విజయ రహస్యం!

అవంతీపురానికి రాజు జయదత్తుడు. అతని భార్య మాలినీదేవి. ఆ దంపతులకు లేక లేక ఒక కుమార్తె జన్మించింది. ఆ చిన్నారికి ‘విజయ’ అనే పేరు పెట్టారు.

Published : 29 Oct 2022 01:07 IST

అవంతీపురానికి రాజు జయదత్తుడు. అతని భార్య మాలినీదేవి. ఆ దంపతులకు లేక లేక ఒక కుమార్తె జన్మించింది. ఆ చిన్నారికి ‘విజయ’ అనే పేరు పెట్టారు. అల్లారుముద్దుగా పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు. ఆమెకు యుక్తవయసు రావడంతో వివాహం చేయడం కోసం స్వయంవరం ప్రకటించాడు మహారాజు జయదత్తుడు.

ఆ స్వయంవరానికి చుట్టుపక్కల రాజ్యాల యువరాజులందరూ హాజయ్యారు. వారికి రకరకాల పోటీలు నిర్వహించిన తరువాత.. చివరకు ప్రతాపుడు, సుదీప్తుడు, రణదీపుడు అనే ముగ్గురు యువరాజులు సమఉజ్జీలుగా మిగిలారు. వీరి ముగ్గురిలో ఒకరిని యువరాణిని వరించే వ్యక్తిగా ఎంపిక చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ బాధ్యత మంత్రి వివేకుడికి అప్పగించాడు. దానికి మంత్రి అంగీకరించి వారి ముగ్గురికి పరీక్షలో భాగంగా.. ఒక సందేశాన్ని తయారు చేసి, దానికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టండి అన్నాడు.

‘సూర్యోదయపు వేళ పంచకల్యాణిపై బయలుదేరి, ముక్కుసూటిగా ప్రయాణించి అక్కడ ఉన్న విఘ్నాధిపతి ఆలయాన్ని సందర్శించి అక్కడ ఉత్తరాన్ని తీసుకుని అతని తండ్రిని మనస్సులో నమస్కరించి అలా ముందుకు సాగితే పితృవాక్య పరిపాలకుని నమ్మినబంటు ఆలయం కనిపిస్తుంది. అక్కడ దశ దక్షిణ సమర్పించి పయనిస్తూ వెళితే సతీ సమేత ఏకపత్నీవ్రతుడి ఆలయంలో విజయం మీ కోసం ఎదురు చూస్తుంటుంది. చేజిక్కించుకుని తిరిగి మా రాజ్యానికి చేరటమే’ ఇదే సందేశం అని వివరించాడు.

దానికనుగుణంగా ప్రతాపుడు.. సూర్యోదయపు వేళ పంచకల్యాణిపై బయలుదేరి మధ్యలో కనిపించిన విఘ్నాధిపతి అంటే వినాయకుడి ఆలయాన్ని సందర్శించి అక్కడ ఏ విధమైన ఉత్తరం కనబడక వెనుదిరిగాడు.

ఇక సుదీప్తుడు.. సూర్యోదయపు వేళ అన్నారు అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కనుక తూర్పుదిశగా పంచకల్యాణిపై బయలుదేరి ముక్కుసూటిగా ప్రయాణించి వెళ్లేసరికి వినాయకుడి ఆలయం కనిపించింది. అక్కడ ఉత్తరం తీసుకుని అంటే అక్కడి నుంచి ఉత్తరం వైపుగా అని భావించి, ఆ దిశగా పయనించాడు. పితృవాక్య పరిపాలకుడి నమ్మినబంటు ఆలయం అంటే.. హనుమంతుని ఆలయాన్ని సందర్శించి, హుండీలో పది వరహాలు సమర్పించాడు. ముందుకు సాగి పోగా ఒకచోట సీతారామచంద్రమూర్తి ఆలయం కనిపించింది. కానీ అక్కడ ఏ విధమైన విజయానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు.

ఇక రణదీపుడు.. మంత్రి వివేకుడి సందేశాన్ని ఒకటి రెండుసార్లు మననం చేసుకున్నాడు. ఆ సందేశాన్ని ఇలా అర్థం చేసుకున్నాడు. సూర్యోదయపు వేళ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే తూర్పుదిశగా, పంచకల్యాణిపై అంటే పంచ అనగా అయిదు అని అర్థం అనగా తూర్పుదిశగా అయిదు యోజనాలు ముక్కుసూటిగా ప్రయాణిస్తే అక్కడ విఘ్నాధిపతి అంటే వినాయకుడి ఆలయం వస్తుందన్నమాట. ఆ ఆలయాన్ని సందర్శించి విఘ్నాలు ఏమీ రానీయవద్దని ప్రార్థించి అక్కడ ఉత్తరం తీసుకుని అంటే అక్కడి నుంచి ఉత్తరం వైపుగా ప్రయాణించమని అర్థం. అలా ఎంత దూరం వెళ్లాలో తెలియచేయటం కోసం అతని తండ్రి అంటే శివుడు అంటే ముక్కంటి అంటే మూడు యోజనాలు ప్రయాణించేసరికి అక్కడ పితృవాక్యపరిపాలకుడు అంటే రాముడు, రాముని నమ్మినబంటు హనుమంతుడి ఆలయం వస్తుందన్నమాట, ఆ ఆలయాన్ని సందర్శించి దశ దక్షిణ అంటే అక్కడ నుంచి దశ అంటే పది యోజనాలు, దక్షిణ అంటే దక్షిణ దిశగా పయనించి వెళితే అక్కడ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయం వస్తుందని, ఆ అలయంలో యువరాణి విజయ ఎదురు చూస్తుందని, ఆమెను చేజిక్కించుకుని తీసుకురమ్మని పరోక్షంగా ఆ సందేశం అని అర్థం చేసుకున్నాడు.

సందేశంలో ఉన్న విధంగానే ప్రయాణించి యువరాణి విజయను చేపట్టి తిరిగి అవంతీపురానికి చేరుకున్నాడు. రాజ్యాన్ని పరిపాలించే యువరాజుకు ఎదుటి వ్యక్తుల మాటల్లో అంతరంగాన్ని సూక్ష్మంగా గ్రహించే నేర్పు ఉండాలి. ఈ పరీక్షలో రణదీపుడు నెగ్గినందుకు మంత్రి వివేకుడు ఎంతో సంతోషించాడు. యువరాణి విజయతో కోటకు చేరుకున్న రణదీపుణ్ని రాజదంపతులు స్వాగతించారు. తర్వాత రణదీపుడికి యువరాణి విజయను ఇచ్చి అంగరంగవైభవంగా వివాహం జరిపించారు.

- కొమ్ముల వెంకట సూర్యనారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని