వాళ్ల చేతుల్లోనూ ఉంటాయ్‌!

నేస్తాలూ.. మనకు బొమ్మలంటే భలే ఇష్టం కదూ! కొన్నిసార్లు మనం అడగకుండానే, మరి కొన్నిసార్లు అడిగిన వెంటనే మనకు అమ్మానాన్న బోలెడు బొమ్మలు కొనిస్తారు కదూ! మనం వాటితో ఎంచక్కా ఆడుకుంటాం కూడా.

Published : 08 Nov 2022 00:14 IST

నేస్తాలూ.. మనకు బొమ్మలంటే భలే ఇష్టం కదూ! కొన్నిసార్లు మనం అడగకుండానే, మరి కొన్నిసార్లు అడిగిన వెంటనే మనకు అమ్మానాన్న బోలెడు బొమ్మలు కొనిస్తారు కదూ! మనం వాటితో ఎంచక్కా ఆడుకుంటాం కూడా. కానీ చాలా మంది పేద చిన్నారులకు ఆటబొమ్మ అనేది అందని వస్తువే! అలాంటి వారి ఆశలు తీర్చడం, వారి బాల్యంలో ఆనందాన్ని నింపడం కోసమే ఓ బ్యాంక్‌ ఏర్పాటైంది. మరి ఆ సంగతులేంటో తెలుసుకుందామా!

బ్యాంక్‌ అంటే... డబ్బులబ్యాంకో, బ్లడ్‌బ్యాంకో కాదు.. టాయ్‌బ్యాంక్‌. అవును బొమ్మలబ్యాంకే! మహారాష్ట్రలోని ముంబయిలో ఉంది ఇది. శ్వేతా చారి అనే సామాజిక కార్యకర్త ఆలోచనకు రూపమే ఈ టాయ్‌బ్యాంక్‌. ఇది 2004లో ఏర్పాటైంది. దీనికి ఆమె సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈ టాయ్‌బ్యాంక్‌... ఇప్పటి వరకు 43 వేల మంది పిల్లలు బొమ్మలతో ఆడుకునేలా చేసింది. దీనికి దాదాపు 285 టాయ్‌ లైబ్రరీస్‌ ఉన్నాయి. ఇవి పిల్లల మోముల్లో ఆనందాలు వెల్లివిరిసేలా చేస్తున్నాయి.

ఆడుకోవడం పిల్లల హక్కు...

చదువుకోవడం ఎలా అయితే పిల్లలకు తప్పనిసరో.. ఆడుకోవడం కూడా అంతే. ఆటల్లోనే ఆహ్లాదం ఉంటుంది. కానీ చాలా మంది పేద, మధ్యతరగతి పిల్లలకు సరైన బొమ్మలే దొరకని పరిస్థితి. దీంతో వాళ్లు సరిగా ఆడుకోలేకపోతున్నారు. అలాంటి వారి చెంతకు బొమ్మల్ని చేరుస్తోంది ఈ టాయ్‌బ్యాంక్‌.

చదువుతోపాటు...

ఆటవస్తువులు కొనుక్కోలేని పిల్లలకు బొమ్మలు అందిస్తే సమస్య తీరిపోదు. వారు బడికి వచ్చేలా చేయాలి. అందుకే టాయ్‌బ్యాంక్‌ వారు మురికివాడల్లోకి వెళ్లి పిల్లలకు బొమ్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. అలా చేస్తే వారు పాఠశాలల్లో చేరరు. అందుకే వీటిని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంచుతారు. అన్నట్లు ఈ బొమ్మలతో ఆడుకోవడానికీ స్కూళ్లలో ఓ పీరియడ్‌ ఉంటుంది. ఆ సమయంలోనే పిల్లలు ఎంచక్కా వీటితో ఆడుకుంటారు.  

గంట మోగితే.. సంతోషాల మోతే!

మధ్యాహ్నం గంటమోగితే చాలు పిల్లల మొహాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఎందుకంటే టాయ్‌ పీరియడ్‌ అప్పుడే ఉంటుంది మరి. వాళ్లు కూర్చున్న దగ్గరకు బొమ్మలు వస్తాయి. వాళ్లకు నచ్చిన వాటిని తీసుకుని హాయిగా ఆడుకోవచ్చు. కేరింతలు కొట్టుకోవచ్చు. సరదాగా గడపొచ్చు. కాసేపు సేదతీరొచ్చు.  

వినోదంతోపాటు విజ్ఞానం..

ఈ ఆటబొమ్మలు కూడా కేవలం వినోదాన్నే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. దీంతో బడి మానేసేవారి సంఖ్య తగ్గుతోంది. పాఠశాలల్లో చేరేవారి సంఖ్యా పెరుగుతోంది. టాయ్‌బ్యాంక్‌ కేవలం బొమ్మలతో ఆడించడమే కాదు.. కొన్నిసార్లు విద్యార్థులకు చిన్న చిన్న బొమ్మలను బహుమతిగానూ ఇస్తోంది. మొత్తానికి ఈ టాయ్‌బ్యాంక్‌ పిల్లల జీవితాల్లో చిన్న చిన్న ఆనందాలను డిపాజిట్‌ చేస్తోందన్నమాట. ఈ ఆలోచన, ఆచరణ నిజంగా బాగున్నాయి కదూ నేస్తాలూ! మీరూ మీ దగ్గర వృథాగా ఉన్న ఆటబొమ్మలను పేదలకు అందించే ప్రయత్నం చేయండి. వాళ్ల మోముల్లోనూ ఆనందాలు విరబూసేలా చేయండి.. సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని