Updated : 15 Nov 2022 06:48 IST

మారిన జమీందారు!

మేడపాడు జమీందారు రాఘవయ్య. ఆయనకు చాలా ఆస్తి ఉన్నా, ఎవ్వరికీ ఉచితంగా ఏమీ ఇచ్చేవాడు కాదు. చేసిన పనికి మాత్రం వెంటనే డబ్బు లెక్క కట్టి ఇచ్చేవాడు. కొంతమంది జమీందారును లోభి అని అనడం ఆయన దృష్టికి వచ్చింది. అయినా ఆయనలో ఎందుకో మార్పు రాలేదు. అంతేకాదు భార్యకు కూడా ఎవరికీ దానం చేయవద్దని చెప్పేవాడు.

‘ఏమండీ మనకు తరగని ఆస్తి ఉంది. చిన్న చిన్న దానాలు చేస్తే తప్పేంటి?’ అనేది రాఘవయ్య భార్య సుశీలమ్మ. ‘ఎందుకు ఉచితంగా ఇవ్వాలి. వద్దేవద్దు’ అని తేల్చి చెప్పేవాడు ఆయన. దాంతో ఆమె ఏమీ అనలేకపోయేది. రాను రాను.. చాలా మంది జమీందారును పిసినారిగా తేల్చారు. అందుకే ఆయన్ను ఏమీ ఉచితంగా అడిగేవారు కాదు. కొన్ని రోజులకు ఎవరూ తనతో పెద్దగా మాట్లాడకపోవడం గమనించాడు రాఘవయ్య.

దానికి కారణం తను ఏదీ ఉచితంగా ఇవ్వకపోవడమే అని గ్రహించాడు. ‘మనకు చాలా సంపద ఉంది. చిన్నచిన్న దానాలు చెస్తే తప్పేంటి?’ అన్న భార్య మాటలు గుర్తుకు వచ్చాయి. ‘అవును.. చిన్న చిన్న దానాలు చెయ్యాలి’ అనుకున్నాడు. కానీ చేయలేక పోయాడు. కారణం.. అతని మనసు ఒప్పుకున్నా, బుద్ధి సహకరించక పోవడమే! ‘ఏమండీ.. ఇలాగైతే ఏదో ఒక రోజు ప్రజలు మనకు సహకరించడం మానేస్తారు’ అంది భార్య. ఒకరోజు సుశీలమ్మ అన్నయ్య మేడపాడు వచ్చాడు. విషయం అంతా అన్నయ్యకు చెప్పింది సుశీల.

‘కొంతకాలం ఏదైనా యాత్రలకు వెళ్లిరండి. బావలో మార్పు వస్తుంది’ అన్నాడు అన్నయ్య. జమీందారుకు కూడా యాత్ర చేయాలనిపించింది. బండి కట్టుకుని బయలుదేరారు. రాత్రి సమయానికి గంగవరం అనే ఊరు చేరారు.

‘అయ్యా! ఎద్దులు బాగా అలసిపోయాయి. ఈ రాత్రికి ఇక్కడే బస చేయాలి. ఎక్కడన్నా సత్రం ఉందేమో కనుక్కుని వస్తాను. మీరు బండిలో ఉండండి’ అన్నాడు నౌకరు రామయ్య. వెళ్లి వెంటనే వచ్చాడు. ‘అయ్యా..! ఇక్కడ సత్రాలు ఏమీ లేవట. దగ్గర్లో లక్ష్మమ్మ అనే ఆమె భోజనం వండి పెడుతుందట. అక్కడే ఒక గది కూడా దొరకొచ్చు అంటున్నారు’ అని చెప్పాడు.

‘సరే అక్కడికే బండి పోనీ’ అన్నాడు రాఘవయ్య. వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించింది లక్ష్మమ్మ. ‘అయ్యా! మీరెవరో గొప్పవారిలా ఉన్నారు. నా దగ్గర ఒక గది మాత్రమే ఉంది. మీరు సర్దుకుంటానంటే నేను వంటగదిలో పడుకుని మీకు ఆ గది సర్దుబాటు చేస్తాను’ అంది.

‘ఫరవాలేదమ్మా.. అలాగే కానీ’ అంది సుశీలమ్మ. గబగబా గది తుడిచి మంచాలు వేసింది లక్ష్మమ్మ. ‘అమ్మా.. ఒక గంటలో వంట పూర్తవుతుంది. ఈలోగా విశ్రాంతి తీసుకోండి. పెరటిలో బావి ఉంది. అక్కడే స్నానాలగది కూడా ఉంది’ అని చెప్పి తాను వంట చేయడంలో మునిగిపోయింది.

రాఘవయ్య, సుశీలమ్మ స్నానం చేసి వచ్చేసరికి ఘుమఘుమలాడే వంట చేసింది లక్ష్మమ్మ. ఆమె చేతి వంటను పొగడకుండా ఉండలేక పోయాడు రాఘవయ్య.
‘లక్ష్మమ్మా.. నీ చేతి వంట అమోఘం.. రేపు కూడా తినే వెళతాం’ అన్నాడు. ‘క్షమించండి.. రేపు శుక్రవారం నేను ఇక్కడ వంట చేయను. కావాలంటే ఇక్కడికి దగ్గరలో పాఠశాల ఉంది. అక్కడికి వస్తే భోజనం పెడతాను’ అంది. ఆమె మాటలకు ఆశ్చర్యపోయారు దంపతులిద్దరూ. డబ్బుల గురించి ఆలోచించకు అంది సుశీల.

‘అమ్మా.. మీరొచ్చి మూడు గంటలైంది. నేను ఒకసారన్నా.. డబ్బుల గురించి మాట్లాడానా?’ అంది లక్ష్మమ్మ. ‘ఇక విశ్రాంతి తీసుకోండి’ అంటూ.. నౌకరు రామయ్యకు కూడా భోజనం పెట్టి తానూ తిని అన్నీ సర్దుకుంది లక్ష్మమ్మ.

మరుసటి రోజు రాఘవయ్య, సుశీలమ్మ నిద్రలేచే సరికి.. లక్షమ్మ పాలు కాచి ఇచ్చి.. ‘అయ్యా మీరు ఇక్కడే ఉంటే, భోజనానికి పాఠశాల వద్దకు రండి. ఇక్కడికి చాలా దగ్గర. లేదంటే రాత్రి భోజనం నిమిత్తం 15 రూపాయలు చెల్లించి వెళ్లవచ్చు’ అంది.

‘ఏమిటి 15 రూపాయలేనా? ఇలాగైతే నీకు ఏమి మిగులుతుంది’ అన్నాడు రాఘవయ్య. ‘అయ్యా...! మీలాంటి వారికి భోజనం పెట్టాను. ఆ తృప్తి చాలు నాకు. నేను లాభం కోసం ఈ పూటకూళ్ల ఇల్లు నడపడం లేదు. ఏదో నా పొట్ట పోషించుకోవడంతోపాటు పది మంది బాటసారుల ఆకలి తీర్చాలని ఆలోచిస్తాను’ అంది.
తరువాత లక్ష్మమ్మ నెత్తి మీద సరకులు పెట్టుకుని పాఠశాల వైపు సాగిపోయింది. మధ్యాహ్నం వేళకు జమీందారు రాఘవయ్య, సుశీలమ్మ కూడా పాఠశాల దగ్గరకు చేరుకున్నారు. అక్కడ లక్ష్మమ్మ వంటలు చేస్తోంది. చాలా మంది పిల్లలు ఆమె చుట్టూ చేరి కబుర్లు చెబుతున్నారు.

‘అయ్యా.. వచ్చారా..’ అంటూ.. ‘పిల్లలూ... ఈ రోజు మనకు అతిథులు వచ్చారు. వారికి స్వాగతం చెప్పండి’ అంది. పిల్లలంతా రాఘవయ్య, సుశీలమ్మ దగ్గరకు చేరారు. ‘ఏమిటిదంతా..?’ అని అడిగాడు రాఘవయ్య. ‘అయ్యా మేమంతా అనాథలం. రోజూ ఎవరో ఒకరు మాకు అన్నం పంపుతారు. కానీ, ప్రతి శుక్రవారం మా లక్ష్మమ్మ మాత్రం ఇక్కడకు వచ్చి మాకు కావాల్సినవి వండిపెడుతుంది’ అని బదులిచ్చారా పిల్లలు.

‘మరి ఆమెకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?’ అని అడిగారు రాఘవయ్య. ‘ఏముంది వారం రోజులు పుటకూళ్ల ఇల్లు నడుపుతుంది. ఆ వారం వచ్చిన డబ్బులతో ఇదిగో ఇలా శుక్రవారం మాకు ఖర్చు పెడుతుంది’ అన్నారు.

పిల్లలతోపాటు రాఘవయ్య దంపతులకు భోజనం పెట్టింది లక్ష్మమ్మ. ఆమె దాతృత్వానికి ఆశ్చర్యపోయాడు రాఘవయ్య. ఏమీలేని లక్ష్మమ్మ చేసిన దానం, అన్నీ ఉండి ఎవరికీ సహాయం చేయని తన స్థితికి సిగ్గుపడ్డాడు.  

‘లక్ష్మమ్మా... ఈ రోజు నుంచి ఈ పిల్లలు అనాథలు కాదు. వీరికి కావాల్సిన సహాయం నేను చేస్తాను నువ్వు దగ్గరుండి వారి బాగోగులు చూడు’ అంటూ.. తన దగ్గరున్న డబ్బు లక్ష్మమ్మ చేతిలో పెట్టాడు. తన భర్తలో వచ్చిన మార్పునకు చాలా సంతోషించింది సుశీలమ్మ. ‘సుశీలా.. మనం వెంటనే ఊరు వెళ్లాలి. అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’ అన్నాడు రాఘవయ్య. ‘లక్ష్మమ్మా.. నీకే సహాయం కావాల్సి వచ్చినా నాకు కబురు పంపు’ అంటూ.. బండెక్కి .. తన ఊరి వైపు సాగిపోయాడు.  

- కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు