Published : 17 Nov 2022 00:05 IST

ఈ స్టేడియాన్ని.. తరలించొచ్చు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. క్రీడ ఏదైనా ప్రపంచ కప్‌ పోటీలంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే కదా! పోటీల నిర్వహణకు జరిగే ఏర్పాట్లు, లోగోలు, స్టేడియాలూ.. ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉండేలా నిర్వాహకులు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టేడియం కూడా ఆ కోవకే చెందుతుంది. దాని ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా మరి..

క్రికెట్‌ అంటే ప్రతి ఒక్కరికీ తెలిసినా.. కొన్ని దేశాలు మాత్రమే పోటీల్లో పాల్గొంటాయి. కానీ, ఫుట్‌బాల్‌ మాత్రం అందుకు భిన్నం. చాలావరకు పాశ్చాత్య దేశాల్లో క్రికెట్‌ కంటే ఫుట్‌బాల్‌కే క్రేజ్‌ ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌ క్లబ్‌లూ, ఆటగాళ్ల వేలాలూ. అబ్బో ఆ హడావిడి మామూలుగా ఉండదు. ఇంతకీ విషయం ఏంటంటే.. మరికొద్దిరోజుల్లో ఫిఫా వరల్డ్‌ కప్‌ - 2022 ప్రారంభం కానుంది. ఈ పోటీలకు ఎడారి దేశం ఖతర్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం అక్కడ మొత్తం 8 భారీ స్టేడియాలను సిద్ధం చేశారు. వాటన్నింటిలోకెల్లా ‘స్టేడియం 974’ మాత్రం ప్రత్యేకం.

కంటైనర్లతోనే..

సాధారణంగా స్టేడియాలను విశాలమైన స్థలంలో భారీ హంగులతో నిర్మిస్తుంటారు. ఆ నిర్మాణాలు కొన్నేళ్లపాటు వివిధ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేలా, వాటిల్లో సకల సౌకర్యాలూ కల్పిస్తారు. అయితే, ‘స్టేడియం 974’ని మాత్రం ఎక్కడికైనా తరలించొచ్చు. అంటే.. దాన్ని భాగాలుగా విభజించి.. మళ్లీ మరోచోట నిర్మించొచ్చన్నమాట. అదెలా సాధ్యమంటే.. ఈ స్టేడియాన్ని రీసైకిల్‌ చేసిన కంటైనర్లతో రూపొందించారు మరి. నిజమే నేస్తాలూ.. అందుకు మొత్తం 974 కంటైనర్లను వాడారట. అందుకే, దానికా పేరు పెట్టారు. అంతేకాదు.. ఒక్కో దేశానికి ఒక్కో డయలింగ్‌ కోడ్‌ (భారత్‌కు +91) ఉన్నట్లే.. ఖతర్‌కు కూడా ఒకటుంటుంది కదా.. అది +974 అట. అందుకే, డయలింగ్‌ కోడ్‌తోపాటు ఆ స్టేడియం నిర్మాణంలో వినియోగించిన కంటైనర్ల సంఖ్య తెలిపేలా.. దానికి ఆ పేరు పెట్టారన్నమాట.

సముద్రాన్ని ఆనుకొనే..

ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ పోటీలకు ఆతిథ్యమిచ్చే ఇతర స్టేడియాలకు లేని మరో సౌలభ్యమూ ‘స్టేడియం 974’కు ఉంది. అదేంటంటే.. దీన్ని సముద్రపు ఒడ్డున నిర్మించడం. ఇందులో 40 వేల మంది కూర్చుని పోటీలను చూడొచ్చు. అంతకుముందు ఆ ప్రాంతంలో ఉన్న నిర్మాణాన్ని నేలమట్టం చేసి.. ఆ వ్యర్థాలను రీసైకిల్‌ చేసి, కంటైనర్లుగా మార్చారట. ఆ కంటైనర్లతోనే గతేడాది నవంబర్‌లో దీన్ని నిర్మించారు. ఇంకో విశేషం ఏంటంటే.. దీనికి ఏసీ అవసరం లేకుండానే.. బయటి గాలి లోపలకు, లోపలిది బయటకు సాఫీగా వచ్చివెళ్లేలా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2030లో జరగబోయే ప్రపంచ పోటీలకూ ఈ స్టేడియాన్ని ఉరుగ్వే దేశానికి తరలించనున్నారట. అన్ని స్టేడియాల మాదిరే.. ఇందులోనూ స్టాండ్స్‌, టాయిలెట్లు, డ్రెస్సింగ్‌ రూములు.. ఇలా అన్ని వసతులూ ఉన్నాయి. ఈ నెల 22న ఈ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరగనుంది. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉండటంతో క్రీడాకారులూ, ప్రేక్షకులకు మొదటగా ఈ స్టేడియమే కనిపిస్తుందని.. సాధ్యమైనంత వరకు దీన్ని పర్యావరణహితంగా తయారు చేశామని నిర్వాహకులు గొప్పగా చెబుతున్నారు. ఇవండీ.. ఈ ‘ట్రాన్స్‌పోర్టబుల్‌ స్టేడియం’ విశేషాలు..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని