సుబ్బులో మార్పు!

సుబ్బు అయిదో తరగతి చదువుతున్నాడు. చాలా అల్లరి చేస్తుంటాడు. ఉపాధ్యాయులు చెప్పిన మాట వింటున్నట్టే ఉంటాడు కానీ, అస్సలు పాటించడు. చిన్న తరగతి పిల్లలను, తోటి విద్యార్థులను ఎప్పుడూ ఆట పట్టిస్తుంటాడు. వారిని వివిధ పేర్లతో పిలుస్తూ ఎగతాళి చేస్తుంటాడు.

Published : 11 Nov 2022 00:03 IST

సుబ్బు అయిదో తరగతి చదువుతున్నాడు. చాలా అల్లరి చేస్తుంటాడు. ఉపాధ్యాయులు చెప్పిన మాట వింటున్నట్టే ఉంటాడు కానీ, అస్సలు పాటించడు. చిన్న తరగతి పిల్లలను, తోటి విద్యార్థులను ఎప్పుడూ ఆట పట్టిస్తుంటాడు. వారిని వివిధ పేర్లతో పిలుస్తూ ఎగతాళి చేస్తుంటాడు. ఎవరికైనా బాధ కలిగి, ఎదురు చెబితే కొట్టడానికి కూడా వస్తుంటాడు. ఉపాధ్యాయులు కూడా సుబ్బు నడవడికను గమనించారు. సహచర పిల్లలను అలా వివిధ పేర్లతో పిలుస్తూ ఎగతాళి చేయవద్దని మందలించారు. ఉపాధ్యాయుల దగ్గర తల ఊపి.. బయటకొచ్చాక మళ్లీ మామూలుగానే తన అల్లరి తాను చేసుకుపోతుండేవాడు. ఎవరు ఎంత చెప్పినా.. సుబ్బు పద్ధతి మాత్రం మార్చుకోలేదు. ప్రతిరోజు సుబ్బు ఆకతాయితనంతో తోటి విద్యార్థులు ఇబ్బందులు పడుతుండేవారు.

ఆ పాఠశాలలో నాలుగో తరగతిలో కొత్తగా చేరాడు రాజు. అతడు కూడా చాలా చురుకైనవాడు. తెలివితేటలు ఉన్నవాడు. రాజు మొదటి రోజు పాఠశాలకు రాగానే.. ‘ఏమిరా పొట్టోడా? ఏ ఊరు నుంచి వచ్చావు?’ అని ఎగతాళిగా అడిగాడు సుబ్బు. అప్పుడు రాజు.. ‘తాటిచెట్టంత పొడుగన్నా.. నేను మా ఊరి నుంచే వచ్చాను’ అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. ఆ సమాధానం విన్న మిగతా పిల్లలు ఒక్కసారిగా నవ్వేశారు. నవ్విన వాళ్ల వైపు కోపంగా గుడ్లురుమి చూశాడు సుబ్బు. ‘ఒరేయ్‌ పిల్లి కళ్లోడా! సరిగ్గా సమాధానం చెప్పలేవా?’ అని రాజుని కోపంగా అడిగాడు సుబ్బు. అప్పుడు రాజు.. ‘ఎలుక మూతి అన్నా.. సరిగ్గా అడిగితే సరిగ్గానే చెబుతా’ అని అన్నాడు. రాజు సమాధానం విని సుబ్బు ఉడుక్కుంటుంటే.. పిల్లలందరూ లోలోపలే నవ్వుకున్నారు.

ఇక తన పప్పులు ఉడకవనుకొని.. ఆ రోజుకి ఏమనకుండా వెళ్లిపోయాడు సుబ్బు. పిల్లలందరూ రాజు చుట్టూ చేరి ‘ఆ సుబ్బు గాడిని భలేగా ఆట పట్టించావు. ప్రతిరోజు మమ్మల్ని ఏదో ఒక పేరు పెట్టి ఇలాగే చేస్తుంటాడు. ఉపాధ్యాయులకు చెప్పినా.. వారు హెచ్చరించినా.. ఎవరి మాటా వినడం లేదు. ఎలాగైనా నువ్వే వాడితో ఆ అలవాటు మాన్పించాలి’ అని అడిగారంతా. రాజు బాగా ఆలోచించి.. ‘మీరు నేను చెప్పినట్టు చేయండి. వాడే ఇతరులను ఎగతాళి చేసే అలవాటు మానేస్తాడు’ అన్నాడు. ‘ఏం చేయాలో చెప్పు. మేమంతా నీ మాట వింటాం’ అని పిల్లలందరూ అన్నారు. ‘మీరు సుబ్బును ఒక్క మాట కూడా అనకుండా.. వాడు కనిపించినప్పుడు అటువైపు చూడకుండా, మీలో మీరే నవ్వుకోండి. అందరూ అలా చేస్తే, తన అలవాటును మార్చుకుంటాడు’ అని వివరించాడు.

‘మనలో మనం నవ్వుకుంటే.. వాడు ఎందుకు ఎగతాళి చేయడం మానేస్తాడు’ అని సందేహంగా అడిగారంతా. ‘మీరే గమనించండి. వాడు మిమ్మల్ని ఏమన్నా.. తిరిగి ఏమీ అనకండి. ఉపాధ్యాయులకు కూడా ఫిర్యాదు చేయకండి. నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్లు చేయండి’ అని చెప్పాడు రాజు. ఆ తర్వాత రోజు నుంచి సుబ్బు కనబడినప్పుడల్లా.. పిల్లలంతా వాడిని చూసీచూడనట్టు ప్రవర్తిస్తూ, వారిలో వారే నవ్వుకోసాగారు. అతడు ఎగతాళి చేసినా ఏమీ అనేవారు కాదు. అలా నాలుగు రోజులు గడిచింది. ఇతర విద్యార్థుల ప్రవర్తనతో సుబ్బుకి పిచ్చెక్కినట్లు అనిపించింది. ‘ఎందుకురా అలా నవ్వుతున్నారు?’ అని ఎవరిని అడిగినా.. నవ్వే వారి సమాధానం అయ్యేది. విసిగిపోయిన సుబ్బు.. ప్రధానోపాధ్యాయుడి దగ్గరికి వెళ్లాడు.

‘సార్‌.. మన బడిలోని విద్యార్థులందరూ నన్ను చూసి.. వారిలో వారే నవ్వుకుంటున్నారు. వారంతా మనుసులో నన్నేదో అనుకుంటున్నారు. వాళ్లందరినీ పిలిచి అడగండి’ అని ఫిర్యాదు చేశాడు. అప్పుడు ప్రధానోపాధ్యాయుడు.. ‘వాళ్లేమన్నారో చెబితే.. నేను పిలిచి అడుగుతా’ అని అన్నారు. ‘సార్‌.. వాళ్లు నన్ను ఏదో అంటున్నారు. కానీ, అదేంటో తెలియడం లేదు’ అన్నాడు. అప్పుడు ప్రధానోపాధ్యాయుడు.. ‘గతంలో నువ్వు వాళ్లని చాలాసార్లు ఎగతాళి చేశావు. వాళ్లు ఫిర్యాదు చేయడంతో.. నిన్ను పిలిచించి ఎన్నోసార్లు నచ్చజెప్పాను. కానీ, నువ్వు నా మాట వినలేదు. ఎగతాళి చేయడం మానలేదు. కానీ, ఈరోజు వాళ్లు నిన్ను చూసి నవ్వుతున్నారని ఫిర్యాదు చేస్తున్నావు. వాళ్లలో వాళ్లు నవ్వుకోవడంలో తప్పేముంది? నువ్వు దాన్ని ఎలా తీసుకుంటే.. అలానే అనిపిస్తుంది.

ఏ విషయమైతే నీకు బాధ కలిగిస్తుందో.. ఆ బాధను నువ్వు ఇతరులకు కలిగించకూడదు. ఇది చాలా చిన్న విషయం. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటే.. ఇతరులను బాధ పెట్టవు’ అని హితవు చెప్పారు.

ఆ మాటలతో సుబ్బుకి తన తప్పు అర్థమైంది. ఇకపై తోటి విద్యార్థులతో స్నేహంగా ఉంటానని, ఎగతాళి చేయనని ప్రధానోపాధ్యాయుడికి మాటిచ్చాడు. తర్వాత రోజు నుంచి సహచరులు తనను చూసి.. తమలో తామే నవ్వుకున్నా, వారిని ఏమి అనేవాడు కాదు. పైగా సుబ్బూనే వారిని స్నేహపూర్వకంగా పలకరించేవాడు. అతడిలో వచ్చిన మార్పును గమనించిన పిల్లలందరూ.. నవ్వడం మానేసి, మిత్రులుగా కలిసిపోసాగారు.

‘నీ సలహాతోనే సుబ్బు ప్రవర్తనలో మార్పు చూడగలిగాం’ అని పిల్లలతోపాటు ఉపాధ్యాయులూ రాజుని అభినందించారు.

- మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని