పికా.. అనే నేను!

హాయ్‌ నేస్తాలూ...! బాగున్నారా? నేను చూడ్డానికి కుందేల్లా ఉన్నాను కదూ..! కానీ కాదు. నా పేరు పికా. నేను ఎక్కువగా కొండాకోనల్లో జీవిస్తుంటాను. ఈ రోజు ఇలా మిమ్మల్ని పలకరించి పోదామని వచ్చాను.

Published : 02 Nov 2022 00:20 IST

హాయ్‌ నేస్తాలూ...! బాగున్నారా? నేను చూడ్డానికి కుందేల్లా ఉన్నాను కదూ..! కానీ కాదు. నా పేరు పికా. నేను ఎక్కువగా కొండాకోనల్లో జీవిస్తుంటాను. ఈ రోజు ఇలా మిమ్మల్ని పలకరించి పోదామని వచ్చాను.  మరి నా గురించి విశేషాలు తెలుసుకుంటారా!

నేను ఎక్కువగా ఆసియా ఖండం, ఉత్తర అమెరికాలో జీవిస్తుంటాను. అదీ కొండాకోనల్లో. నేను గుండ్రంగా చిన్న చిన్న చెవులతో, శరీరమంతా మెత్తని వెంట్రుకలతో ఉంటాను. నేను కాస్త కుందేలులా కనిపిస్తాను కానీ.. కుందేలును మాత్రం కాదు. నేను ఆసియా ఖండంలో ఎక్కువగా హిమాలయాలు, ఆ చుట్టుపక్కల పర్వతప్రాంతాల్లో కనిపిస్తుంటాను. దాదాపు రెండువేల అడుగుల ఎత్తున్న పర్వతాల మీద కూడా హాయిగా బతికేయగలను. లద్దాఖ్‌లోనూ మా వాళ్లున్నారు.

నేను ఈల వేేస్తే...

పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు.. నేను చూడ్డానికి బుజ్జిగానే ఉంటాను కానీ.. చాలా గట్టిగా కూత పెడతాను. అది అచ్చం ఈలలానే ఉంటుంది. అందుకే కాబోలు నన్ను ‘ఈల వేసే కుందేలు’ అని కూడా కొందరు పిలుస్తుంటారు. నేను ఎక్కువగా చల్లగా ఉండే ప్రాంతాల్లో బతకడానికే ఇష్టపడుతుంటా. నాకు పర్వత ప్రాంతాలంటే చాలా ఇష్టం. ఆ రాళ్లలోనే నా ఇంటిని ఏర్పాటు చేసుకుంటాను.

చలికాలంలో....

నాకు చల్లని ప్రాంతాలంటే ఇష్టమే కానీ, చలికాలంలో మరీ చల్లగా ఉంటుంది కదా! అందుకే నేను ఎక్కువగా నా ఇంటి నుంచి బయటకు రాను. అందుకే చలికాలానికి ముందే నాకు కావాల్సిన ఆహారాన్ని తెచ్చుకుని ఇంట్లో దాచుకుంటాను. కొద్ది కొద్దిగా తింటూ.. చలికాలాన్ని వెచ్చగా గడిపేస్తా.

ఉష్ణోగ్రతలు పెరిగితే ఉసూరే...

నేను ఎక్కువ ఉష్ణోగ్రతలను అస్సలు తట్టుకోలేను. 25.5 డిగ్రీల కంటే ఎక్కువ వేడి ఉంటే బతకలేను. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కదా. అందుకే మేం చాలా కొద్ది ప్రాంతాలకే పరిమితమవుతున్నాం. మేం చిరు జీవులం. 15 నుంచి 23 సెంటీమీటర్ల వరకే పెరుగుతాం. 12 నుంచి 350 గ్రాముల వరకు బరువు తూగుతాం. మా ఆహారపు అలవాట్లు కూడా కుందేళ్లను పోలి ఉంటాయి. మేం చిన్న చిన్న చెట్ల పొదలు, గడ్డి జాతి మొక్కలను ఆహారంగా తీసుకుంటాం. మాలో కొన్ని రకాలు చనిపోయిన పక్షుల్నీ తింటాయి తెలుసా. ముఖ్యంగా వీటిని చలికాలంలో బొరియల్లో దాచుకుని మరీ ఆహారంగా తీసుకుంటాయి.

ఏడేళ్ల వరకు...

మేం దాదాపు ఏడేళ్ల వరకు బతుకుతాం. కానీ ఈలోపే మాలో చాలా వరకు చనిపోతాయి. ఎందుకంటే మాకు శత్రువులు ఎక్కువ. నక్కలు, గద్దలు, డేగలు మమ్మల్ని వేటాడతాయి. మేం జీవించగలిగే భౌగోళిక పరిస్థితులు పరిమితంగా ఉండటం, ఇతర జంతువుల వేట వల్ల మేం ప్రస్తుతం అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాం. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. సరే ఉంటా మరి.. బై.. బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని