సాయం చేసే మనసు!

చేతనాపురి సామ్రాజ్యానికి రాజు చైతన్యవర్మ. ఆయనకు మంచి పాలనాదక్షుడని పేరుంది. ప్రజల యోగక్షేమాలను తెలుసుకోవడం కోసం అనేక రకాలైన పద్ధతులను అనుసరించే వాడు. వారి సంక్షేమం కోసం వివిధ ప్రణాళికలు రచించి అమలు పరిచేవాడు.

Published : 07 Nov 2022 00:54 IST

చేతనాపురి సామ్రాజ్యానికి రాజు చైతన్యవర్మ. ఆయనకు మంచి పాలనాదక్షుడని పేరుంది. ప్రజల యోగక్షేమాలను తెలుసుకోవడం కోసం అనేక రకాలైన పద్ధతులను అనుసరించే వాడు. వారి సంక్షేమం కోసం వివిధ ప్రణాళికలు రచించి అమలు పరిచేవాడు. ఒకరోజు ఆయన అంగరక్షకుల తోడు లేకుండా మారువేషంలో ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికి రాజ్యంలో సంచారానికి వెళుతున్నాడు. దారిలో ఒకచోట భవన నిర్మాణం జరుగుతోంది. కొందరు కార్మికులు ఒకపెద్ద చెక్క దూలాన్ని ఇంటి పైకి చేర్చటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది బరువుగా ఉండటంతో అవస్థలు పడుతున్నారు. ఒకవైపు నుంచి ఎత్తి.. కొంతవరకు వెళ్లేసరికి మరొక వైపు నుంచి జారిపోతోంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. అలా జరగకుండా ఉండాలంటే ఇంకో మనిషి సాయం కావాలి.

పని చేయించే మేస్త్రీ వారి పక్కన నిల్చొని, ఆజ్ఞలు జారీ చేస్తూ, ఉచిత సలహాలిస్తున్నాడు తప్పితే.. ఏమాత్రం సాయం చేయడం లేదు. కనీసం ఆ ప్రయత్నమైనా లేదు. పైగా అసహనంతో పని వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఇదంతా కొంతసేపు  గమనించిన మారువేషంలో ఉన్న చైతన్యవర్మ, మేస్త్రీతో ‘మీరు కూడా ఒక చేయి వేస్తే పని సులువుగా అయిపోతుంది కదా’ అన్నాడు.

ఆ మాట విన్న మేస్త్రీ కాస్త విసురుగా.. ‘నాకేం అవసరం? నేను పనిచేయించేవాడిని. అంతే కానీ కూలీని కాదు’ అని జవాబిచ్చాడు. అయినా అతడిని సముదాయించడానికి.. ‘నిజమే.. కాదనను. కానీ ఒకమనిషి తక్కువ కావడంతో పని జరగడం లేదు. మీరు కాస్త సాయం చేస్తే వాళ్లకు సులువు అవుతుంది కదా! అంతమంది కష్టపడుతున్నప్పుడు.. వారికి ఇంకొకరు కలిస్తే పని సులువు అవుతుందన్నప్పుడు, కాస్త సాయం చేయడంలో తప్పు లేదు కదా?’ అన్నాడు.
ఆ మాటకు అతడు మెత్తపడలేదు సరికదా.. పైగా చిరాకు పడుతూ.. ‘మీరెన్ని చెప్పినా నేను వినను. ఎందుకంటే.. పనిచేయాల్సిన అవసరం నాకు లేదు. అయినా... అంత బాధ పడిపోతూ, జాలి చూపిస్తున్నట్టు ఇన్ని కబుర్లు చెబుతున్నావు కదా.. నువ్వే ఆ పని ఎందుకు చెయ్యకూడదు?’ అన్నాడు కాస్త వ్యంగ్యంగా!

‘నేనా?’ అన్నాడు మారువేషంలో ఉన్న రాజు. ‘ఆ నువ్వే.. ఏం? నీ దగ్గరకు వచ్చేసరికి నామోషీ అడ్డు వచ్చిందా? అవునులే చెప్పడం సులభమే. చెయ్యడమే కష్టమని ఇప్పుడు అర్థమైందా?’ అని రెట్టించాడు. ఆ మాటకు చైతన్యవర్మ ‘అదేమీ కాదు. చెయ్యడానికి నాకు అభ్యంతరం లేదు’ అని సమాధానమిచ్చాడు.

‘అయితే మరెందుకు ఆలస్యం. వెళ్లు వెళ్లు.. వారి మీద జాలితో ఆ పనేదో నువ్వే చెయ్యి. లేకపోతే సలహాలు ఇవ్వడం మానేసి, నీ దారిన నువ్వు వెళ్లు’ అన్నాడు కాస్త కోపంగా. ఆ మాట విన్న చైతన్యవర్మ.. పనివాళ్ల దగ్గరకు వెళ్లి, దూలం కిందకు జారిపోకుండా ఉండేందుకు కొన్ని సూచనలు చేశాడు. తానూ ఒకవైపు పట్టుకుని వాళ్లకు సహాయం చేశాడు. దూలం సులభంగా పైకి చేరింది. అప్పుడు చైతన్యవర్మ వెనుకకు తిరిగి ‘మేస్త్రీ గారూ.. నమస్కారం. మీ సలహా ప్రకారం నాకు తోచిన సహాయం చేశాను. తోటి వారికి సాయం చేశాననే తృప్తి మిగిల్చినందుకు మీకు ధన్యవాదాలు. మళ్లీ ఎప్పుడైనా ఇలాంటి అవసరం పడితే కబురు చేయండి. కచ్చితంగా వస్తాను. నాపేరు చైతన్యవర్మ. నేను కోటలోనే ఉంటాను. ఎవరినడిగినా చూపిస్తారు’ అని చెప్పాడు.

ఆ మాటతో మేస్త్రీకి పైప్రాణాలు పైనే పోయాయి. మారువేషంలో ఉన్న రాజును గుర్తించి.. క్షమించమని కాళ్ల మీద పడి వేడుకున్నాడు. ఆ మాటలకు రాజు అతడిని పైకి లేపి.. ‘మనం ఎంత గొప్ప వారమైనా కావచ్చు. కానీ, అంతకుముందు మనుషులం. కాబట్టి ప్రతి ఒక్కరివిషయంలో మానవత్వంతో ప్రవర్తించాలి. మేము పెద్దవాళ్లం.. గొప్పవాళ్లం.. ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తామా! అనే భావన లేకుండా, ఏ పనైనా చేయడానికి సిద్ధమైన వారే అసలైన మానవులు. ముఖ్యంగా కష్టంలో ఉన్న వాళ్లకు సాయం చేసే వాడే గొప్పవాడు. అంతేగానీ ఆడంబరమైన దుస్తులు ధరించడం, డాంబికం, దర్పం ప్రదర్శించడం, చుట్టూ అంగరక్షకులను పెట్టుకొని తిరగడం వల్ల నిజమైన గొప్పతనం రాదు. ఈ విషయం గుర్తుంచుకొని మెలిగితే ఉన్నత స్థితికి చేరతామని గ్రహించు’ అని వివరించాడు. ఆ మాటలకు సిగ్గుతో తల వంచుకున్నాడు మేస్త్రీ.

- ఆదిత్య కార్తికేయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు