ధైర్యమే విజయానికి మెట్టు!

వింధ్య పర్వత ప్రాంతాల్లోని అడవుల్లో ఓ చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి వీరసేనుడు రాజుగా ఉండేవాడు. పేరుకు రాజే కానీ వీరసేనుడికి పరిపాలన వ్యవహారాలేమీ పెద్దగా పట్టేవి కావు. ఆ రాజ్యానికి మంత్రి సుబుద్ధి. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లే ఆయనలో మంచితనం మచ్చుకైనా కనిపించదు.

Published : 17 Nov 2022 00:06 IST

వింధ్య పర్వత ప్రాంతాల్లోని అడవుల్లో ఓ చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి వీరసేనుడు రాజుగా ఉండేవాడు. పేరుకు రాజే కానీ వీరసేనుడికి పరిపాలన వ్యవహారాలేమీ పెద్దగా పట్టేవి కావు. ఆ రాజ్యానికి మంత్రి సుబుద్ధి. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లే ఆయనలో మంచితనం మచ్చుకైనా కనిపించదు.

వీరసేనుడు రాజ్య వ్యవహారాలన్నీ సుబుద్ధికి అప్పగించేసి హాయిగా, విలాసవంతంగా విశ్రాంతి తీసుకుంటుండేవాడు. ఇలా కొన్నాళ్లు సాగింది. రాజుగారికి రాజ్యపాలనా చతురత ఎంత ఉందో బాగా అర్థమైన మంత్రి ప్రజల్ని పన్నులతో పీడించుకుని తినడం, వ్యాపారస్థులను ముప్పుతిప్పలు పెట్టి డబ్బు గుంజుకోవటం మొదలుపెట్టాడు.

పొరుగు రాజ్యాల నుంచి రాజ దర్శనార్థం వచ్చే వాళ్లను అయోమయంలో పడేసి ఏదో ఒక రకంగా డబ్బు దండిగా వసూలు చేసుకోవడంలో అతడికి అతడే సాటి. ఒక్క మాటలో చెప్పాలంటే గోముఖ వ్యాఘ్రంలాంటివాడు.

సుబుద్ధి అవకాశం చూసుకొని మెల్లగా అంతఃపురంలోని వారందరినీ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఓ శుభ ముహూర్తాన రాజుగారిని రాజ్యంలోంచి తానే స్వయంగా అడవుల్లోకి తరిమేశాడు. అప్పుడు రాజుగారికి జ్ఞానోదయం అయింది.

‘ఔరా! ఎంత మోసపోయాను? ఎలా ఇంతకాలం రాజ్య పాలన విస్మరించి పరాధీనుడిలా మంత్రి మీద ఆధారపడి బతికాను!’ అనుకుని చాలా బాధపడ్డాడు. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం.. అనుకున్నాడు. అందుకని ఆలోచించి, ఆలోచించి తను చేసిన పొరపాటుకు ఆత్మహత్యే సరైన పరిష్కారం అని నిర్ణయించుకున్నాడు.

ఆత్మహత్య చేసుకోవటం కోసం అనువైన చోటు వెదుకుతూ ఓ చిన్న నది దగ్గరకు వచ్చాడు. వెంటనే భగవంతుణ్ని స్మరించుకుంటూ.. నదిలోకి దూకేశాడు. కానీ రాజుగారికి అప్పుడే చావు రాసిపెట్టి లేదు! ఎందుకంటే ఆ నది ఒడ్డునే ఆశ్రమం ఏర్పాటు చేసుకొని, ఒక మహాముని అందులో నివసిస్తున్నాడు. ఆయన ఇది చూసి.. గబగబా నదిలోకి దూకి రాజును రక్షించాడు.

రాజు కాస్త తేరుకున్నాక ‘ఏం... నాయనా! చూస్తే బాగా బతికిన వాడిలా ఉన్నావు. ఎందుకు ఆత్మహత్యా యత్నం చేస్తున్నావు? అది మహాపాపం అని తెలియదా?’ అన్నాడు. రాజు జరిగిందంతా వివరించాడు. అందుకా మహాముని చిరునవ్వు నవ్వి.. ‘నాయనా! ఎదురుగా ఉన్న ఆ చెట్టును చూడు. అది రెండు నెలల క్రితం ఎండి మోడువారిపోయింది. మరి ఇప్పుడో... చక్కగా చిగురుటాకులతో నవనవలాడుతోంది. కేవలం ఒక చెట్టే ఎండి, మోడువారి, తిరిగి చిగురించి ఎలా పచ్చబడిందో..! అటువంటప్పుడు మనిషి జన్మ ఎత్తి, ఎలా ఆత్మహత్యకు సిద్ధపడ్డావు?’ అన్నాడు.

రాజుకు మూసుకుపోయిన కళ్లు తెరుచుకున్నట్లు అయింది. తాను తరవాత ఏం చేయాలో స్ఫురించింది. ‘స్వామీ! నాకు కనువిప్పు కలిగింది. ఇక నుంచి కష్టపడి, తిరిగి పూర్వపు నా స్థానాన్ని నేను సంపాదించుకుంటాను’ అని మునితో చెప్పాడు. అప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా వ్యూహ రచనలు చేసి, సొంతంగా సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. తిరిగి తన రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. మునుపటిలా కాకుండా ఈసారి చక్కగా పాలించాడు. బద్ధకాన్ని ఏమాత్రం దరి చేరనీయకుండా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ.. మంచిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

- కె.వి.సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని