స్నేహమంటే ఇదే!

కొలను దగ్గర ఒక కొంగ, ఒక బాతు చేపలను వేటాడుతూ కడుపు నింపుకొంటుండేవి. ఆ రెండింటి మధ్య స్నేహం చిగురించింది. వాటి అన్యోన్యతను ఒక కాకి చూసింది. అది అసలే జిత్తులమారి. దానికి తోడు సులభంగా ఆహార సంపాదనకు ఎత్తువేయడంలో దిట్ట కూడా.

Published : 01 Nov 2022 00:17 IST

కొలను దగ్గర ఒక కొంగ, ఒక బాతు చేపలను వేటాడుతూ కడుపు నింపుకొంటుండేవి. ఆ రెండింటి మధ్య స్నేహం చిగురించింది. వాటి అన్యోన్యతను ఒక కాకి చూసింది. అది అసలే జిత్తులమారి. దానికి తోడు సులభంగా ఆహార సంపాదనకు ఎత్తువేయడంలో దిట్ట కూడా. దాంతో కష్టపడకుండా చేపలు పొందేందుకు ఎత్తువేసింది. తాను కూడా వేటాడే నిమిత్తం కొలనుపై ఎగురుకుంటూ వెళ్లి అరవడం మొదలు పెట్టింది. ఆ గోల వల్ల ఆ రెండింటికీ చేపల వేట కష్టమైపోతుండేది. ‘కాకి మిత్రమా! నీ గోల వల్ల చేపలు మాకు అందకుండా పోతున్నాయి. నీ అనవసరపు అరుపులతో మేము పస్తులుండాల్సి వస్తోంది’ అని బాధపడుతూ చెప్పాయవి.

‘నేను కూడా మీ మిత్రుడినే కదా.. ఆ వేటేదో నాకూ నేర్పి నా కడుపు నింపే మార్గం చూపించొచ్చుగా.!’ అని తెలివిగా అడిగింది కాకి. కాకి ఎత్తును గ్రహించిన అవి... ‘నువ్వా అరుపులు ఆపితే నీ కడుపు నింపుతాం’ అని ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అప్పటి నుంచి కాకికి ఆహార సంపాదన నల్లేరు మీద నడక అయిపోయింది. రోజులు గడుస్తుండగా.. ఆ కొలనుకు దూరప్రాంతం నుంచి ఓ కొంగల గుంపు వచ్చింది. వాటిని అతిథులుగా భావించాయి కొంగ, బాతు.
మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుందన్న చందాన, ఇప్పుడు తక్కువ చేపలు దొరకడం వల్ల కాకికి అందించే ఆహారంలో కోత పెడుతుండేవా రెండు.

దాంతో కాకి అహం దెబ్బతింది. ‘మిత్రులారా! మనం మనం ఒక ప్రాంతం వాళ్లం. కొలను కూడా మన ప్రాంతంలోనే ఉంది. వచ్చిన గుంపునకు ప్రాధాన్యం ఇస్తూ నన్ను మరచిపోతున్నారు. ఇక నుంచి రోజూ నా ఆకలిగోల వినిపిస్తే కానీ నా బాధ మీకు తెలిసేట్లు లేదు’ బెదిరించినట్లు తన అక్కసును వెళ్లగక్కింది. ‘మిత్రమా! దొరికినవి అందరం పంచుకుంటున్నాం’ సర్దిచెప్పింది కొంగ. కాకికి ఒళ్లు మండింది. ‘ఎన్నైనా చెప్పండి.. మీరంతా ఒక్కటే’ అని ఆరోపించింది. దానికి అవి బాధ పడ్డాయి. 

అప్పటి నుంచి తమ ఆహారం తగ్గించుకొని, కాకిని సంతృప్తి పరిచేవి. అవకాశవాదికి ఆకలెక్కువ అన్న చందాన.. అయినా కాకి సంతృప్తి చెందలేదు. ఎలాగైనా ఆ రెండింటినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండేది. అందులో భాగంగా, చివరకు కొంగల గుంపును వెళ్లగొట్టేందుకూ వెనకాడవద్దని సలహా కూడా  ఇచ్చింది. తిండికోసం వచ్చిన వాటిని వెళ్లగొట్టడం జాలి లేని వారు చేసేపని. దానికి మేము వ్యతిరేకం’ అని గట్టిగానే సమాధానమిచ్చాయవి. ‘తనకు మాలిన ధర్మం, మొదలు చెడ్డ బేరం ఒక్కటే! ముందు మన కడుపు నిండాక మరో ఆలోచన చేయాలి. వాళ్లను వెళ్లిపోమని నేనే చెబుతాను’ అంటూ కొంగల గుంపు దగ్గరకు వెళ్లి.. మా కొలను ఖాళీ చేయండంటూ అరిచి గోల పెట్టింది కాకి.

‘మా ప్రాంతంలో ఇప్పుడు దట్టమైన మంచు కురుస్తూ.. ఆహారం దొరకని పరిస్థితి ఉంది. అందుకే ఇక్కడికి వలస వచ్చాం’ అంటూ తమ ఆవేదనను వినిపించింది గుంపులోని ఓ కొంగ. ‘ఆకలి ఎవరికైనా ఒక్కటే.. మీ తిరుగు ప్రయాణంలో మీతోపాటు నేను వస్తే.. అతిథిలా నన్ను గౌరవించి కావలసినంత ఆహారం అందివ్వగలరా?’ దురుసుగా ప్రశ్నించింది కాకి. ‘అదెంత భాగ్యం? నువ్వు రావాలి కానీ, నీకు ఇష్టమొచ్చినంత తిండిని లెక్కకు మించి పెడతాం’ ఒప్పుకొంది కొంగల గుంపు. విజయ గర్వంతో కొంగ, బాతు వైపు చూసింది కాకి. ‘మిత్రమా! నీ కోరిక సబబుగా లేదు’ అన్నాయవి. ‘చేతగాని వాళ్లు పలికే మాటలు ఇలానే ఉంటాయి’ అని  వాటిని ఎద్దేవా చేసింది కాకి.

కొద్దిరోజులు గడిచాక, కొంగల గుంపు.. మర్నాడు తమ ప్రయాణం గురించి బాతు, కొంగలతోపాటు కాకికీ చెప్పాయి. ‘ఆడిన మాట తప్పరుగా, మీతో పాటు నేనూ వస్తాను’ అంది కాకి.

కాకి తొందరపాటును గుర్తించిన కొంగ, బాతు.. ‘మిత్రమా! ఒక్కసారి ఆలోచించు’ అంటూ వారించాయి. ‘నేను సుఖపడిపోతానేమోనని మీరు కుళ్లుతున్నారుగా’... అంటూ నింద వేసింది కాకి. మర్నాడు కొంగల గుంపుతో పాటు కాకి బయలుదేరుతూ ఆ రెండింటికీ వీడ్కోలు చెప్పింది. ‘నేను కూడా వస్తున్నా’ అంటూ కొంగ దాన్ని వెంబడించింది. బాతు ఆశ్చర్యపోయింది. ‘మొత్తానికి నా వెంటే వస్తున్నావు’ అని వెటకారంగా అంది కాకి. 

అన్నీ గాల్లో ఎగురుకుంటూ ప్రయాణిస్తున్నాయి. కాకి తను పొందబోయే ఆతిథ్యం గురించి ఊహించుకుంటూ ఎగురుతుంది. కొంతదూరం పోయాక సముద్రం దాటాల్సి వచ్చింది. ఈత వచ్చిన కొంగల గుంపు అక్కడక్కడ సముద్రపు నీటిలో సేదతీరుతూ, ఎగురుకుంటూ తమ గమ్యం వైపు ప్రయాణం చేస్తున్నాయి. పాపం కాకికి మాత్రం ఈత రాక చాలా దూరం ఎగిరాక.. అలసిపోయి చివరకు రెక్కల సత్తువ తగ్గి.. నీట మునిగే పరిస్థితి వచ్చింది. వెనకనే వెంబడిస్తున్న కొంగ అది గమనించింది.

‘కాకి మిత్రమా! అందుకే ఈ ప్రయాణాన్ని వద్దన్నది. అందాకా నాపై వాలి సేద తీరు’ అంటూ నీటి మధ్యలో ఆగింది కొంగ. కొంగల గుంపు మాత్రం ప్రయాణం ఆపలేదు. కొంగపై కొద్దిసేపు వాలి కన్నీరు కార్చింది కాకి. ‘నేను ఒంటరిగా వచ్చి ఉంటే.. నా మూర్ఖత్వపు ఆలోచనకు తగిన శాస్తి జరిగి ఉండేది. నిన్ను ఎల్లవేళలా ఇరకాటంలో పెట్టినా.. అవేవీ మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు నాకు ప్రాణభిక్ష పెట్టావు. నన్ను క్షమించు. స్నేహమంటే ఏంటో తెలిసొచ్చింది’ అంది కాకి. ‘ఇక వెనుదిరిగి మన ప్రాంతానికి మనం వెళ్లిపోదాం’ అని నవ్వుతూ అంది కొంగ. 

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని