మిడతల దండు.. మతిమరుపు ఉడుత!

మిడతల దండు ఒక తోటలో మకాం వేసింది. వాటి నాయకుడు నాలుగు మిడతలను నాలుగు దిక్కులకు పంపించి తోటల సంగతి ఆరా తీయమని చెప్పింది. అందులో ఒక మిడత కొంత దూరం పోయాక, ఎవరైనా కనిపిస్తే తోట సంగతి అడిగి తెలుసుకుందామనుకుంది. ఆ సమయంలో ఒక ఉడుత కనిపించింది.

Published : 08 Nov 2022 00:16 IST

మిడతల దండు ఒక తోటలో మకాం వేసింది. వాటి నాయకుడు నాలుగు మిడతలను నాలుగు దిక్కులకు పంపించి తోటల సంగతి ఆరా తీయమని చెప్పింది. అందులో ఒక మిడత కొంత దూరం పోయాక, ఎవరైనా కనిపిస్తే తోట సంగతి అడిగి తెలుసుకుందామనుకుంది. ఆ సమయంలో ఒక ఉడుత కనిపించింది. ‘మిత్రమా!’ అంటూ ఉడుతను పిలిచి లౌక్యాన్ని ప్రదర్శించింది.

పరుగు పెడుతున్న ఉడుత ఒక్కసారిగా ఆగి మిడత వైపు చూసి.. ‘ఎవరు నువ్వు?’ అని అడిగింది. ‘నేను చిలకమ్మ చెల్లెల్ని’ అని తన గురించి గొప్పగా చెప్పుకుంది మిడత. ‘నీ శరీరం ఆకుపచ్చ రంగులో ఉంది కానీ, నీ ముక్కు ఎరుపుగా లేదు?’ ఆరా తీసినట్టు అడిగింది ఉడుత.

‘ముక్కు ఎరుపుగా ఉంది కాబట్టే అది అక్క అయ్యింది. ముక్కు ఎరుపుగా లేదు కాబట్టి నేను చెల్లినయ్యాను’ గడుసుగానే చెప్పింది మిడత. చిలకమ్మ చెల్లెనంటున్నావు, చిలకమ్మ కూడా నేను నివాసం ఉంటున్న చెట్టు పైనే ఉంటోంది.. అదీ పెద్ద జామతోటలో. నేను దారి మరచిపోయాను, మీ అక్క నివాసానికి దారి చెప్పవా? ఆశగా అడిగింది ఉడుత. అరరే... నేను కూడా దారి మరచిపోయాను. ఆ వెతుకులాటలోనే ఉన్నాను’ అబద్ధాన్ని డాంబికంగా చెప్పింది మిడత.
‘సరిపోయింది.. దొందూ దొందేలాగ ఉంది మన పరిస్థితి’ అంటూ పెదవి విరిచింది ఉడుత. మిడత మాత్రం తెలివిగా ఆలోచించడం మొదలు పెట్టింది. ‘ఉడుత మిత్రమా! నువ్వు నీ నివాసం నుంచి వచ్చినప్పుడు ఏమేమి విన్నావు? ఏమేమి చూశావు?’ అడిగింది. ‘అంబా అన్న అరుపులు విన్నాను. పాకలో కట్టిన ఆవుల్ని చూశాను’ అంది ఉడుత. మిడత ఎదురుగా కొద్ది దూరం పోయి చూసింది. ఆవులు ఓ ఇంటి ముందు ఉన్నాయి. అంబా అరుపులు అక్కడ నుంచి వినిపించాయి.

వెనుదిరిగి వచ్చిన మిడత.. ‘నువ్వు వచ్చేదారి గుర్తించాను. అటు పోదాం పద’ అంది మిడత. మిడత ముందు వెళ్తే తాను దారితప్పిపోతానేమోనన్న భయంతో ఉన్న ఉడుత, ‘మిడత మిత్రమా! నా వీపు మీద ఎక్కు, నువ్వు చూపించే దారిలో పోదాం’ అంది. ఎగరమంటుందేమోనని భయం వేసింది, హమ్మయ్య... అనుకుంటూ గబుక్కున ఎక్కేసింది మిడత. కాస్త దూరం వెళ్లాక జామపళ్ల వాసన ఉడుత ముక్కును తాకింది. ‘ఇటువైపు వెళ్తే సరి.. నా నివాసమొచ్చేస్తుందోచ్‌’ అని ఎగిరి గంతేసింది. పాపం పట్టుతప్పి మిడత కిందపడింది.

‘మిత్రమా! నీకిది తగునా?’ అంటూ కింద పడిన మిడత లేచింది. ‘అర్రర్రే.. ఎంత పనైంది. మీ అక్క దగ్గరకే పోదాం పద’ అంటూ మళ్లీ తన మీదకు ఎక్కించుకుంది ఉడుత. వాసనను అనుసరిస్తూ పరుగు పెట్టింది. విరగ్గాసిన జామచెట్లు వచ్చాయి. ‘ఇదిగో ఈ చెట్టు మీదే మీ అక్క ఉంటోంది’ అని చూపించింది ఉడుత. ‘చిలకమ్మా.. చిలకమ్మా... మీ చెల్లి వచ్చింది’ అని కేకేసింది. చిలకమ్మ పలకకపోవడంతో.. ‘మీ అక్క ఎక్కడికో వెళ్లినట్టు ఉంది’ అంటూ మిడతకు చెప్పి, తిండి కోసం పళ్లను వెతికే పనిలో పడింది. మిడత, తోటను చూసి కేరింతలు కొట్టింది. ఆకుల్ని తిన్నంత తిన్నాక, దండు ఉన్న చోటుకు పరుగుపెట్టింది. నాయకుణ్ని కలిసి తోట ముచ్చట్లు చెప్పింది. క్షణం ఆలస్యం చేయకుండా దండు బయలుదేరింది. జామతోటను చేరిన వెంటనే ఒక పట్టుపట్టాయి. ఒక్క ఆకు మిగలకుండా చెట్లన్నీ బోసి పోయాయి. దండు చేస్తున్న పనికి అవాక్కైన ఉడుత, చెట్టుపై పళ్లు కూడా ఎత్తుకుపోతాయని గాబరా పడింది. కొద్దిసేపటికి ఆ దండు మరో చోటికి ఎగురుకుంటూ వెళ్లిపోవడం కన్నార్పకుండా చూసింది. ఇంతలో చిలకమ్మ ఎగురుకుంటూ వచ్చి తన నివాసాన్ని చూసి గొల్లుమంది.

కనిపించిన ఉడుతను ‘ఇంతకీ.. ఏమి జరిగింది?’ అని బాధపడుతూ అడిగింది. ‘మీ చెల్లివాళ్లే వచ్చి ఈ పని చేశారు’ అని చెప్పింది ఉడుత. ‘తిక్కతిక్కగా ఉందా? నా చెల్లివాళ్లేంటి? ఆకులు తినడమేంటి?’ అని నిలదీసింది చిలకమ్మ. ‘నీ రంగులోనే ఉన్నాయవి, అందులో ఒకటి మీ చెల్లినని చెప్పుకుంది’ అని గట్టిగానే సమాధానమిచ్చింది ఉడుత.

‘రంగు ఒకేలా ఉంటే చెల్లైపోదు, అవి మిడతలు. వాటి పని ఆకుల్ని మేసి పంటలకు నష్టం కలిగించడమే! మొత్తానికి గడసరి మిడత నిన్ను బోల్తా కొట్టించింది. ఈ చెట్టుపై ఉన్న తియ్యని జాంపళ్లు ఏమయ్యాయి?’ అని అడిగింది చిలకమ్మ. ‘అవి తీసుకుపోతాయేమోనని నేనే దాచి పెట్టాను’ అంది ఉడుత. ‘హమ్మయ్య... ఆకలేస్తుంది తెచ్చివ్వు’ అని ఆశగా అడిగింది చిలకమ్మ.

పరుగు పెట్టిన ఉడుత ఖాళీ చేతులతో తిరిగి వచ్చింది. ‘ఏమైంది? ఒట్టి చేతులతో వచ్చావు’ అని అడిగింది చిలుక. ‘ఎక్కడ దాచానో మరచిపోయాను’ అంది ఉడుత. ‘నువ్వు మతిమరుపు ఉడుతవి’గా అంటూ మరో చెట్టుపైకి పోయింది చిలకమ్మ.

-బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని