Published : 16 Nov 2022 00:13 IST

కటారయ్య కొలిమి!

అడవిలో నక్క, తోడేలు, ఎలుగుబంటి కలసి తిరుగుతుండేవి. తెలివితేటల్లో తమను మించినవారు ఈ ప్రపంచంలోనే లేరని మిడిసిపడుతుండేవి. ఒకరోజు ఆ మూడూ చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటూ.. సరదాగా మాట్లాడుకోసాగాయి. వాటి ముచ్చట్లను చెట్టుపైనున్న కోతిబావ కుతూహలంగా వింటోంది.

‘నాకు చిలుక కొరికిన జామపండు అంటే భలే ఇష్టం. చిలుక కొరకబట్టే ఆ పండుకి అంత రుచి వచ్చిందంటుంటారు. నాకు కూడా దానిలా ఎర్రటి నోరు ఉంటే ఎంత బాగుండునో.. ఏం తిన్నా తియ్యగా ఉండేది’ అని తన మనసులోని కోరికను బయటపెట్టింది ఎలుగుబంటి. ‘పులిలా వేటాడటమంటే నాకు భలే సరదా. దాని శక్తంతా శరీరంపై ఉన్న చారల్లోనే ఉందని నా అనుమానం. ఆ చారలు నాకూ ఉంటే ఎంత బాగుండు. దొరికిన జంతువునల్లా వేటాడేదాన్ని’ అని ఆశగా తన కోరికను చెప్పింది నక్క. ‘కొంగలా చెరువులో చేపల్ని వేటాడి తినాలని నా కోరిక. పొడవాటి మెడ ఉండబట్టే దానికి చేపల వేట సులభమైందనుకుంటా. నాకూ అలా ఉంటే బాగుంటుంది’ అని చెప్పింది తోడేలు.

‘మన కోరికలు తీరాలంటే ఏం చేయాలి?’ అని నక్క అంటుండగానే.. చెట్టుపైనున్న కోతి బిగ్గరగా నవ్వింది.  ‘ఎందుకా నవ్వు?’ అని కోతి వైపు ఎగాదిగా చూస్తూ కోపంతో అడిగింది తోడేలు. ‘మీ కోరికల జాబితా వింటే, ఎవరికైనా నవ్వే వస్తుంది. ప్రకృతి ధర్మంతో పుట్టిన మనకు అత్యాశలు సరికాదు. అవి ఆపదలను కొని తెస్తాయి’ అంది కోతి. ‘ఇతరుల అభివృద్ధిని చూసి ఓర్వలేని అసూయ నీది. చేతనైతే మా కోరికలు తీరేందుకు మంచి సలహా ఇవ్వు. లేకపోతే నోరు మూసుకొని ఉండు’ అంటూ హెచ్చరించింది నక్క. ఆ మాటలకు కోతి చిన్నబుచ్చుకుంది. వాటి తిక్క కుదిరేలా ఓ సలహా ఇచ్చి.. మార్పు తీసుకురావాలనుకుంది.

‘ఈ అడవి చివర ఒక గ్రామం ఉంది. అక్కడ కత్తుల కటారయ్య అనే వ్యక్తి ఉన్నాడు. కొలిమి పెట్టి కత్తులు తయారు చేసే అతడు, మీ ముగ్గురి కోరికలను తీర్చగలడు’ అని చెప్పింది కోతి. ‘అతనంత గొప్పోడా?’ అని ఆశగా అడిగింది ఎలుగుబంటి. ‘కత్తులను చేసేటప్పుడు ముందు ఇనుప కడ్డీలను ఎరుపు రంగులోకి మారుస్తాడు. ఆ తరువాత వాటిని బాగా సాగదీస్తాడు. నగిషీలు చెక్కడానికి వాటిపైన చారలు వేస్తాడు’ అని వివరించింది కోతి. ‘నువ్వు ఏదో కుట్రతో ఈ సలహా ఇస్తున్నావు కదా?’ అని అనుమానంగా అడిగింది నక్క. కోతి నవ్వుతూ.. ‘నా మీద నమ్మకం లేకపోతే, కింద తచ్చాడుతున్న తొండను అడగండి’ అంది. ఆ మూడు జంతువులు తొండ వైపు చూసి.. ‘కోతి చెప్పేది నిజమేనా?’ అని అడిగాయి.

తొండ తన అలవాటు ప్రకారం తల కిందకు, మీదకు ఊపింది. కోతి మాటలు తొండ సమర్థించిందనుకొని.. కత్తుల కటారయ్య దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయవి. ఆ మూడు జంతువులూ ఊహల్లో తేలియాడుతూ కొలిమి దగ్గరకు చేరుకున్నాయి. కటారయ్య కత్తిని తయారుచేసే పనిలో ఉండడంతో వాటిని గమనించలేదు. అతడు కత్తిని చేసే క్రమంలో కోతి చెప్పిన పద్ధతినే పాటించడంతో వాటికి పూర్తిగా నమ్మకం కలిగింది. కాసేపటికి కటారయ్యను పిలిచి.. తమ కోరికల చిట్టాను విప్పాయి. అతడికి ఏం చేయాలో తెలియలేదు. కొద్దిసేపు ఆలోచించి.. ‘ఎంతటివారైనా ముందు కష్టపడితే, తరువాత సుఖపడతారు. నొప్పి, బాధ కలిగినా ఓర్చుకోండి. మీ కోరికలు తీరుస్తాను’ అని అన్నాడు కటారయ్య. సరేనన్నాయా జంతువులూ.

ముందుగా ఎర్రని నిప్పుల కొలిమిలో ఎలుగు మూతిని పెట్టించాడు. వెంట్రుకలు, చర్మం కొంత కాలి.. దాని మూతి ఎరుపెక్కింది. బాధ తట్టుకోలేక కుయ్యో.. మెుర్రో అనుకుంటూ గంతులు వేయడం మెుదలుపెట్టింది. దాన్ని ఓదారుస్తూ పక్కన కూర్చోమన్నాడు కటారయ్య. తరువాత తోడేలును పిలిచాడు. ఇనుప దిమ్మెపైన దాని మెడను పెట్టమని చెప్పాడు. భయపడుతూనే.. చెప్పినట్టు చేసిందా తోడేలు. దాని మెడపై సుత్తితో కటారయ్య ఒక్కటిచ్చాడు. ‘నొప్పి.. బాబోయ్‌ నొప్పి’ అంటూ గబుక్కున లేచింది తోడేలు. ‘మెడ సాగదీత సరిపోతుందా?’ అని వ్యంగ్యంగా అడిగాడు కటారయ్య. ‘చాలు.. చాలు’ అంటూ చిందులేసింది తోడేలు. ఆ తరువాత నక్కను పిలిచాడు. కత్తి పిడికి చెక్కే నగిషీల మాదిరి.. దాని శరీరంపై చారలు లాంటి వాతలు పెట్టాడు. ‘బాబోయ్‌’ అంటూ కింద మీదా పడిందా నక్క.

నొప్పులు, మంటతో ఆ మూడూ మూలుగుతూ పక్కపక్కన చేరిపోయాయి. ‘మీ కోరికలు తీరాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా?’ అని వెటకారంగా అడిగాడు కటారయ్య. ‘కొరివితో తలగోక్కున్నట్టుగా ఉంది మా పని’ అని బాధతో మూలుగుతూ బదులిచ్చాయవి. ‘మనం మనలా ఉండడానికి ప్రయత్నించాలి. ఇతరుల్లో మంచితనాన్ని స్వీకరించాలి కానీ, ఇలా ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించకూడదు. ఇతరుల్లా రూపం మార్చుకోవాలని అనుకోవడం అవివేకం’ అని వాటికి హితబోధ చేశాడు కటారయ్య. తమ అతి తెలివికి తగిన శాస్తి జరిగిందనుకుంటూ అడవి వైపు నడిచాయా మూడు జంతువులు.

- బి.వి.పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు