Updated : 09 Nov 2022 04:38 IST

పండితుడి సంతృప్తి!

మాళవ రాజ్యాన్ని పరిపాలించే చంద్రసేనుడికి కళలన్నా, మేధావులన్నా చాలా గౌరవం. ఆ రాజ్యంలోని కవి పండితులతోపాటు పొరుగు రాజ్యాల వారూ చంద్రసేనుడితో సత్కారం పొందేవారు. ఇలా ఉండగా ఒకరోజు చంద్రసేనుడి ఆస్థానానికి భైరవభట్టు అనే పొరుగు రాజ్య పండితుడు వచ్చి తన కవితాగానాన్ని వినిపించాడు. రాజు పరమానంద భరితుడై మంత్రిని పిలిచాడు. ‘మంత్రిగారూ! మనం ఎంతో మందిని సన్మానించాం. కానీ, వారు నా సన్మానంతో సంతృప్తి చెందారో లేదో.. నాకు తెలియదు. అందువల్ల ఈ పండితుడిని మాత్రం తృప్తి పరిచి పంపిద్దాం. ఏమంటారు?’ అని ప్రశ్నించాడు రాజు. మంత్రి కూడా అందుకు అంగీకరించాడు.

ఆ తర్వాత భైరవభట్టును పిలిచిన రాజు.. ‘మీ ప్రతిభ అద్భుతం. మీకు ఏం కావాలో చెప్పండి. నేను ఇస్తాను. మీకు తృప్తి కలిగించడమే మా ధ్యేయం’ అని అన్నాడు. అప్పుడు భైరవభట్టు.. ‘మహారాజా! ఒక నూరు వరహాలు ఇప్పించండి చాలు’ అని అన్నాడు. అప్పుడు రాజు.. ‘ఈ నూరు వరహాలు మీకు తృప్తిని కలిగిస్తాయా!’ అని రాజు ప్రశ్నించగానే.. ‘పోనీ రెండు వందల వరహాలు ఇప్పించండి ప్రభూ..’ అని సమాధానమిచ్చాడా పండితుడు. అప్పుడు మహారాజు.. ‘ఈ రెండు వందల వరహాలు మీకు తృప్తిని కలిగిస్తాయా.. నిజం చెప్పండి’ అంటూ ప్రశ్నించాడు. అప్పుడు భైరవభట్టు.. ‘అయితే.. అయిదు వందల వరహాలు ఇప్పించండి’ అని అన్నాడు. అప్పుడు రాజు.. ‘మీరు నా దగ్గర మొహమాట పడవద్దు. మీ మనసులో ఉన్న కోరికను చెప్పండి. మీరు తృప్తి పడాలి’ అని అన్నాడు. ‘మహారాజా! ఇక చివరిసారిగా అడుగుతున్నాను. నాకు ఒక వెయ్యి వరహాలు ఇప్పించండి చాలు. ఆ డబ్బుతో నాకు తృప్తి కలుగుతుంది’ అని అన్నాడు. రాజు సరేనని.. ఆ వెయ్యి వరహాలు అందించమని మంత్రిని ఆదేశించాడు. అప్పుడు మంత్రి.. ‘మహారాజా! ఆ పండితుడిని రేపు మనం వెయ్యి వరహాలతో ఘనంగా ఆస్థానంలో సత్కరిద్దాం. ఈరోజుకు మన రాజభవన విడిదిలో విశ్రాంతి తీసుకోమనండి’ అని అన్నాడు. అందుకు భైరవభట్టు ఎంతో సంతోషించాడు.

అమాత్యుడి సూచనతో ఆ రాత్రి రాజు మారువేషంలో మంత్రితోపాటు ఆ విడిదికి వెళ్లి.. పండితుని గది ముందు నిలబడి, ఆయన మాటలను వినసాగారు. ఆ పండితుడు ఎవరితోనో... ‘నేను ఎంత మూర్ఖుడిని. రాజుగారు అడిగినప్పుడు ఒక పదివేల వరహాలు అడిగితే ఎంతో బాగుండేది. కేవలం వెయ్యి వరహాలతో తృప్తిపడ్డాను. ఆ సొమ్ముతో నా పిల్లలు కాలు మీద కాలు వేసుకుని.. జీవితాంతం హాయిగా తినేవారు. పోనీ.. రేపు తిరిగి రాజు గారిని మళ్లీ అడుగుతాలే!’ అని అంటున్నాడు. ఆ మాటలు విన్న రాజు, మంత్రి.. ఆస్థానానికి తిరిగి వచ్చారు. తర్వాత రాజు... ‘మంత్రి గారూ! ఈ పండితుడు ఇంకా తృప్తి చెందినట్టుగా నాకు అనిపించడం లేదు. ఏమిస్తే ఈ పండితుడు తృప్తి పడతాడు. అసలు ఇతనికి తృప్తి లేనట్టుగా అనిపిస్తోంది’ అని అన్నాడు. అప్పుడు మంత్రి.. ‘మహారాజా! ఇతడు తృప్తి చెందాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది’ అని అంటూ రాజుగారి చెవిలో ఏదో  చెప్పాడు.

రాజు నవ్వి.. ‘అలాగే చేయండి మంత్రీ.. నాకు కావాల్సింది ఆ పండితుడిని తృప్తి పరచడమే’ అని అన్నాడు. మరునాడు సభలోకి భైరవభట్టు వచ్చాడు. మంత్రి పండితుడితో.. ‘ఈ రోజు మీకు మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేశాం. దయచేసి మీరు మా ఆహ్వానాన్ని కాదనకండి’ అని అన్నాడు. అందుకు పండితుడు ఎంతో సంతోషించాడు. రాజభవనంలోని ప్రత్యేక గృహంలో పండితుడికి మంచి భోజనాన్ని వడ్డించారు. ఆయన తన కడుపు నిండగానే... ‘మహారాజా! భోజనం చాలా బాగుంది. నాకు కడుపు నిండి తృప్తి కలిగింది. ఇక నాకు ఏ పదార్థాలూ వద్దు’ అని అన్నాడు. అప్పుడు రాజు.. ‘అది కాదు. మీరు మరికొంచెం తినాలి. ఎవరక్కడ? ఈ పండితుడికి మిఠాయిలు వడ్డించండి’ అని అన్నాడు.

అప్పుడు పండితుడు.. ‘వద్దు మహారాజా! నేను తృప్తిగా తిన్నాను.. ఇంతకుమించి తినలేను’ అని విస్తరిపైన చేతులను అడ్డంగా పెట్టాడు.

అప్పుడు రాజు... ‘చూశారా.. మీరు ఈ భోజనాన్ని తిని తృప్తి కలిగింది అంటున్నారు. అందుకే అన్నదానాన్ని మించినది లేదంటారు. అదే డబ్బు విషయం వచ్చేసరికి.. ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. నాకు ఈ భోజనం వల్లనే మీరు తృప్తి పడ్డారని అనిపించింది. మీరు కూడా అధిక ధనం సంపాదించి ఏం చేస్తారు? మీ సంతానానికి ఇవ్వడమే కదా! వారికి కష్టపడడం నేర్పించండి. శ్రమిస్తేనే భవిష్యత్తులో వారికి డబ్బు విలువ తెలుస్తుంది. నేను కూడా ఈ రోజు నుంచి పేదలకు అన్నదానం చేస్తాను. వారి కోసం అనేక సత్రాలు కట్టిస్తాను. అందులో ఆకలితో ఉన్న వారంతా కడుపు నిండుగా తిని తృప్తి పడతారు’ అన్నాడు. ఆ పండితుడు కోరిన వెయ్యి వరహాలు ఇచ్చి.. తృప్తి చెందానని అనిపించి మరీ పంపాడు చంద్రసేనుడు. రాజు ఇస్తానన్న వంద కాకుండా.. వెయ్యి వరహాలు లభించినందుకు చాలా ఆనందించాడా పండితుడు.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు