పిల్ల కోతుల్లో మార్పు!

అడవిలో ఓ పెద్ద మర్రి చెట్టును కోతులు తమ నివాసంగా మార్చుకొని జీవించసాగాయి. భారీ మర్రి చెట్టు కావటంతో పిల్ల కోతులకు ఆటవిడుపుగా ఉండేది. ఉదయం లేచింది మొదలు కొమ్మలు పట్టుకుని వేలాడటం.. కొమ్మల మీద నుంచి దూకటం చేసేవి.

Published : 18 Nov 2022 01:02 IST

డవిలో ఓ పెద్ద మర్రి చెట్టును కోతులు తమ నివాసంగా మార్చుకొని జీవించసాగాయి. భారీ మర్రి చెట్టు కావటంతో పిల్ల కోతులకు ఆటవిడుపుగా ఉండేది. ఉదయం లేచింది మొదలు కొమ్మలు పట్టుకుని వేలాడటం.. కొమ్మల మీద నుంచి దూకటం చేసేవి. పెద్ద కోతులు ఎంత చెప్పినా పిల్లవి పెడచెవిన పెట్టేవి. పిల్ల కోతులు చెట్ల మీద నుంచి జారిపడి గాయపడిన సందర్భాలూ ఉన్నాయి. పెద్ద కోతులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా, చిన్నవి మాట వినేవి కావు. ఒకరోజు పెద్ద కోతులు ఆహారం కోసం వెళ్లాయి. అదే సమయంలో చిన్న కోతులు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి.

ఒక చిన్న కోతి ముందుకొచ్చి.. మా అమ్మ చెట్ల మీద నుంచి దూకకుండా ఆంక్షలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘మా అమ్మ చెప్పే జాగ్రత్తలు వినలేకపోతున్నాం. చెట్ల పైనుంచి దూకకూడదు.. గంతులేయకూడదు... అంటూ కోపం తెప్పిస్తోంది’ అంది మరో కోతి. దీనికి పరిష్కారంగా.. అడవినీ, మర్రి చెట్టును, పెద్ద కోతులను వదిలి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాయవి. ఇంతలో ఓ పిల్లకోతికి ఒక సందేహం వచ్చింది. ‘పెద్దలకు తెలియకుండా అడవి ఎలా దాటాలి?’ అని అడిగింది. దానికి మరో పిల్ల కోతి ముందుకు వచ్చి.. అర్ధరాత్రి అందరూ పడుకున్నాక అడవిని విడిచి పోదామంది. మిగతావన్నీ దాని మాటలకు అంగీకరించాయి. అనంతరం పిల్ల కోతులు ఏమీ తెలియనట్లు ఆటల్లో మునిగిపోయాయి.

ఆహారం కోసం బయటకు వెళ్లిన పెద్ద కోతులు సాయంత్రానికి మర్రి చెట్టు పైకి చేరుకున్నాయి. పిల్ల కోతులు అవి తెచ్చిన ఆహారం తిని, ఏమీ తెలియనట్లు మళ్లీ ఆటల్లో మునిగిపోయాయి. ఇంతలో చీకటి పడింది. రోజూ మాదిరిగానే పిల్ల కోతులన్నీ పెద్దవాటితో కలిసి నిద్రించాయి. అర్ధరాత్రి కాగానే.. అప్పటివరకూ నిద్రపోతున్నట్లు నటించిన పిల్ల కోతులన్నీ లేచి కూర్చున్నాయి. మెల్లగా కొమ్మలు కదలకుండా.. ఆకులు తగలకుండా చెట్టు పైనుంచి దిగి, అన్నీ ఒకచోట చేరాయి. ఒకసారి పైకి చూశాయి. పెద్ద కోతులన్నీ ఆదమరచి నిద్రపోతున్నాయని నిర్ధారించుకున్నాయి.

మొదటిసారి అమ్మతోడు లేకుండా బయటకు వెళ్తుండటంతో పిల్ల కోతులకు భయం వేసింది. అయినా, గుండె రాయి చేసుకుని బయలుదేరాయి. తెల్లవారేసరికి సమీపంలోని ఒక గ్రామం చేరుకున్నాయి. ఆ ఊరు పిల్ల కోతులకు నచ్చింది. అక్కడ పెద్ద పెద్ద పండ్ల చెట్లు వాటికి కనబడ్డాయి. ఆ పక్కనే ఉన్న చెరువును చూసి ముచ్చట పడ్డాయి. ఆ ఒడ్డునే ఉన్న పెద్ద చెట్టును ఆవాసంగా చేసుకున్నాయి. ఇక వెంటనే.. పిల్ల కోతులన్నీ ఊరి మీద పడ్డాయి. ఇళ్ల ఆవరణల్లోని పండ్ల చెట్లు ఎక్కడం, కోసుకొని తినడం.. తర్వాత ఆటలాడటం చేయసాగాయి. ఇప్పుడు అవి ఎంత దూకినా.. అడ్డుకునే పెద్దకోతులు లేవు. దాంతో అవి ఆడింది ఆట .. పాడింది పాటగా మారింది.

కొన్ని అల్లరి కోతులు ఇళ్లలోకి వెళ్లి వస్తువులను చిందరవందర చేసేవి. ఆ ఊరు కోతులకు ఆనందం కలిగించినా.. గ్రామస్థులకు మాత్రం ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. ఊరి పిల్లలకు కూడా కోతుల అల్లరి నచ్చింది. బడి ఎగ్గొట్టి మరీ వాటి వెంట తిరిగేవారు. ఇదంతా గమనించిన ఆ ఊరివాళ్లు.. కోతుల వల్ల కలుగుతున్న ఇబ్బందులను గ్రామపెద్ద దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన పిల్ల కోతులను బంధించేందుకు మరుసటి రోజే బోన్లు ఏర్పాటు చేయించాడు. బోనులో పండ్లు, ఆహార పదార్థాలు ఉంచారు. తినుబండారాలను చూడగానే.. ఆనందంతో లోపలికి వెళ్లాయవి. అవి అలా అడుగు లోపలకు వేయగానే.. బోను తలుపు మూసుకుంది. పదార్థాలు తినేశాక.. బయటకు వెళ్లడం సాధ్యపడలేదు. దాంతో తాము బందీ అయినట్లు గ్రహించాయి.

రెండుమూడు రోజులు బోనులోనే ఉన్న పిల్ల కోతులకు ఆకలి వేయసాగింది. తట్టుకోలేక కిచకిచమని పెద్దగా అరవసాగాయి. కొన్ని ఏడవటం మొదలుపెట్టాయి. అప్పుడు వాటికి పెద్ద కోతులు గుర్తుకొచ్చాయి. చెప్పకుండా వచ్చినందుకు, తగిన శాస్తి జరిగిందని బాధపడ్డాయి. అదే రోజు ఆ బోనులను లారీలోకి ఎక్కించారు. ఏమీ చేయలేక.. పిల్ల కోతులన్నీ కళ్లు మూసుకొని ఏడవసాగాయి. వెళ్తూ వెళ్తూ.. లారీ ఒకచోట ఆగింది. లారీలో వచ్చిన వ్యక్తులు బోనులను కిందకు దించి.. తలుపులు తీసి దూరంగా వెళ్లారు. కళ్లు తెరిచిన పిల్ల కోతులు భయంభయంగా బయటకు వచ్చాయి. అది వాటికి తెలిసిన ప్రదేశంలా అనిపించింది. చుట్టుపక్కల మొత్తం పరిశీలించి.. అది తమ అడవే అని గుర్తుపట్టాయి. ఇంకేం.. పట్టలేని ఆనందంతో మర్రి చెట్టు వద్దకు పరుగులు తీశాయి. అక్కడ తమ కోసం దిగాలుగా ఎదురుచూస్తున్న పెద్ద కోతులు కనబడ్డాయి. ఒక్కో పిల్లకోతి వాళ్ల అమ్మ ఒడిలోకి చేరి.. కంటతడి పెట్టాయి. ఇంకెప్పుడూ.. చెప్పకుండా ఎక్కడకూ వెళ్లమని క్షమాపణలు కోరాయి. పిల్లలను దగ్గరకు తీసుకుని ఆనందంగా హత్తుకున్నాయి పెద్ద కోతులు. 

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని