవును. నీకెన్ని సైకిళ్లిచ్చాను? ఇప్పుడెన్ని ఉన్నాయి?’ అనడిగాడు సత్యం. ‘వంద ఇచ్చావు. ఇప్పుడు ఎనభై అయిదు ఉన్నాయి’ అని చెప్పాడు సురేంద్ర. ‘మొదటి రోజు వందతో ప్రారంభమైన నీ స్టాకు ఏడో రోజుకు ఎనభై అయిదుకు తగ్గింది కదా. వారం రోజుల్లో పదిహేను సైకిళ్లు అమ్మడం చిన్న విషయం కాదు. ఆ లెక్కన నెలకు అరవై అమ్ముతావు. ఒక్క వారంలోనే ఎత్తూ, పల్లం రెండూ చూశావు. అంటే అధిక అమ్మకాలు, సున్నా అమ్మకం కూడా, సరాసరిన ఇంత కంటే బాగానే వ్యాపారం చేస్తావు తప్ప తగ్గదు’ అని ధైర్యం నూరిపోశాడు సత్యం.

‘అవునా’ అని ఆశ్చర్యపోయాడు సురేంద్ర.

‘వ్యాపారం పెరిగే కొద్దీ లాభాలు పెరుగుతాయి. నీ దుకాణం గురించి ప్రజలకు తెలిస్తే వాళ్లే వచ్చి కొంటారు. నీ వ్యాపారం పదింతలౌతుంది’ అన్నాడు సత్యం. ‘మీ మాటలు విన్న తరువాత నమ్మకం కలిగింది’ అని సురేంద్ర చెప్పగానే, సత్యం ‘నువ్వు రోజూ తగ్గుతున్న నీ అమ్మకాలను ఓటమి అనుకున్నావు. విచారంగా ఇక్కడకొచ్చావు. అదే సమస్యను నేను దృష్టి కోణం మార్చి చూశాను. నీ ఓటమిలో గెలుపును వెతికాను. దాన్నే నీకు వివరించి చెప్పాను. ఎవరికైనా సరే ఓటమి కలిగితే అది పూర్తి ఓటమి అవ్వదు. ప్రతి ఓటమి కూడా అనుభవమనే పాఠం నేర్పుతుంది. ఆ అనుభవం మళ్లీ తప్పులు జరగకుండా పెట్టుబడిగా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఓటమి పొందినా సరే చేసిన కృషి వృథాగా పోదు. మరింత రాటుదేలేలా చేస్తుంది. అది గుర్తిస్తే సగం సమస్యలు తీరిపోతాయి’ అన్నాడు.

సత్యం మాటలతో తన మీద విశ్వాసం పెంచుకున్న సురేంద్ర ధైర్యంగా వ్యాపారం చేశాడు. తరువాత కాలంలో అతడికి అపజయం కలగలేదు. ఆత్మవిశ్వాసం సడలలేదు.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని