మూడు కొండ గొర్రెలు

ఓ అడవిలో మేత కోసం వెతుకుతూ వెళ్తున్న.. మూడు కొండ గొర్రెలకు ఓ పెద్ద బండరాయిపైన మొలిచిన పచ్చటి చిగుర్లు కనిపించాయి. అది చూడగానే వాటికి నోరూరింది. ఎత్తయిన రాళ్లను అవలీలగా ఎక్కగలిగే సామర్థ్యం వాటికి ఉండటంతో.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా గొర్రెలన్నీ బండరాయి మీదకు చేరాయి.

Updated : 31 Oct 2022 00:55 IST

అడవిలో మేత కోసం వెతుకుతూ వెళ్తున్న.. మూడు కొండ గొర్రెలకు ఓ పెద్ద బండరాయిపైన మొలిచిన పచ్చటి చిగుర్లు కనిపించాయి. అది చూడగానే వాటికి నోరూరింది. ఎత్తయిన రాళ్లను అవలీలగా ఎక్కగలిగే సామర్థ్యం వాటికి ఉండటంతో.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా గొర్రెలన్నీ బండరాయి మీదకు చేరాయి. చిగుర్లను తింటూ.. ఆకలి తీర్చుకోవడంతో నిమగ్నమైన ఆ గొర్రెలకు అనుకోని ఆపద ముంచుకొచ్చింది.

ఆహారాన్ని వెతుక్కుంటూ, వేటకు బయలుదేరిన ఓ తోడేళ్ల గుంపు దూరం నుంచే కొండ గొర్రెలను చూసింది. ‘ఆహా.. ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న గొర్రె మాంసంతో విందు భోజనం ఈరోజుతో నిజం కాబోతోంది’ అంటూ లొట్టలేసుకుంటూ బండరాయి దగ్గరకు చేరుకున్నాయి. దానిచుట్టూ తిరగడం ప్రారంభించాయి.

తోడేళ్లలో కొన్ని బండరాయి పైకి ఎక్కి, గొర్రెలను వేటాడే ప్రయత్నం చేయసాగాయి. మరికొన్ని కిందనే ఉండి.. అవి ఎప్పుడు కిందకు దిగుతాయోనని ఎదురుచూడసాగాయి. ప్రమాదాన్ని పసిగట్టిన కొండ గొర్రెలు భయంతో బండరాయి అంచుకు చేరుకున్నాయి.

ఎప్పుడూ రాళ్లూరప్పల మధ్య తిరిగే కొండ గొర్రెలకు అలా అంచుల్లో జారిపోకుండా నిలబడటం అలవాటే. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు వాటిని విడిచిపెట్టేది లేదు’ అనుకుంటూ వాటిని వేటాడేందుకు తోడేళ్లు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ గొర్రెలు నిలబడ్డ బండ అంచులకు అవి చేరుకోలేకపోతున్నాయి. ఇంకా ముందుకు వెళ్తే.. జారిపోయి ప్రాణాలు గాల్లో కలిసేలా ఉన్నాయనే భయం పట్టుకుంది. అలా ఎన్నివిధాలుగా, ఎంతసేపు ప్రయత్నం చేసినా గొర్రెలను చేరుకోలేకపోయాయి తోడేళ్లు. ఇక లాభం లేదనుకొని తోడేళ్ల గుంపు సమాలోచనలో మునిగింది.

ఆ గుంపులో ఓ తోడేలు.. ‘మనం ఇక్కడే కాచుకుని ఉందాం. గొర్రెలు ఎప్పటికైనా కిందకు దిగాల్సిందే. అప్పుడు మనకు అవి ఆహారం కావాల్సిందే. నోటి దాకా వచ్చిన ఆహారాన్ని విడిచిపెట్టేది లేదు’ అని అంది. అందుకు మిగతావీ సరేనన్నాయి. బండ చుట్టూనే తిరుగుతూ.. అక్కడే తిష్ఠ వేసిన తోడేళ్లను చూసి కొండ గొర్రెలు భయపడ్డాయి.

ఒకవైపు కాళ్లలో సత్తువ తగ్గిపోతుంది. ఇంకొన్ని గంటలు అలాగే నిలబడితే.. పట్టుతప్పి జారిపోయేలా ఉన్నాయవి. ఆ మూడింటిలో కొమ్మురాజు అనే గొర్రె మాత్రం కాస్త ధైర్యంగా ఉంది. మిగతా వాటిలా భయపడకుండా.. గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని ఆలోచించసాగింది. తనను నమ్మి వచ్చిన మిత్రులను ఎలాగైనా కాపాడుకోవాలనుకుంది కొమ్మురాజు.

ప్రాణభయంతో వణుకుతున్న రెండు గొర్రెల వైపు చూసి ‘మిత్రులారా.. భయపడకండి. మీ ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. మీకు నేను అండగా నిలబడతాను. మొదట నేను కిందికి దిగి పారిపోతాను. వెంటనే తోడేళ్లు నన్ను వెంబడిస్తాయి. అప్పుడు మీరిద్దరూ మరోదిశగా పారిపోయి ప్రాణాలు దక్కించుకోండి. నేను బతికి ఉంటే మిమ్మల్ని మళ్లీ వచ్చి కలుస్తాను’ అంది కొమ్మురాజు.

దాని నిర్ణయానికి మిగతా రెండు గొర్రెలు ఆందోళన పడ్డాయి. ‘వద్దు మిత్రమా.. ముగ్గురం కలిసే వచ్చాం.. కలిసే తోడేళ్లపైన పోరాడదాం. అంతేకానీ, నిన్ను బలికానివ్వం’ అన్నాయి. అయినా మాట వినని కొమ్మురాజు.. కిందికి దిగి పరుగెత్తడం ప్రారంభించింది. సమయం కోసం ఎదురుచూస్తున్న తోడేళ్లన్నీ, కొమ్మురాజుని వేటాడడానికి పరుగులు తీశాయి.

క్షణం ఆలస్యం చేయకుండా రెండు గొర్రెలు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి. తమ స్థావరాలకు క్షేమంగా చేరుకున్న కొండ గొర్రెలు.. జరిగిన విషయాన్ని సహచరులతో చెప్పుకొని బాధపడ్డాయి. కొమ్మురాజు కోసం ఆ రోజంతా ఎదురుచూశాయి. అయినా, ఫలితం లేదు. మరుసటి రోజు సాయంత్రానికి కొమ్మురాజు తిరిగి రావడంతో.. ఇతర గొర్రెలు ఎంతో ఆనందపడ్డాయి. తాను తోడేళ్లను ఏమార్చి ఎలా తప్పించుకున్నానో సవివరంగా చెప్పింది కొమ్మురాజు. తనను నమ్మి వచ్చిన వారిని రక్షించడమే కాకుండా, తను కూడా ప్రాణాలతో బయటపడిన కొమ్మురాజును జాతి గొర్రెలన్నీ ప్రశంసించాయి.

- వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని