అమ్మమ్మ పాఠం!

గంగాపురం ప్రాథమిక పాఠశాలలో కీర్తి అయిదో తరగతి పూర్తి చేసింది. ఆ ఊరిలో హైస్కూలు లేదు. తండ్రికేమో దగ్గరలోని పట్టణంలో చదివించడం ఇష్టం లేదు. ఇంటికి దూరంగా, హాస్టల్లో ఉంచడం తల్లికీ నచ్చదు. అమ్మమ్మ వాళ్ల ఊరిలో హైస్కూలు ఉంది. కీర్తిని అక్కడే ఉంచి, చదివించాలని తల్లిదండ్రులు ఓ నిర్ణయానికొచ్చారు.

Published : 12 Nov 2022 00:18 IST

గంగాపురం ప్రాథమిక పాఠశాలలో కీర్తి అయిదో తరగతి పూర్తి చేసింది. ఆ ఊరిలో హైస్కూలు లేదు. తండ్రికేమో దగ్గరలోని పట్టణంలో చదివించడం ఇష్టం లేదు. ఇంటికి దూరంగా, హాస్టల్లో ఉంచడం తల్లికీ నచ్చదు. అమ్మమ్మ వాళ్ల ఊరిలో హైస్కూలు ఉంది. కీర్తిని అక్కడే ఉంచి, చదివించాలని తల్లిదండ్రులు ఓ నిర్ణయానికొచ్చారు. అమ్మమ్మ కష్టసుఖాలు తెలిసిన మనిషి. నలుగురితో కలిసిపోయే మనస్తత్వం. కీర్తి వాళ్ల మేనమామ, అత్తయ్యలు కూడా మంచివారే.  
వేసవి సెలవులు ముగియగానే.. అమ్మమ్మ వాళ్ల ఇంటికి కాస్త దూరంలో ఉండే బడిలో చేరింది కీర్తి. ‘అమ్మా.. నీకు తెలుసు కదా.. అమ్మాయి చాలా సుకుమారంగా పెరిగింది. ఎవరితోనూ అంత త్వరగా కలిసిపోదు. ముభావంగా ఉంటుంది. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి’ అంటూ అమ్మమ్మతో చెప్పింది అమ్మ. ‘అమ్మమ్మను నేనుండగా.. నీకెందుకు భయం’ అంటూ అభయమిచ్చింది అమ్మమ్మ. ప్రతిరోజు నడుచుకుంటూనే బడికి వెళ్లివస్తుండేది కీర్తి. కాలినడకనే ప్రయాణం కావడంతో కాస్త అలసిపోయేది. మధ్యాహ్నం భోజనం కోసం అమ్మమ్మ లంచ్‌ బాక్స్‌ పెట్టి ఇచ్చేది. కీర్తికి ఇదంతా కొత్త అనుభవం.

అలా ఒక నెల గడిచింది. ‘కూరలు ఎలా ఉన్నాయి? బడిలో అందరూ స్నేహితులయ్యారా?’ అని తరచూ అమ్మమ్మ అడుగుతుండేది. ‘కూరలు బాగుంటున్నాయి కానీ, ఇంకా నాకు ఎవరూ స్నేహితులు కాలేదు’ అంటూ మనవరాలు ముభావంగా సమాధానమిచ్చేది. దీంతో అమ్మమ్మ ఆలోచనలో పడింది. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కీర్తి.. తోటి పిల్లలకు దూరంగా కూర్చుని తింటుండేది. ఒకరోజు మధ్యాహ్నం భోజనం సమయంలో ఎప్పటిలాగే ఒంటరిగా కూర్చుంది. అన్నంలో అమ్మమ్మ చేసిన రసం కలిపి.. ముద్ద నోట్లో పెట్టుకుంది. ‘అబ్బబ్బా.. ఏంటిది?’ అంటూ విసుగ్గా అంది. కాస్త దూరంగా అన్నం తింటున్న మిగతా పిల్లలందరూ ఆ మాటలు విన్నారు. ‘ఏం జరిగింది?’ అంటూ కీర్తి వైపు చూశారు. ‘ఈరోజు రసం చప్పగా.. నీళ్లలాగే ఉంది’ అని చిన్నబుచ్చుకుంది కీర్తి. వెంటనే.. తన దగ్గరున్న సాంబారును తీసుకొచ్చి ఇచ్చింది రాణి. ‘మొహమాట పడకుండా తిను’ అనడంతో.. సాయంత్రం వరకూ ఆకలితో ఉండటం కష్టమనుకొని, సరేనని అన్నంలో కలుపుకొంది కీర్తి.

సాయంత్రం ఇంటికి వెళ్లగానే.. ‘అమ్మమ్మా.. ఆ రసం ఏంటి.. అలా ఉంది. రుచీపచీ లేకుండా..?’ అని రుసరుసలాడింది కీర్తి.
మరుసటి రోజు మధ్యాహ్నం అన్నం తింటుంటే.. కూరలో కారం చాలా ఎక్కువైంది. ఆ కారానికి నోరంతా మండిపోతోంది. కీర్తి గొంతులో పొలమారుతుంటే, శ్రావణి చూసి దగ్గరికొచ్చింది. నీళ్లు అందిస్తూ.. ‘ఏమైంది?’ అని అడిగింది. గొంతు సవరించుకుంటూ.. ‘కూరలో కారం చాలా ఎక్కువగా ఉంది’ అని బదులిచ్చింది కీర్తి. శ్రావణి తన దగ్గరున్న కూర తీసుకొచ్చి.. ‘అది అలా ఉంచు. ఈ కూర తిను. మరేం ఫరవాలేదు’ అని ఇచ్చింది. మిగతా పిల్లలూ అక్కడికే రావడంతో.. వారి మధ్యే భోజనం ముగించింది కీర్తి. అప్పటివరకూ ఎవరితోనూ అంతగా కలవని తనకు.. ఒక్కసారిగా తెలియని సంతోషం అనిపించింది. సాయంత్రం ఇంటికి వెళ్లగానే.. ‘అమ్మమ్మా.. అసలు ఏమిటా వంట.. నిన్న రసం, ఈరోజు కూర’ అంటూ నొచ్చుకుంది.

తర్వాతి రోజు.. అమ్మమ్మ వంట చేస్తుంటే, పక్కనే కూర్చొని చూడసాగింది కీర్తి. బడికెళ్లాక.. భోజన విరామ సమయంలో మిగతా పిల్లలతోపాటే కూర్చుంది. అన్నం డబ్బా మూత తీసి చూసింది. అన్నం మొత్తం ముద్దగా అయింది. అది చూడగానే కీర్తికి.. కళ్లు తిరిగినంత పని అయింది. మిగతా పిల్లలు చూసి ‘అయ్యో.. అన్నం ఏంటి ఇలా ఉంది’ అంటుండగానే.. తన డబ్బాలోని అన్నాన్ని ఇచ్చింది రాణి. కీర్తి వాళ్ల అమ్మమ్మ వండిన కూరలు తీసుకొని తింది. ‘ఆహా.. కూరలు ఎంత బాగున్నాయి. అన్నం ఎందుకో ముద్దగా ఉంది. అంతే..’ అంది. సాయంత్రం స్కూలు విడిచి పెట్టిన తరువాత కీర్తి చిన్న ముఖం చేసుకొని ఇంటికి వచ్చింది. ‘అమ్మమ్మా! నీ వంటలు రోజుకొకటి బాగుండటం లేదు. నా స్నేహితుల ముందు సిగ్గుగా ఉంది’ అంది. ‘కీర్తి.. రేపటి నుంచి చూస్తావు కదా! మీ మిత్రులంతా మెచ్చుకునేట్లు చక్కగా వండుతాను. వాళ్లు తిన్న తర్వాత ఏమన్నారో నాకొచ్చి చెప్పు నువ్వు..’ అని అమ్మమ్మ భరోసా ఇచ్చింది.    

మరుసటి రోజు.. పెద్ద బాక్స్‌లో అమ్మమ్మ లంచ్‌ సర్ది పెట్టింది. ఆరోజు కీర్తి తెచ్చిన వంటకాలను మిత్రులంతా తిని ఎంతో మెచ్చుకున్నారు. ఇక తన ఆనందానికి అంతులేదు. సాయంత్రం ఇంటికి పరుగు పరుగున వచ్చి ‘ఆహా.. అమ్మమ్మా.. నీ వంటలు అద్భుతం.. మా స్నేహితులంతా లొట్టలేసుకుని తిన్నారు’ అని ముచ్చట పడుతూ చెప్పింది కీర్తి. ‘నువ్వు స్కూలులో చేరిన తరువాత అందరికీ దూరంగా కూర్చుంటున్నావని నీ మాటల్లో తెలిసింది. అందుకే, వారితో ఎలాగైనా నువ్వు కలిసిపోయేలా చేయాలనే.. నేను రోజూ ఏదో ఒక వంట బాగా చేయలేదు. నేను అలా చేయబట్టే.. నువ్వు అందరితో బాగా కలిసిపోయావు. వాళ్లంతా నీకు మిత్రులయ్యారు’ అని అసలు విషయం చెప్పింది అమ్మమ్మ.

- బెహరా ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని