కుందేళ్ల కష్టం.. ఏనుగు సలహా!

ఆహారం తిన్నాక, వాటి నివాసాల వైపు బయలుదేరింది కుందేళ్ల గుంపు. వాటిని చూసిన నక్క పరుగు పరుగున ఆ గుంపును వెంబడించింది. గమనించిన కుందేళ్లు.. వేగాన్ని పెంచాయి. కొంతదూరంలో తోడేలు ఎదురు రావడంతో.. వాటి పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్లుగా మారింది.

Published : 28 Oct 2022 00:07 IST

ఆహారం తిన్నాక, వాటి నివాసాల వైపు బయలుదేరింది కుందేళ్ల గుంపు. వాటిని చూసిన నక్క పరుగు పరుగున ఆ గుంపును వెంబడించింది. గమనించిన కుందేళ్లు.. వేగాన్ని పెంచాయి. కొంతదూరంలో తోడేలు ఎదురు రావడంతో.. వాటి పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్లుగా మారింది. దిక్కుతోచక గజగజా వణుకుతూ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. కొన్ని క్షణాల్లోనే ఒకదాని తరవాత మరొకటి ఎరుపు రంగులో వాంతులు చేసుకోవడం ప్రారంభించాయి. మరికొన్నింటి మూతులు ఎరుపెక్కాయి. ఏం జరిగిందో తెలియక.. వాటి దగ్గరకు వెళ్లడానికి కూడా ఆలోచనలో పడ్డాయి నక్క, తోడేలు.

‘తోడేలు మిత్రమా! కుందేళ్ల ఆరోగ్య పరిస్థితి బాగోలేనట్లుంది. వాటిని రక్షించేందుకు నీ సాయం కావాలి’ అని అడిగింది నక్క. అది సరేనంది. వాటి మాటలకు గుంపులో కొన్ని కుందేళ్లు ఆశ్చర్యపోయాయి. ‘మీ ప్రాణాలకు భయం లేదు. మాతో రండి. ఏనుగు వైద్యుడు దగ్గరకు తీసుకెళ్తాం’ అని వాటితో చెప్పాయి నక్క, తోడేలు. కుందేళ్లు సమాధానం ఇవ్వకపోవడంతో.. ఏనుగునే ఇక్కడికి తీసుకొస్తామని వెళ్లాయవి. అప్పటికే ఎలుగు, జిరాఫీ, కోతి, ఏనుగులతో మృగరాజు సమాలోచనలు జరుపుతోంది. ‘మృగరాజా.. కుందేళ్లు రక్తం కక్కుకుని బాధపడుతున్నాయి’ అంటూ ఆందోళనగా చెప్పింది నక్క. ‘వాటిని కాపాడేందుకు ఏనుగుని పంపండి’ అని విన్నవించుకుంది తోడేలు. ‘రక్త వాంతులకు కారణాలు కనుక్కున్నారా?’ గాబరాపడుతూ అడిగింది మృగరాజు. ‘ఏమో రాజా.. ఆ పరిస్థితి చూసి మాకే భయమేసింది’ అన్నాయవి. ‘వాటికి తక్షణమే వైద్యం అందించి, బతికించమని మిమ్మల్ని కోరేందుకే వచ్చాం’ అని సమాధానమిచ్చాయి. ‘తోటి జీవుల పట్ల మీ దయా హృదయాలను మెచ్చుకోవాల్సిందే’ అని ఎలుగు కితాబివ్వడంతో నవ్వేసింది ఏనుగు.

‘నిజమేనా?’ అని వెటకారంగా అడిగింది జిరాఫీ. నక్క, తోడేళ్ల ప్రభుభక్తిని శంకించడం ఏమీ బాగోలేదంది ఎలుగు. ‘వాంతులతో కుందేళ్లు బతికిపోయాయి కానీ, లేకపోతే ఇవి రెండూ ఈపాటికి పండగ చేసుకునేవి’ అంటూ కిసుక్కున నవ్వేసింది జిరాఫీ. ‘వాటికి మంచి చేద్దామని ముందుకు వస్తే మాపైనే నిందలు వేస్తారా?’ అని కోపగించుకున్నాయి నక్క, తోడేలు. అదే సమయంలో.. మీ ఆగడాలు పెరిగాయని గతంలో కుందేళ్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేసింది మంత్రి కోతి. మృగరాజు కోపంగా నక్క, తోడేలు వైపు చూసింది. విషయం రాజుకు తెలియడంతో అవి రెండూ కంగుతిన్నాయి.

‘మాది స్వార్థబుద్ధి అని అంటున్నారు సరే.. తోటి జీవుల పట్ల మీకు జాలి, దయ లేవా? అవి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే సాయపడాలన్న ఆలోచన కూడా మీకు రావడం లేదా?’ అని ప్రశ్నించింది నక్క. ‘అంత అవసరం లేదులే..’ అని తేలిగ్గా తీసిపారేసింది ఏనుగు. ‘కుందేళ్ల ప్రాణాలంటే మీకు లెక్కలేనట్టుగా ఉంది’ అంది తోడేలు. ఇంతలో మృగరాజు కలగజేసుకొని.. కుందేళ్ల దగ్గరకు వెళ్లిరమ్మని ఏనుగును పురమాయించింది. ‘మృగరాజా.. కుందేళ్లు నిజంగా ప్రమాదంలో ఉంటే, అవే ఇక్కడకు వచ్చి ఉండేవి. ఇప్పటి మన అత్యవసర భేటీకి అంతరాయం కలగకుండా చూడండి’ అంటూ అడ్డుకుంది జిరాఫీ.

‘రక్తపు వాంతులు చేసుకొని వణుకుతూ కూలబడ్డాయని చెబుతుంటే.. వాటిని ఇక్కడికి రమ్మని సలహా ఇస్తున్న జిరాఫీని ఏమనాలి? మీరు చెప్పినా కదలని ఏనుగును ఎలా శిక్షించాలి?’ అంటూ ఊగిపోయింది తోడేలు. ఇంతలో మృగరాజుకు కూడా కోపం ముంచుకొచ్చింది. ‘నక్క, తోడేలు చెప్పినట్టు ఆ పొదల దగ్గరికే వెళ్దాం పదండి. ఎలాగైనా వాటిని రక్షించుకుందాం’ అంటూ కదిలింది. మిగతా జంతువులూ మృగరాజు వెంటే నడవసాగాయి.

‘రాజా.. కుందేళ్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదు’ అంది ఏనుగు. ‘అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు?’ ప్రశ్నించింది మృగరాజు. ఈ మధ్య నక్క, తోడేలు కలిసి కుందేళ్ల వెంట పడుతున్నాయి. అవి ప్రాణాలను రక్షించుకోవడమో, దొరికిపోవడమో జరుగుతోంది. కొద్దిరోజుల కిందట.. నా దగ్గరకు వైద్యానికి వచ్చిన కుందేళ్లే ఈ మాట చెప్పాయి. వాటి బారి నుంచి రక్షించుకునేందుకు సలహా కూడా అడిగాయి’ అంది ఏనుగు. ‘మరి ఇప్పుడు ఈ రక్తపు వాంతులేంటి?’ అని అనుమానంగా అడిగింది సింహం. మన అడవికి ఆనుకొని ఉన్న పొలంలో బీట్‌రూట్‌ సాగు చేస్తున్నారు. కుందేళ్లు అక్కడికి వెళ్లి, దుంపలు తిని వస్తుంటాయి. అందుకే వాటి మూతులు ఎరుపెక్కాయి. అప్పుడే తిని, భయంతో పరుగెత్తడంతో అదే రంగులో వాంతులు చేసుకొని ఉంటాయి’ అని తనిచ్చిన సలహాను వివరించింది ఏనుగు. అసలు విషయం తెలుసుకున్న నక్క, తోడేలు అవాక్కయ్యాయి. తీరా పొదల దగ్గరకు వెళ్లి చూస్తే.. అక్కడ కుందేళ్లు లేకపోవడంతో ఏనుగు చెప్పింది నిజమేననుకుంది మృగరాజు. చేతికి అందిన ఆహారం తప్పిపోవడంతో నిరాశపడ్డాయి నక్క, తోడేలు. సింహం ఆగ్రహానికి ఎక్కడ బలి కావాల్సి వస్తుందోనని మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాయవి.

- బెహరా మోక్షజ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని