Updated : 19 Nov 2022 03:06 IST

పండితులకు పరీక్ష!

పూర్వం విజయనగరాన్ని రఘువీర వర్మ పరిపాలించేవాడు. ఆయనకు జ్ఞాన సముపార్జన అంటే చాలా ఇష్టం. ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో విజ్ఞానం సంపాదించాడు. ప్రజల్లోనూ జ్ఞానం పెంపొందించి, వారిని చైతన్యవంతులుగా చేయాలనుకున్నాడు. అందుకు గ్రంథపఠనానికి మించిన మార్గం ఇంకోటి లేదని గ్రహించాడు. వయోజనుల్లో అక్షరాస్యత పెంచేందుకు రాత్రి పాఠశాలలు స్థాపించాడు. మెరుగైన ఫలితాలు రావడంతో అక్షర జ్ఞానం లేనివారికి ఉపయోగపడేలా వివిధ కావ్యాలను రాయించాలనే ఆలోచన కలిగింది. దానికోసం రాజ్యంలో ఆస్థాన పండితుడి కోసం దండోరా వేయించాడు.

రాజ్యం నలుమూలల నుంచి పండితులు ఆస్థానానికి చేరుకున్నారు. వారందరి రాకను మంత్రి, రఘువర్మ చెవిన వేశాడు. పండితులకు సత్రాల్లో బసను ఏర్పాటు చేసి.. చిరునామాలు సేకరించమని సూచించాడు. ‘ప్రభూ! ఆ సమయంలోనే వారికి రేపు నిర్వహించబోయే ప్రతిభా పరీక్షకు సిద్ధపడమని చెప్పమంటారా?’ అని అనుమతి కోరాడు మంత్రి. ‘ఆ పనికి ఆస్థాన ఉద్యోగుల సేవలు వినియోగించుకోండి. వారి చిరునామాలు మాత్రం మీరే స్వయంగా నమోదు చేయండి’ అని చెప్పాడు రఘువర్మ. దాంతో.. చిరునామా సేకరణతోనే వారి ప్రతిభా పరీక్షకు శ్రీకారం చుట్టారు.

మర్నాడు ఆస్థాన ఉద్యోగుల సహకారంతో సేకరించిన చిరునామాలు చదువుతూ.. ‘ప్రభూ! మన రాజ్యంలో లేని రెండు ఊర్ల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. అవి కాస్త వింతగా ఉన్నాయి’ అన్నాడు మంత్రి. ‘ఏమిటా పేర్లు?’ అని ఆసక్తిగా అడిగాడు రఘువర్మ. ‘ఒక కవి ఊరి పేరు శివసతీపురం, మరొకరిది మూషిక వాహన దేవర మాతాపురం’ అన్నాడు మంత్రి.

‘ఆ రెండూ వేర్వేరు ఊర్లు కాదు. ఒకే ఊరు’ నవ్వుతూ అన్నాడు రఘువర్మ. ‘ఆ ఇద్దరు కవులు ఒకే ఊరికి చెందినవారా?’ ఆశ్చర్యపోతూ అడిగాడు మంత్రి. ‘అవును.. ఆ ఇద్దరిదీ ఒకే ఊరు. వారికి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయండి. మిగిలిన వారికి రేపు సన్మాన ఏర్పాట్లు చేయండి’ అని ఆజ్ఞాపించాడు రఘువర్మ. మర్నాడు ఆ ఇద్దరిని తప్పించి, మిగిలిన వారికి రఘువర్మ తన చేతుల మీదుగా సత్కరించి పంపించాడు. ‘ప్రభూ! ఊరు పేరు లేని ఆ ఇద్దరు కవులకు పెద్ద పీట వేసి.. ఎంతో ప్రతిభ ఉన్న మిగతా కవులను ఇంటికి పంపించారు. ఇందులో మీ ఆంతర్యం అర్థం కావడం లేదు’ అని సందేహంగా అడిగాడు మంత్రి.
‘కవికి చమత్కారం అవసరం. ఆ ఇద్దరిలోనూ అది పుష్కలంగా ఉంది. అందుకే వారికి పట్టం కట్టాలని నిర్ణయించాం. వారిది పార్వతీపురం. పేరుకు అది పార్వతీపురం అయినా ఆ ఊరు సరస్వతీపురం అనే చెప్పొచ్చు. అక్కడ ఎందరో కవులు సాహిత్య సేవ చేస్తున్నారు’ అని గర్వంగా చెప్పాడు రఘువర్మ. ‘చమత్కారమంటే ఇప్పుడర్థమైంది. శివసతి అంటే పార్వతీదేవి. కాబట్టి.. అది పార్వతీపురం అయ్యింది. మరి రెండో కవి భావన?’ అర్థం కాక అడిగాడు మంత్రి. ‘మూషికం అంటే ఎలుక. ఎలుక వాహనం కలిగిన దేవర అంటే వినాయకుడు. వినాయకుడి మాత పార్వతి. అలా అది కూడా పార్వతీపురం అయ్యింది’ వివరంగా చెప్పాడు రఘువర్మ.

‘ప్రభూ! ఈ పద సంపద పామరులకు అర్థమౌతుందా?’ అనుమానంతో అడిగాడు మంత్రి. ‘పరీక్షిస్తున్నవాడు పామరుడు కాదని వాళ్లకు తెలుసు. సాహిత్యమంటే ఇష్టపడే నన్ను ఆలోచింపజేసే విధంగా నడుచుకొని తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వారి పాండిత్యాన్ని సద్వినియోగం చేసుకొనే అవకాశాన్ని మనం కల్పించాలి’ అని వివరించాడు రఘువర్మ.

‘ఊరి పేరులో చమత్కారం ప్రదర్శించిన తీరు బాగుంది. తెలుసుకోవాలన్న కుతూహలం కలిగించింది. చమత్కారం గ్రంథ పఠనానికి ప్రథమ సోపానమని అర్థమైంది’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు మంత్రి. ‘అందుకే.. వారిని ఆస్థాన పండితులుగా నియమించాలని అనుకుంటున్నాను. తక్షణం వారిని పిలిపించండి’ అని మంత్రిని ఆదేశించాడు రాజు. పార్వతీపురం పండితుల వద్దకు వెళ్లి, రాజు నిర్ణయాన్ని చెప్పి ఆస్థానానికి తీసుకొచ్చాడు మంత్రి. వారికి నియామకం విషయం చెప్పి.. కర్తవ్య బోధ చేశాడు రఘువర్మ.

- బి.వి.పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు