‘శ్రీ’రస్తు.. విజయోస్తు!

మనం మన స్కూల్లో క్విజ్‌ పోటీల్లో గెలిస్తేనే తెగ సంబరపడిపోతాం. ఈ నేస్తం మాత్రం ఏకంగా జాతీయస్థాయిలో మొదటి ర్యాంక్‌ సంపాదించింది. అదీ అంతరిక్షానికి సంబంధించిన క్విజ్‌లో!

Published : 28 Oct 2022 00:07 IST

మనం మన స్కూల్లో క్విజ్‌ పోటీల్లో గెలిస్తేనే తెగ సంబరపడిపోతాం. ఈ నేస్తం మాత్రం ఏకంగా జాతీయస్థాయిలో మొదటి ర్యాంక్‌ సంపాదించింది. అదీ అంతరిక్షానికి సంబంధించిన క్విజ్‌లో! నిజంగా గ్రేట్‌ కదూ..! మరింకెందుకాలస్యం.. ఈ కథనం చదివేయండి.

కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన హృదశ్రీ ఆర్‌ కృష్ణన్‌కు ప్రస్తుతం 13 సంవత్సరాలు. శ్రీ ఇప్పుడు ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇటీవల ‘ఇండియన్‌ స్పేస్‌ సైన్స్‌ ఒలింపియాడ్‌’ (ఐఎస్‌ఎస్‌ఓ) ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల కోసం జాతీయస్థాయిలో క్విజ్‌ పోటీలు జరిగాయి. ఇందులో మన శ్రీ పాల్గొని విశేష ప్రతిభ కనబరిచింది.

తనకిష్టమైన బహుమతి!
ఈ క్విజ్‌ పోటీల్లో హృదశ్రీ ఏకంగా మొదటిర్యాంక్‌ సొంతం చేసుకుంది. దీంతో ‘శాటిలైట్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌’ అనే అంశం మీద పేపర్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడానికి జూనియర్‌ లెవల్‌లో అర్హత సాధించింది. అలాగే తను ఓ బంగారు పతకం, ప్రశంసాపత్రం, తనకెంతో ఇష్టమైన టెలిస్కోప్‌ను గెలుచుకుంది. అలాగే కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందించే యూఎస్‌ఎస్‌ స్కాలర్‌షిప్‌నకు కూడా అర్హత సాధించింది.

రెండు నెలల కష్టం...
ఈ క్విజ్‌ పోటీల్లో పాల్గొనే అర్హత సాధించడం కోసం శ్రీ చాలా కష్టపడింది. ఏకంగా రెండు నెలలు ప్రతిరోజూ పుస్తకాలతో కుస్తీపట్టింది. అంతరిక్షం అనే సబ్జెక్టు మీద క్విజ్‌ అంటేనే చాలా కష్టం. కానీ తనకిది ఎంతో నచ్చిన అంశం కాబట్టి ఇష్టంగా సన్నద్ధమైంది.

వందల మందిలో...
ఈ క్విజ్‌ పోటీలో దేశం నలుమూలల నుంచి కొన్ని వందల మంది పాల్గొన్నారు. వాళ్లందరూ ఎంతో గట్టి పోటీ ఇచ్చారు. అయినా శ్రీ వాళ్లందరి కన్నా విశేష ప్రతిభ కనబరిచి మొదటి ర్యాంక్‌ సాధించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తన స్నేహితులు అందరితో శెభాష్‌ అనిపించుకుంది. ఇంకా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

స..రి..గ..మ..ప...
కేవలం క్విజ్‌ మాత్రమే కాదు, సంగీతమన్నా మన శ్రీ చాలా ఇష్టపడుతుంది. అలా అని కేవలం వినడం మాత్రమే చేస్తుందని అనుకునేరు. వయొలిన్‌ కూడా చక్కగా వాయిస్తుంది. త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరగనున్న యూత్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం కోసం సాధన చేస్తోంది. మరి మన శ్రీ... ఆ పోటీల్లోనూ చక్కగా రాణించి, బహుమతి సొంతం చేసుకోవాలని మనం మనసారా కోరుకుందామా! ఇంకేం మరి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేయండి.. సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు