నక్క జిత్తులు!

జంతువులు, పక్షుల ఫిర్యాదుతో నక్కను అడవి నుంచి వెళ్లగొట్టాడు మృగరాజు. అలా అడవి నుంచి బయటకు వచ్చిన నక్క దగ్గరలో ఉన్న ఓ పల్లెకు చేరింది. ఆ ఊరికి చివరనున్న గుడిసెలో నివసించే అవ్వతో.. ‘నేను నీకు అన్ని విధాలా సహాయపడతాను.

Updated : 02 Nov 2022 05:00 IST

జంతువులు, పక్షుల ఫిర్యాదుతో నక్కను అడవి నుంచి వెళ్లగొట్టాడు మృగరాజు. అలా అడవి నుంచి బయటకు వచ్చిన నక్క దగ్గరలో ఉన్న ఓ పల్లెకు చేరింది. ఆ ఊరికి చివరనున్న గుడిసెలో నివసించే అవ్వతో.. ‘నేను నీకు అన్ని విధాలా సహాయపడతాను. ఏది పెడితే అది తింటాను. నన్ను నీతో ఉండనివ్వు’ అని బతిమాలింది. నక్కను చూసి జాలి పడి, సరేనంది అవ్వ. ఆరోజు నుంచి నక్క, అవ్వకు సహాయం చేస్తూ... ఆమె దగ్గర వంట ఎలా చెయ్యాలో నేర్చుకుంది. వంట బాగా చేయడం వచ్చాక.. మా వాళ్లని ఒకసారి చూసి వస్తానని అక్కడి నుంచి బయలుదేరి, అటువైపుగా ఉన్న మరో అడవిలోకి ప్రవేశించింది. నేరుగా అక్కడి మృగరాజుని కలసి.. ‘రాజా.. నేను వంటలు నేర్చిన నక్కను. పల్లెకు ఆవల ఉన్న అడవిలోని మృగరాజుకు నేనే చాలా కాలం వండి పెట్టాను. ఇక అక్కడ ఏమీ తోచక ఇలా మీ అడవికి వచ్చాను. మీరు అనుమతి ఇస్తే.. మీకు కూడా రుచికరమైన భోజనం తయారు చేసి పెడతాను’ అంది వినయంగా.

‘మాకు వండిన మాంసం ఎందుకు.. వేటాడి పచ్చిదే తింటాం’ అన్నాడు మృగరాజు. ‘ప్రభువులు క్షమించాలి.. అలా పచ్చి మాంసం తినడంతోనే మా రాజు అనారోగ్యానికి గురయ్యాడు. చాలా కాలం బాధపడ్డారు. ఆ బాధ మీకు రాకూడదని నేను అనుకుంటున్నా. నా వంట మీకు నచ్చితేనే ఇక్కడ ఉంటాను.. లేకపోతే మరో చోటికి వెళ్లిపోతాను’ అంది. మృగరాజుకు నక్క వినయం నచ్చింది. ‘సరే.. ముందు వంట చెయ్యి. నాకు నచ్చితే ఇక్కడే ఉందువు. నీకేం కావాలో ఈ ఎలుగుబంట్లను అడిగి తెప్పించుకో’ అని చెప్పింది. మృగరాజు అనుమతి లభించగానే చాలా సంతోషించింది నక్క. ‘ఇక అవ్వ దగ్గర ఆ కాయలు, దుంపలు తినే బాధ తప్పింది నాకు. రాజుతోపాటే నేనూ తింటూ హాయిగా కాలం గడిపేయవచ్చు’ అనుకుంటూ వంటకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంది. పల్లెకు వెళ్లి.. కావాల్సిన దినుసులు కూడా తెచ్చుకుంది. రాళ్లతో పెద్ద పొయ్యి తయారు చేసింది. ఎండు పుల్లలు తెప్పించింది. మృగరాజు వేటాడిన జంతువును వెంటనే గుహకు చేర్చాలని ఎలుగులను ఆదేశించింది.

ఆ రోజు మృగరాజు వేటాడిన దుప్పిని గుహకు చేర్చాయి ఎలుగులు. దాన్ని ముక్కలుగా కోసి కారం, ఉప్పు, మసాలా దట్టించి వండింది నక్క. మధ్యమధ్యలో పచ్చి మాంసం తింటూ.. తన అదృష్టానికి పొంగిపోయింది. మంచి ఆకలితో వచ్చిన మృగరాజుకు.. తామరాకుల్లో వండిన మాంసం వడ్డించింది. అంతవరకూ రుచీ పచీ లేకుండా పచ్చి మాంసం తిన్న మృగరాజుకు.. నక్క వంట బాగా నచ్చింది. ‘శెభాష్‌’ అని దాని వంటని మెచ్చుకుంది. అలా నక్క మాయలో పడిపోయిన మృగరాజు.. ఆరోజు నుంచి అది చెప్పిన జంతువును చంపి ఎలుగులతో గుహకు పంపించసాగింది. ఎప్పుడో ఆకలి అయినప్పుడు మాత్రమే వేటకు వచ్చే రాజు.. రోజూ వస్తుండటంతో జంతువులన్నీ కలవర పడ్డాయి. ఒకరోజు అవన్నీ సమావేశమయ్యాయి. దీనికంతటికీ కారణం కొత్తగా వచ్చిన నక్క అని నిర్ణయానికొచ్చాయి. ‘ఇలా చేసిందనే ఆ అడవి నుంచి దాన్ని తరిమేశారని తెలిసింది’ అంది కొంగ. ‘మరి ఆ నక్క పీడ పోయేది ఎలా?’ అని దిగులుగా అడిగింది లేడికూన.

‘మనం ఇప్పుడు మృగరాజుకి చెప్పినా.. వినే స్థితిలో లేడు. పూర్తిగా దాని వంట మాయలో పడిపోయింది’ అంది నెమలి. ‘ముందు దాని దినచర్య తెలపండి. అప్పుడు దానికి ఎలా బుద్ధి చెప్పాలో చెబుతాను’ అంది కుందేలు. ఆ బాధ్యతను కోతికి అప్పగించింది. ఆరోజు లేడి మాంసం తినాలని అనుకుంది నక్క. అనుకున్నదే తడవుగా.. ‘మహారాజా.. లేడిని వేటాడి తీసుకురండి. కొత్తిమీర, కరివేపాకు.. కలిపి ఇగురు చేస్తాను. మీ ఆరోగ్యానికి చాలా మంచిది’ అంది. సరేనంటూ వేటకు వెళ్లింది మృగరాజు. ఈలోగా నక్క వంటకు అన్నీ సిద్ధం చేయసాగింది. అంతా గమనించిన కోతి.. మిత్రుల దగ్గరకు చేరుకొని సంగతి చెప్పింది. కుందేలు ఇచ్చిన సలహా మేరకు.. ఎలుగుబంటిని కలిసింది కోతి. విషయం చెప్పి.. మత్తు వచ్చే మందు కావాలని అడిగింది. వెంటనే చుట్టుపక్కల వెతికి, కొన్ని ఆకులు తీసుకొచ్చింది ఎలుగుబంటి. వాటిని పసరుగా చేసి.. కోతికి అందించింది.

దాన్ని ఒక డొప్పలో తీసుకుని.. సింహం గుహ వద్దకు చేరింది. ఆక్కడ నక్క వంటచేయడంలో మునిగిపోయింది. అప్పటికే అక్కడికి చేరిన కాకులు కావ్‌.. కావ్‌.. అని అరవడం మొదలెట్టాయి. ‘ఎందుకే అలా అరుస్తున్నారు?’ అంటూ గరిటతో బయటకు వచ్చింది నక్క. ‘ఏమీలేదు నక్క బావా.. మాకు కూడా నీ వంట రుచి చూడాలని ఉంది’ అంటూ మాటల్లోకి దింపాయవి. ఇంతలో కోతి గుహలోకి దూరి.. డొప్పలోని పసరును వంట పాత్రలో కలిపేసింది. ‘వెళ్లండి.. వెళ్లండి’ మృగరాజు వచ్చే సమయమైందంటూ కాకులను తరిమి గుహలోకి వచ్చింది నక్క. గరిటెతో కూరని కలుపుతూ.. వంట పూర్తి చేసింది. అప్పుడే వచ్చిన మృగరాజుకు వేడి వేడిగా వడ్డించింది. ‘ఈరోజు రుచి ఇంకా బాగుంది’ అంటూ స్పృహ తప్పి పడిపోయింది మృగరాజు. దాంతో సింహానికి ఏమైందోనని నక్కకు భయం పట్టుకుంది. ఎవరూ చూడకముందే.. అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంది. క్షణాల్లోనే అడవిని దాటేసింది. సాయంత్రానికి మృగరాజుకు మెలకువ వచ్చి చూసేసరికి నక్క కనిపించలేదు. జిత్తులమారి పీడ విరగడ కావడంతో అడవి జంతువులన్నీ సంతోషించాయి.

- కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు