Published : 13 Nov 2022 00:04 IST

డబ్బే అవసరం లేదు!

కూటికి పేదవాడైనా.. కనకయ్య, అతడి ఊళ్లో మంచివాడిగా పేరు పొందాడు. అందరికీ తలలో నాలుకయ్యాడు. ‘అదెలా సాధ్యపడింది? డబ్బుతోనే గౌరవం దక్కుతుంది కదా, సాయం కూడా డబ్బుతోనే వీలవుతుంది కదా. మరి, డబ్బులేని కనకయ్యకు అంత మంచి పేరు ఆ ఊళ్లో ఎలా వచ్చింది?’ అనుకుని ఆ కిటుకు తెలుసుకోడానికి కనకయ్య మిత్రుడైన వీరయ్య ఆ ఊరికి మారు వేషంలో బయలుదేరాడు.

వీరయ్య ఆ ఊళ్లో ప్రవేశించేసరికి కనకయ్య ఒక ఇంటి వద్ద ఆగి ఆ ఇంటి యజమానిని పిలవసాగాడు. విచారంగా బయటకు వచ్చిన ఆ ఇంటి యజమానితో... ‘నీ కొడుక్కు వైద్యవిద్య చదువుకునే ర్యాంకు రాలేదని విన్నాను. అందుకు నువ్వు బాధ పడుతున్నట్టు తెలిసింది. సరైన ర్యాంకు రాకపోవడం బాధాకరమే. కాదనను.  బాధపడితే సీటు వస్తుందా? రాదు కదా! నువ్వు బాధ పడితే నీ కొడుకు బాధపడతాడు. బాధలో మునిగేవారు విజయం అందుకోలేరు. నువ్వు హుషారుగా ఉండు. నీ కొడుకును హుషారుగా ఉంచు. మరో ప్రయత్నం చేసి మంచి ర్యాంకు తెచ్చుకోవాలని నీ కొడుకును ప్రోత్సహించు!’ అని చెప్పాడు.

కనకయ్య మాటలు విన్న ఆ ఇంటి యజమాని విచారం మటుమాయమైంది. ఆనందంగా ఇంట్లోకి వెళ్లి పోయాడు. అక్కడ నుంచి కనకయ్య ఇంకో వీధి వెళ్లాడు. అక్కడ గాయపడి నడవలేని స్థితిలో ఒకాయన కనిపించాడు. అక్కడ కనకయ్య ఆగిపోయాడు... ‘ఎప్పుడు గాయపడ్డావు? ప్రమాదం ఎలా జరిగింది?’ అని అడిగి కారణం తెలుసుకొని సానుభూతి తెలిపాడు. ఇంటి వరకు చేయి పట్టుకుని దిగబెట్టాడు.

ఆ వీధిలో మరి కొన్ని ఇళ్లు దాటాడు. ఇరుగు పొరుగు వాళ్లు అక్కడ గొడవపడుతున్నారు. కారణం చచ్చిన ఎలుక! ఆ చచ్చిన ఎలుకను కాకి పట్టుకొని పోవడం కొద్ది సేపు క్రితం కనకయ్య చూశాడు. ఆ ఇరుగుపొరుగు వాళ్లలో ఒక ఇంటి వారు ‘ఎలుకను తమ ఇంటి వైపు విసిరారు’ అని పొరుగింటి వాళ్లపై ఆరోపిస్తున్నారు. ఇవతలి వారు ‘మేం కాదు’ అని గోల పెడుతున్నారు. కనకయ్య వారి మధ్యకు వెళ్లి..‘ఆ ఎలుకను అక్కడ పడవేసింది ఒక కాకి’ అని తను చూసింది చెప్పాడు. అపోహలతో స్నేహం చెడుతుందని ఆ గృహస్థులకు చెప్పి అక్కడ నుంచి కదిలాడు.

అలా వెళ్తుండగా కనకయ్యకు ఒక వీధి రౌడీ కనిపించాడు. కనకయ్య చూస్తుండగానే ఆ రౌడీ ఒక అమాయకుడి మీద దాడి చేయబోయి కాలికి రాయి తగిలి కింద పడ్డాడు. కాలి బొటన వేలుకు గాయమైంది. కనకయ్య వెంటనే తన రుమాలును చింపి నెత్తురు పోకుండా కట్టుకట్టాడు. ఆ రౌడీ పాదాన్ని నేల మీద మోపలేకపోయేసరికి తానే ఊతంగా ఉండి నడిపించాడు. దారిలో.. ‘చెరపకురా చెడేవు, ఎవరు తీసిన గోతిలో వారే పడతారని, చేతనైతే సాయం చెయ్యాలి గాని హాని మాత్రం తలపెట్టకూడదు’ ఇలాంటి నీతి వాక్యాలు అతడి చెవిలో వేశాడు. అతడి బుద్ధిని మార్చడానికి ప్రయత్నించాడు. అక్కడ నుంచి కనకయ్య ఇంటి ముఖం పట్టాడు. అతడి వెనకాలే అనుసరిస్తున్న కనకయ్య ముందుకు వచ్చి తన మారు వేషం తీశాడు. కనకయ్య మిత్రుడిని చూసి నివ్వెరపోయాడు.
అప్పుడు వీరయ్య... ‘ఊళ్లో నీ మంచి పేరుకు కారణం తెలుసుకోవాలని మారువేషంలో నిన్ను అనుసరించాను. నీ గొప్ప ప్రవర్తనను దగ్గరుండి చూశాను. నిరుపేదవైనా.. నువ్వు చిరునవ్వుతోను, జాలి, దయ కనికరంతోనూ అవతలివారి మనసులను దోచుకున్నావు. అంతే కాక నాలుగు మంచి మాటలతో తగవు తీర్చావు. ఒక రౌడీని మనసు మార్చి, ఆలోచనలో పడేలా చేశావు. ఇవన్నీ ధనం లేకుండానే చేసి, పరులకు సేవ చెయ్యడానికి డబ్బే అవసరం లేదని రుజువు చేశావు. నాలాంటి వారి కళ్లు తెరిపించావు. నీ జన్మ ధన్యమైంది’ అని అన్నాడు. ఆ రోజంతా కనకయ్యతో గడిపి మర్నాడే తన ఊరికి బయలుదేరాడు వీరయ్య. కొద్దికాలంలో కనకయ్యలాగే వీరయ్య కూడా ఊరి వారికి తలలో నాలుకయ్యాడు.

- బెలగాం భీమేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు