భయమా.. భక్తా?

అడవిలో నివసించే జీవులన్నీ మృగరాజు ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి హాజరయ్యాయి. జంతువులన్నింటికీ ఎదురుగా సింహాసనం మీద కూర్చొంది మృగరాజు. పక్కనే మంత్రి కుందేలు నిలబడింది. ‘మొన్ననే కదా.. అందరం సమావేశమయ్యాం. మళ్లీ ఈ అత్యవసర పిలుపు ఎందుకో?’

Updated : 04 Nov 2022 04:26 IST

అడవిలో నివసించే జీవులన్నీ మృగరాజు ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి హాజరయ్యాయి. జంతువులన్నింటికీ ఎదురుగా సింహాసనం మీద కూర్చొంది మృగరాజు. పక్కనే మంత్రి కుందేలు నిలబడింది. ‘మొన్ననే కదా.. అందరం సమావేశమయ్యాం. మళ్లీ ఈ అత్యవసర పిలుపు ఎందుకో?’ అనుకుంటూ జీవులన్నీ మృగరాజు వైపు అయోమయంగా చూశాయి. అది గమనించిన మృగరాజు లేచి.. ‘మీరంతా నా మాటను మన్నించి వచ్చినందుకు సంతోషం. అయితే ఈ సమావేశానికి ఒక కారణం ఉంది. నిన్న రాత్రి నాకొక సందేహం వచ్చింది’ అంది. ‘ఏమిటది మృగరాజా?’ కుతూహలంగా అడిగింది మంత్రి కుందేలు. ‘ఈ అడవిలో నివసించే జీవులపై నాకెంతో గౌరవం ఉంది. ఎందుకంటే మీరంతా నా మాట వింటారు. చెప్పింది చేస్తారు. ఒక రాజుగా మీపై నాకా నమ్మకం ఉంది. అయితే.. మీకు నేనంటే భయమా.. భక్తా? అనేది అర్థం కావడం లేదు. నా సందేహానికి మీరే సమాధానం చెప్పాలి’ అని అడిగింది మృగరాజు.

‘ఏం సమాధానం చెప్పాలా?’ అని మంత్రి కుందేలుతో సహా జీవులన్నీ తలలు పట్టుకున్నాయి. కర్ణిక అనే నక్క మాత్రం.. గట్టిగా నవ్వింది. ‘సమాధానం చెప్పమంటే నన్నే పరిహాసం చేస్తావా? నీకెంత ధైర్యం?’ అంటూ కోపంగా చూసింది మృగరాజు. ‘చూశారా మృగరాజా.. మీరిప్పుడు నాపైన రాజుగా అధికారం చూపించారు. నా నవ్వును పరిహాసం అనుకొని నన్ను నిలదీశారు. ఇప్పుడు నాకు మీరంటే భయం మాత్రమే ఉంది. భక్తి లేదు’ అని ఏమాత్రం తడబడకుండా చెప్పింది కర్ణిక. ‘భలే సమాధానం చెప్పావు’ అని మనసులోనే అనుకుంటూ ఏనుగు, జింక తదితర జంతువులన్నీ కర్ణిక వైపు మెచ్చుకోలుగా చూశాయి. ‘నా ఒక్కదానికేంటి.. నా మీద కోపం ప్రదర్శించిన మిమ్మల్ని చూడగానే ఈ జంతువులన్నింటికి కూడా మీరంటే భయమే కలిగింది’ అంటూ మిగతా జంతువుల వైపు చూసింది కర్ణిక.

‘నీతోపాటు మమ్మల్ని కూడా భలేగా ఇరికించేస్తున్నావే.. ఇప్పుడెలా?’ అని ఒకదాని ముఖం మరొకటి చూసుకున్నాయి జంతువులన్నీ. సింహం వైపు తికమకగా చూస్తూ మౌనంగా ఉండిపోయాయి. ‘నాకు కావాల్సింది మీ మౌనం కాదు. సమాధానం చెప్పండి’ అని గద్దించింది మృగరాజు. ఇక తప్పదనుకుంటూ.. ‘మీరంటే మాకు.. మీ.. రం.. టే.. మా..కు..’ అంటూ జంతువులన్నీ మళ్లీ మౌనం వహించాయి. ‘పొడి పొడి మాటల జవాబు కాదు. స్పష్టంగా చెప్పండి’ అని విసుక్కుంది సింహం. జంతువుల పరిస్థితిని అర్థం చేసుకున్న కర్ణిక మళ్లీ కిసుక్కున నవ్వింది. అసలే చిరాగ్గా ఉన్న మృగరాజుకు కర్ణిక నవ్వు మరింత కోపం తెప్పించింది. ‘రెండోసారి నన్ను పరిహసించావు. నీకు శిక్ష తప్పదు!’ అని గట్టిగా గర్జించింది.

సింహ గర్జనకు జంతువులన్నీ లోలోపల భయపడ్డాయి. ‘చూశారా.. మృగరాజా! మీ గర్జన చూసి నాకు భయం వేసింది. ఈ సమయంలో భక్తి ఎలా కలుగుతుంది?’ అని అడిగింది కర్ణిక. ఆ మాటతో సింహం ఆలోచనలో పడింది. ‘నేనంటే నీకు భయమే ఉంది. భక్తి లేదని అర్థమైంది’ అంది సింహం. ‘నేనలా అనలేదు రాజా.. వేటగాళ్ల బారి నుంచి మమ్మల్ని కాపాడతారు. శత్రువుల బారి నుంచి రక్షిస్తారు. మా ప్రాణాలు కాపాడే సమయంలో మిమ్మల్ని దైవంగా భావిస్తాం. భక్తితో చూస్తాం. కానీ, మీకు ఆకలేస్తే వేటకు వస్తారు. అప్పుడు భయంతో మీకు కనిపించకుండా తప్పించుకుంటాం. ఆ సమయంలో భయం మాత్రమే ఉంటుంది. అందుకే.. మీరంటే మాకు భయం, భక్తి రెండూ ఉన్నాయి’ అని వివరించింది కర్ణిక.

‘భలేగా చెప్పావు’ అని మనసులో అనుకుంటూ జంతువులన్నీ కర్ణిక వైపు చూశాయి. ‘భయం, భక్తి రెండూ ఒకచోట ఉండవు. నేనంటే మీకు భయమా, భక్తా.. రెండూ ఉన్నాయని కర్ణికలా తెలివితేటలు ప్రదర్శించకండి. ఒక్కటి మాత్రమే చెప్పండి’ అని సమాధానం కోసం ఎదురు చూడసాగింది సింహం. ‘రాజు అంటే లోలోపల భయం ఉన్నా.. భక్తి అని చెప్పడమే మేలు’ అని జంతువులన్నీ ఓ నిర్ణయానికొచ్చాయి. ‘మృగరాజా.. మీరంటే మా అందరికీ భక్తి మాత్రమే ఉంది’ అని జీవులన్నీ ముక్తకంఠంతో జవాబిచ్చాయి. ఆ సమాధానంతో సింహం సంతోషించింది. దర్జాగా సింహాసనం మీద నుంచి లేస్తూ.. ‘ఇప్పటికైనా ఒప్పుకొంటావా కర్ణికా.. భయం, భక్తి రెండూ ఒకేచోట ఉండవని..!’ అంటూ జూలు విదుల్చుతూ అడిగింది.

కర్ణిక వెంటనే మిగతా జంతువులన్నింటి వైపు భయంగా చూస్తూ... ‘వేటాడే ముందు మృగరాజు అలా తన జూలు విదుల్చుతారని మీకు తెలియదా? ఇంకా ఇక్కడే ఉన్నారే? పరుగు పెట్టండి. సింహం బారి నుంచి మీ ప్రాణాలను కాపాడుకోండి’ అని గట్టిగా అనేసరికి.. జీవులన్నీ చెల్లాచెదురుగా పరుగెత్తాయి. అది చూసి ఆశ్చర్యపోవడం మృగరాజు వంతైంది. సింహం పరిస్థితిని గమనించిన కర్ణిక.. ‘ఇప్పుడు చెప్పండి రాజా.. మీరంటే మాకు భయమా, భక్తా?’ అని అడిగింది. ఇక తప్పదనుకొని ‘రెండూను’ అని ఒప్పుకొంది సింహం.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని