తినాలంటే.. చేపలు పట్టాలి మరి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మన స్నేహితులతోనో, బంధువులతోనో ఏదైనా రెస్టరెంట్‌కి వెళ్తే ఏం చేస్తాం? - ‘ఆ ఏముంది.. ముందు మెనూ కార్డు అడిగి తీసుకుంటాం.. చకచకా మొత్తం పరిశీలిస్తాం.. నచ్చిన డిష్‌ని ఆర్డర్‌ చేస్తాం..’ అంతేకదా...

Published : 04 Nov 2022 00:09 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మన స్నేహితులతోనో, బంధువులతోనో ఏదైనా రెస్టరెంట్‌కి వెళ్తే ఏం చేస్తాం? - ‘ఆ ఏముంది.. ముందు మెనూ కార్డు అడిగి తీసుకుంటాం.. చకచకా మొత్తం పరిశీలిస్తాం.. నచ్చిన డిష్‌ని ఆర్డర్‌ చేస్తాం..’ అంతేకదా.. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం అందుకు భిన్నమైంది. ఇంతకీ ఆ రెస్టరెంట్‌ ఎక్కడుందో, దాని ప్రత్యేకంగా ఏంటో చదివేయండి మరి..

జపాన్‌ అంటేనే కష్టపడేతత్వానికి, సృజనాత్మకతకు పెట్టింది పేరు. ఆ దేశంలోని ఒసాకా నగరంలో చేపల వంటకాలకు ప్రసిద్ధి చెందిన జువో అనే రెస్టరెంట్‌ ఒకటి ఉంది. దానికో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే.. ఆ రెస్టరెంట్‌కి వెళ్లిన వారెవరైనా, వారు తినాలనుకుంటున్న చేపలను స్వయంగా పట్టుకోవాల్సి ఉంటుంది.

ఓ పడవలా..

జువో రెస్టరెంట్‌ లోపల డైనింగ్‌ ప్రదేశం మొత్తం ఓ పడవలా ఉంటుంది. దాని చుట్టూ నీళ్లూ, అందులో రకరకాల చేపలూ ఉంటాయి. తినడం కోసం అక్కడికి వెళ్లిన వారెవరైనా సరే.. తమ క్యాబిన్‌లోంచి కానీ బయటకొచ్చి నేరుగా కానీ ఫిషింగ్‌ చేసి చేపలను పట్టుకోవాలి. అలా పట్టుకున్న చేపలను అక్కడి చెఫ్‌లకు ఇచ్చి.. కర్రీనో, వేపుడో, ఇంకేదైనానో.. మీకు కావాల్సిన వంటకాన్ని తయారు చేయించుకోవచ్చు. అలాగని ఆ బాధ్యతను పూర్తిగా మీ మీదే వదిలేయకుండా.. దానికి అవసరమైన సామగ్రిని ఇవ్వడంతోపాటు, చేపలను పట్టుకోవడంలో మీకు ఆ హోటల్‌ సిబ్బంది సహాయపడతారు. అంతేకాదు.. మీరు పట్టుకున్న చేపలతో వారు సెల్ఫీ కూడా దిగుతారు. ‘మరి ఎవరికైనా చేపలు పట్టడం రాకపోతే ఎలా?’ - అనే సందేహమొచ్చింది కదూ! అటువంటి వారికి కాస్త ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తారట. సరదాగా గడపడంతోపాటు ఆకలి తీర్చుకునేందుకు చాలామంది ఇక్కడికి వరస కడుతున్నారట.

సోషల్‌ మీడియాలో వైరల్‌..

ఇటీవల ఓ ట్రావెలర్‌ జపాన్‌ పర్యటనలో భాగంగా ఈ రెస్టరెంట్‌కు వెళ్లింది. చేపలు పట్టడం, వండించుకొని తినడం తదితర అంశాలన్నీ ఆమె వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. దాంతో కొద్ది రోజుల్లోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. అది చూసిన కొందరు.. జపాన్‌ వెళ్తే కచ్చితంగా ఆ రెస్టరెంట్‌కి వెళ్లాలని అనుకుంటున్నారట. నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కేవలం చేపలు పట్టడం నేర్చుకునేందుకు కూడా అక్కడి జనాలు ఈ హోటల్‌కి వెళ్తున్నారట. కొందరు తల్లిదండ్రులైతే పిల్లలతో కలిసి ఓ పిక్నిక్‌కి వెళ్లినట్లుగా ఇక్కడ సరదాగా గడుపుతున్నారట. నిజంగా ఈ రెస్టరెంట్‌ భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని