Updated : 14 Dec 2022 11:11 IST

నక్క నిబద్ధత!

నకు ప్రాణహాని లేకుండా.. మృగరాజుతో స్నేహం చేయాలనుకుందో కుందేలు. ఇంతలో దానికో జింక కనిపించింది. ‘నాకు మృగరాజుతో స్నేహం చేయాలని ఉంది. అందుకు నాకేదైనా ఉపాయం చెప్పవా?’ అని అడిగింది. దానికి జింక.. ‘నాకు మృగరాజును చూస్తేనే భయం. నేను నీకేం ఉపాయం చెప్పగలను. నాకూ మృగరాజుతో స్నేహం చేయాలని ఉంది’ అని కుందేలుతో అందది. వీరి సంభాషణను చెట్టు పైనున్న కోతి విని.. ‘మృగరాజు దగ్గరకు మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను. ఆయన చాలా మంచివారు. మీతో చక్కగా కబుర్లు చెబుతారు’ అని కుందేలు, జింకను సింహం గుహ వద్దకు తీసుకెళ్లింది.

అక్కడ నక్క కాపలాగా ఉంది. ‘ఈ కుందేలు, జింక మృగరాజుతో స్నేహం చేయాలనుకుంటున్నాయి. ఒకసారి లోపలికి వెళ్తాం’ అని దాన్ని అడిగింది కోతి. ‘మీకు వేళాపాళా లేదా? మృగరాజు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. రేపు ఉదయం రండి’ అంటూ పంపించేసింది నక్క. అది చెప్పినట్లే.. మరుసటి రోజు ఉదయం జింక, కుందేలు, కోతి కలిసి గుహ దగ్గరికి వచ్చాయి. ‘మృగరాజు దర్శన భాగ్యం మాకు కల్పించు’ అని నక్కను అడిగాయి. ‘ఇప్పుడు మృగరాజు ధ్యానంలో ఉన్నారు. రేపు సాయంత్రం రండి’ అని మళ్లీ పంపించేసింది నక్క. ఇలా వారం రోజులపాటు ఆ మూడు జంతువులు రావడం, నక్క వాటిని తిప్పి పంపడం చేయసాగింది.

ఒకరోజు కోతి, జింక, కుందేలు కలిసి.. కొన్ని దుంపలు, పండ్లు, తేనె సేకరించాయి. వాటిని తీసుకొని.. మృగరాజుని కలిసేందుకు వెళ్లాయి. అక్కడ కాపలాగా ఉన్న నక్కతో ‘ఈ దుంపలు, పండ్లు, తేనె తీసుకుని.. మృగరాజును కలిసేందుకు మమ్మల్ని లోపలికి పంపు’ అని అడిగాయి. నక్క చిరునవ్వుతో ‘మృగరాజు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. ఈ పండ్లు పట్టుకొని వెళ్లండి’ అంటూ మిగతావి తన దగ్గరే ఉంచుకుంది. అప్పుడు లోపలికి వెళ్తూ వెళ్తూ జింక.. ‘చూశారా! ఇన్ని రోజులు ఖాళీ చేతులతో వచ్చామని నక్క మనల్ని లోపలికి పంపలేదు. ఈరోజు ఆహార పదార్థాలు తీసుకురావడంతో వెంటనే ఒప్పుకొంది. ఈ సంగతిని మనం మృగరాజుకి చెప్పాలి’ అని అంది. అందుకు కోతి, కుందేలు సరేనన్నట్లు తలాడించాయి.

లోపల ఆసనంపైన కూర్చొని ఉన్న మృగరాజుకు అవి మూడూ నమస్కరించి, తాము తెచ్చిన పండ్లు అందించాయి. ‘నాతో పనేంటి?’ అని వాటిని ప్రశ్నించింది సింహం. అప్పుడు కుందేలు.. ‘మృగరాజా! మేము మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాం. అందుకే, మిమ్మల్ని కలవాలని వారం రోజులుగా తిరుగుతున్నాం. కానీ, కాపలాగా ఉన్న నక్క మమ్మల్ని లోపలికి పంపలేదు. ఈరోజు మేము దుంపలు, తేనె, పండ్లు తీసుకురావడంతో.. పండ్లు మాత్రమే మీకు ఇమ్మని, మిగతావి నక్క తీసుకొని మాకు మీ దర్శనభాగ్యం కల్పించింది’ అని విషయం మొత్తం చెప్పింది. ‘ఈ నక్క వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది’ అని రెట్టించింది జింక. ఆ మాటలకు మృగరాజు.. నక్కను పిలిచి చీవాట్లు పెడతారని అనుకున్నాయవి.

కానీ, మృగరాజు ప్రశాంత వదనంతో ‘మీకు కలిగిన అసౌకర్యానికి నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే వారం రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు. ఆ సమయంలో ఎవరినీ నా వద్దకు పంపించవద్దని నక్కను ఆదేశించాను. అది రాజాజ్ఞ పాటించింది. నాకు అనారోగ్యమని చెబితే అడవిలోని జంతువులు నన్ను పరామర్శించేందుకు వస్తాయి. దాంతో అందరికీ ఇబ్బంది. అందుకే ఈ వారం రోజులు నక్క ఎవరినీ నా దగ్గరకు పంపలేదు’ అని వివరించింది సింహం. ఆ మాటలకు కోతి, కుందేలు, జింక బాధపడ్డాయి. నక్కను అనవసరంగా అనుమానించామని.. మృగరాజును క్షమాపణ కోరాయి. సింహం నవ్వుతూ ‘ఫర్వాలేదు.. సేవకుడి నిబద్ధత రాజుకు మేలు చేసేలా ఉండాలి. నక్క చేసింది అదే..’ అంది.

తరవాత వాటితో మాట్లాడి, అడవిలోని విశేషాలు తెలుసుకుంది సింహం. మాటలు ముగిశాక.. గుహ నుంచి బయలుదేరాయా జంతువులు. బయట ఉన్న నక్కతో ‘ఇన్ని రోజులు మమ్మల్ని లోపలికి పంపలేదని.. నిన్ను అపార్థం చేసుకున్నాం. మృగరాజు చెబితేనే మాకు అసలు విషయం తెలిసింది. మమ్మల్ని క్షమించు’ అని కోరాయవి. అప్పుడు నక్క.. ‘మృగరాజు ఆజ్ఞ పాటించడం నా ధర్మం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు’ అంటూ.. అవి తీసుకొచ్చిన దుంపలు, తేనెను తిరిగి వాటికే అందించింది. నక్క మంచి మనసుకు కృతజ్ఞత తెలిపి.. ఇంటి దారి పట్టాయవి.

- మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని