Published : 14 Nov 2022 00:11 IST

గాడిదకు తెలిసొచ్చింది!

కొండపాలెం ఊర్లో పిచ్చయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. చుట్టూ కొండలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో అందంగా ఉండేదా గ్రామం. పిచ్చయ్య రోజూ తన గొర్రెలను కొండ ప్రాంతానికి తీసుకువెళ్లేవాడు. అక్కడ వాటికి సరిపడా మేత దొరికేది. గొర్రెలతోపాటు ఓ గాడిదను కూడా వెంట తీసుకువెళ్లేవాడు పిచ్చయ్య. ఆహారం,  మంచినీళ్లతోపాటు ఇతర సామగ్రిని గాడిదతో మోయించేవాడు. కానీ, గాడిదకు ఆ చాకిరీ చేయడం మహా కష్టంగా అనిపించేది. ఎప్పటిలాగే ఒకరోజు గొర్రెలను కొండ ప్రాంతానికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న పిచ్చయ్య దగ్గరకు అతడి భార్య వచ్చింది. ‘ఏమయ్యా... వర్షం వచ్చేలా ఉంది. మబ్బులు చూడు.. ఎంత దట్టంగా కమ్ముకున్నాయో? ఈరోజు గొర్రెలను తీసుకెళ్లకపోవడమే మంచిది అనిపిస్తోంది’ అంది. భార్య మాటలను పట్టించుకోని పిచ్చయ్య, రోజూలాగే గొర్రెలతోపాటు గాడిదనూ కొండకు తోలుకువెళ్లాడు.

గొర్రెలు బండరాళ్లెక్కి లేలేత చిగుళ్లను తింటుంటే.. పిచ్చయ్య ఓ చెట్టు కొమ్మపైన కూర్చొని పరిసరాలను గమనించసాగాడు. గాడిద కూడా కొంచెం దూరంలో మరో చెట్టు కింద నిలబడి.. యజమాని వైపే చూస్తూ ఉంది. ఇంతలోనే వర్షం మొదలైంది. భారీ వర్షం కురిసే సూచన కనబడటంతో పిచ్చయ్య అప్రమత్తమయ్యాడు. పరుగులాంటి నడకతో గొర్రెలను తీసుకొని ఇంటి దారి పట్టాడు. గాడిద మాత్రం తొందరపడకుండా చెట్టు కింద ప్రశాంతంగా అలాగే కూర్చుంది. రోజూ యజమానికి చాకిరీ చేసేకన్నా.. ఇలాగే అడవిలో ఉండిపోవడమే మంచిదనుకుంది. కొండలను దాటుకుని, అడవి లోపలికి వెళ్లింది. పిచ్చయ్య ఇంటికి చేరుకున్నాక.. గాడిద తనతో పాటు రాలేదని గుర్తించాడు.

‘అయ్యో.. గాడిద తప్పిపోయినట్టుంది. వర్షంలో హడావిడిగా రావడంతో దాన్ని పట్టించుకోలేదు. ఒంటరిగా ఎక్కడ ఉందో.. ఏంటో?’ అని భార్యతో అని బాధపడ్డాడు పిచ్చయ్య. ‘ఎక్కడికీ పోదులే... రేపు ఎలాగూ కొండకు వెళతారు కదా.. అప్పుడు వెతకండి..’ అంటూ ఓదార్చింది భార్య. గాడిద గురించి ఆలోచిస్తూ.. ఆరోజు రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు పిచ్చయ్యకు. మరుసటి రోజు గొర్రెలను కొండకు తీసుకెళ్లిన పిచ్చయ్య, గాడిద కోసం కొండ ప్రాంతమంతా వెతకసాగాడు. కానీ, అదెక్కడా కనిపించలేదు. ‘పాపం గాడిద.. ఏ పులికో, సింహానికో ఆహారం అయినట్టుంది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అడవిలోకి వెళ్లిన గాడిదను అక్కడి పరిసరాలు భయపెట్టాయి. తినడానికి తిండి దొరకలేదు. తాగడానికి నీళ్లు కూడా కనిపించలేదు. అడవికి కొత్త కాబట్టి ఇంకా లోపలికి వెళ్తే ఎక్కడ ఏ జంతువు దాడి చేస్తుందోనని.. అది తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడపసాగింది. అలా భయపడుతూ బతకడం కంటే.. యజమాని దగ్గరకు వెళ్లడమే మేలని భావించింది. వెంటనే అడవి నుంచి కొండప్రాంతం వైపు చేరుకుని ఊరి దిశగా బయలుదేరింది. సాయంత్రానికి ఊర్లోకి వచ్చిన గాడిదకు యజమాని ఇల్లు గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. ప్రతిరోజూ యజమానిని అనుసరిస్తూ పోవడమే కానీ ఎన్నడూ దారిని గుర్తుంచుకోలేదు.

ఇంతలో హఠాత్తుగా ఓ ఇంటి నుంచి.. ‘ఈ గాడిద చాకిరీ నేను చేయలేను. ఇక ఈ ఇంట్లో ఉండను గాక ఉండను. ఎటైనా వెళ్తా..’ అంటూ పెద్ద శబ్దంతో మాటలు వినిపించాయి. ‘అరే నా గురించే మాట్లాడుతున్నారంటే.. ఇది నా యజమాని ఇల్లే...’ అని మనసులో సంబరపడింది గాడిద. ఈలోగా ఇంట్లో నుంచి కోపంగా బయటకు వస్తున్న పాపయ్య దానికి కనిపించాడు. తన యజమాని కాదనుకొని నిరాశగా ముందుకు కదిలిందా గాడిద. కొద్దిదూరం వెళ్లగానే.. ‘అరేయ్‌ గాడిదా.. పనీపాటా లేకుండా ఖాళీగా ఇంట్లోనే కూర్చుంటూ, ఎన్నాళ్లిలా తల్లిదండ్రుల మీద పడి తింటావురా?’ అనే మాటలు వినపడ్డాయి. గాడిద సంతోషంగా ఆ ఇంటి గేటు దాటగానే.. జులాయిగా తిరుగుతున్న తన కొడుకును రాజయ్య కోపంతో మందలించడం కనిపించింది. అది తన యజమాని ఇళ్లు కాదని గాడిద మళ్లీ నిరాశపడింది.

మరికొద్ది దూరం వెళ్లగానే ‘కడివెడు గాడిద పాల కన్నా.. గరిటెడు గంగిగోవు పాలు ఉత్తమం’ అనే మాటలు వినిపించడంతో గాడిద పరుగు పరుగున అటుగా వెళ్లింది. అక్కడ ట్యూషన్‌లో మాస్టారు తెలుగు పాఠం చెబుతూ కనిపించారు. ఉసూరుమనుకుంటూ వెళ్లిపోయింది గాడిద. ఇంకాస్త ముందుకు వెళ్లాక.. ‘గాడిద ఎక్కడ ఉందో.. ఎలా ఉందో...’ అనే మాటలు వినబడ్డాయి. పిచ్చయ్య గొంతును గుర్తుపట్టిన గాడిద.. యజమాని దగ్గరకు పరుగెత్తుకెళ్లింది. దాన్ని చూడగానే పిచ్చయ్య చాలా సంతోషించాడు. గాడిదకు కూడా ప్రాణం పోయి తిరిగి వచ్చినట్లైంది. గాడిదను ప్రేమగా నిమిరి.. దానికి ఇష్టమైన ఆహారం అందించాడు. ఇక యజమాని కుటుంబానికి ఎప్పుడూ దూరం కాకూడదని నిర్ణయించుకుంది గాడిద.

- వడ్డేపల్లి వెంకటేష్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు