Published : 10 Nov 2022 01:15 IST

చిలుకమ్మ తెలివి!

నగనగా ఓ అడవిలో ఒక పావురం తన పిల్లలతో కలిసి ఓ భారీ వృక్షం మీద స్థావరం ఏర్పరచుకొని హాయిగా బతుకుతుండేది. ఒకరోజు నక్క వచ్చి.. ‘నీ పిల్లల్లో ఒకదాన్ని నాకీ వేళ ఆహారంగా ఇవ్వు’ అని అడిగింది. ‘నా పిల్లలంటే నాకు ప్రాణం. నేను ఇవ్వను’ అని జవాబిచ్చింది పావురం. ‘నీ అంతట నువ్వు ఇస్తే ఒకదానితో పోతుంది.. లేకపోతే నేనే చెట్టు పైకి వచ్చి అన్నింటినీ తినేస్తా’ అని బెదిరించిందది. నక్క పైకి వచ్చి పిల్లలన్నింటినీ ఎక్కడ తినేస్తుందోనని భయపడిపోయింది పావురం. ‘నా పిల్లను నీకు ఇవ్వను కానీ వాటి కోసం తెచ్చిన ఆహారం ఇస్తాను నక్క బావా!’ అంటూ గూట్లోని ఆహారాన్ని కిందకు విసిరింది పావురం. ‘ఏదో ఒకటి.. కడుపు అయితే నిండింది కదా’ అనుకుంటూ ఆ ఆహారం తినేసి వెళ్లిపోయింది నక్క.

మరుసటి రోజు నక్క మళ్లీ వచ్చింది. పావురం పిల్లని ఆహారంగా ఇవ్వమని బెదిరించింది. చెట్టు పైకి ఎక్కి వచ్చి పిల్లలను ఎక్కడ తినేస్తుందోనని భయపడిన తల్లి పావురం.. మళ్లీ పిల్లల కోసం తెచ్చిన ఆహారాన్ని నక్కకి ఇచ్చేసింది. అలా ప్రతిరోజూ రావడం, పావురాన్ని బెదిరించడం నక్కకు అలవాటుగా మారింది. పిల్లల కోసం కష్టపడి తెచ్చిన ఆహారాన్ని నక్క రోజూ తన్నుకుపోతుండటంతో అవి పస్తులుండాల్సి వస్తోంది. ఆకలి.. ఆకలి అంటూ ఏడవసాగాయి. అది చూసి తల్లి పావురం మనసు తల్లడిల్లేది. మాయదారి నక్క బారి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఏడవసాగింది. అటుగా వెళ్తున్న చిలుకకి ఆ ఏడుపు వినిపించి, పావురం దగ్గరకు వచ్చింది. ‘అక్కా.. ఎందుకు అంతలా ఏడుస్తున్నావు?’ అని అడిగింది చిలుక. ‘నక్క వచ్చి నన్ను, నా పిల్లల్ని తినేస్తానని బెదిరిస్తోంది. నా పిల్లల కోసం తెచ్చిన ఆహారాన్ని రోజూ పట్టుకుపోతోంది. బుజ్జి పిల్లలేమో ఆకలితో పస్తులుంటున్నాయి. అందుకే ఏడుస్తున్నాను’ అని బాధగా చెప్పింది పావురం.

‘నక్క ఏంటి? చెట్టు ఎక్కడమేంటి? అంత ఎత్తున ఉన్న నీ పిల్లల్ని తీసుకుపోవడమేంటి? అసలు అది పైకి ఎలా వచ్చింది?’ అని సందేహంగా అడిగింది చిలుక. ‘నక్క పైకి రాలేదు చిలుకా.. మొదట ఒక పిల్లను ఇవ్వమని అడిగితే కుదరదన్నాను. దాంతో తానే పైకి వచ్చి అన్నింటినీ పట్టుకుపోతానని బెదిరించింది. నేను భయపడి, కష్టపడి తెచ్చుకున్న ఆహారాన్ని కిందకు విసిరాను’ అంది పావురం. ‘అయ్యయ్యో.. ఇంత అమాయకురాలివి అయితే ఎలా బతుకుతావు అక్కా? నక్క ఎక్కడయినా చెట్టు ఎక్కగలదా? నీ పిల్లల్ని పట్టుకుపోగలదా? నీకు బుర్ర లేదు. ఇక ఎన్నడూ నక్క మాటలకు భయపడి నీ పిల్లల కోసం తెచ్చిన ఆహారాన్ని దానికి ఇవ్వకు’ అని గట్టిగా చెప్పి వెళ్లిపోయింది చిలుక. ‘నేను ఎంత తెలివితక్కువ దానిని. కొంచెం కూడా ఆలోచన లేకుండా మూర్ఖంగా ప్రవర్తించాను. నక్క జిత్తులకు భయపడి పిల్లలను పస్తులుంచాను’ అని పావురం మనసులోనే బాధపడింది.

మరుసటి రోజు నక్క మళ్లీ చెట్టు దగ్గరకు వచ్చి.. ‘నాకు ఆహారం ఇస్తావా.. లేకపోతే పైకి వచ్చి నీ పిల్లలను తినేయమంటావా?’ అని పావురాన్ని బెదిరించింది. ‘నక్క బావా.. ఇక చాల్లే నీ కథలు. నువ్వు పైకి రాలేవని చిలుకమ్మ నాకు చెప్పిందిలే! ఇక నీ ఆటలు ఏమాత్రం సాగవు. మాట్లాడకుండా వచ్చిన దారిలోనే వెళ్లు’ అంది పావురం కోపంగా. దాంతో నక్కకి చిలుకపై కోపం తన్నుకొచ్చింది. ‘నోటి దగ్గరి కూడును అందకుండా చేసిన చిలుకను ఎలాగైనా సరే పట్టుకుంటాను’ అని ఆవేశంగా బయలుదేరింది. దారిలో చెరువు గట్టుపైనున్న మామిడి చెట్టు నుంచి రాలిన ఓ పండును తన్మయత్వంతో తింటున్న చిలుక దానికి కనిపించింది. గబగబా నడుచుకుంటూ దాని దగ్గరకు వెళ్లి.. ‘చిలుకమ్మా బాగున్నావా.. ఈ వైపు నుంచి గాలి గట్టిగా వీస్తే నువ్వు ఎలా నిలబడగలవు?’ అని ఏమీ తెలియనట్లు ప్రశ్నించింది. ‘ఏముంది నక్క బావా.. అలా ఎగిరిపోయి ఆ చెట్టు కొమ్మ మీద ఆకుల మధ్య పడిపోకుండా నిలబడతాను’ అని సమాధానమిచ్చింది చిలుక.
‘అలాగా.. మరి పెద్ద గాలివాన వస్తే ఏం చేస్తావు?’ అని నక్క మళ్లీ అడగింది. ‘మెడ వంచుకొని ఇలా ముడుచుకుంటాను’ అంటూ తన మెడ వంచి చూపించింది చిలుక. ఒక్క అడుగు దూరంలోని చిలుక మెడ పట్టుకోవడానికి ముందుకు దూకింది నక్క. ‘అమ్మ నక్క బావా.. నువ్వు నాతో ఇంత తియ్యగా మాట్లాడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నీ కదలికలు గమనిస్తూనే ఉన్నాను. పట్టుకో చూద్దాం’ అంటూ చెట్టు మీదకు ఎగిరి చిటారు కొమ్మన కూర్చుంది చిలుకమ్మ. చెట్టు ఎక్కలేక ఉసూరుమంటూ.. కిందే చతికిలపడిందా నక్క. చిట్టి చిలుకమ్మ పుణ్యమా అని పావురం తన పిల్లలతో కలిసి హాయిగా జీవించసాగింది. అప్పుడప్పుడూ పావురం దగ్గరకి వచ్చి.. కబుర్లు చెప్పసాగింది చిలుకమ్మ.

- కె.వి.సుమలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని