చిట్టి చిలకమ్మా.. చిన్ని కాకమ్మా..!

అప్పుడే మెలకువ వచ్చిన చిట్టి అనే చిలుక చుట్టూ చూసింది. తానొక కాకి గూటిలో ఉన్నానని గ్రహించి.. కంగారుగా బయటకు వచ్చింది. తానున్న జామ చెట్టు పైనుంచి ఎగిరి వెళ్లేందుకు ప్రయత్నించింది.

Updated : 21 Nov 2022 00:32 IST

ప్పుడే మెలకువ వచ్చిన చిట్టి అనే చిలుక చుట్టూ చూసింది. తానొక కాకి గూటిలో ఉన్నానని గ్రహించి.. కంగారుగా బయటకు వచ్చింది. తానున్న జామ చెట్టు పైనుంచి ఎగిరి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ, చిట్టి రెక్కలు అందుకు సహకరించలేదు. గాయం చేసిన బాధ తగ్గింది కానీ, పూర్తిగా నయం కాలేదు. ఆకలి వేయడంతో చెట్టు కొమ్మలను పరిశీలించసాగింది. ఒక్క జామ పండు కూడా కనిపించలేదు. ‘ఇప్పుడు నా కడుపు నిండేదెలా?’ అని దీనంగా బాధపడింది. అదే చెట్టుపైన మరో కొమ్మ మీదున్న కాకి.. చిట్టిని గమనించింది. గబగబా వచ్చి దానిపక్కకు చేరి.. ‘నా పేరు చిన్ని. నా ప్రయత్నం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అంది. ‘ఆకలి వేస్తోందా? నీకోసమే దాచి ఉంచాను. ఇదిగో ఈ జామ పండు తిను’ అంటూ ఒక పండును చిట్టికి ఇవ్వబోయింది చిన్ని. కాకిని చూడగానే చిట్టికి ఎక్కడా లేని కోపం వచ్చేసింది. చిన్నికి దూరంగా జరిగి.. ‘అప్పుడు కొట్టావు.. ఇప్పుడేమో ఏమీ ఎరగనట్టు పండు ఇస్తున్నావా? ఆహా.. ఎంత బాగా నటిస్తున్నావో?’ అంది. ఆ మాటలకు చిన్ని ఆశ్చర్యపోతూ.. ‘నేను నిన్ను కొట్టడం ఏంటి?’ అని అడిగింది. ‘నా పచ్చని రెక్కలు, ఎర్రని ముక్కు చూసి నువ్వు అసూయ పడ్డావు. అందుకే.. నిద్రపోతున్న సమయం చూసి నీ పదునైన ముక్కుతో నన్ను గాయపరిచావు. పొడిచిన నువ్వే.. నా పొట్ట నింపడానికి పండు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది’ అంటూ చిన్నివైపు కోపంగా చూసింది చిట్టి.

‘నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి. నిన్ను గాయపరిచింది నేను కాదు. కష్టపడి ఆహారం సంపాదించి మాత్రమే నా కడుపు నింపుకొంటాను. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాను. చిన్ని అంటే సాయం, సాయం అంటే చిన్ని’ అని గట్టిగానే బదులిచ్చింది కాకి. అప్పుడు చిట్టి.. ‘రెక్కల బలం లేక ఇక్కడి నుంచి వెళ్లలేకపోతున్నాను. కానీ, నీ మాటలు నేను నమ్మను.. మళ్లీ మళ్లీ మోసపోయేంత అమాయకురాలిని కాదు. నీ మాటలు, చేతలూ ఒక్కటి కావు. నాకు కాస్త ఓపిక రాగానే.. నీ నుంచి దూరంగా ఎగిరి వెళ్లిపోతాను. నీ జామపండు తినను. నీతో స్నేహం అసలే చేయను. దయచేసి అంత వరకూ నన్ను ఒంటరిగా వదిలేయ్‌.!’ అని దూరంగా జరుగుతూ.. కోపంతో చెప్పింది చిట్టి. ‘గాయం బాధలో ఆవేశంగా మాట్లాడుతున్నావు. నిజం నిలకడ మీద నీకే తెలుస్తుంది’ అంటూ చిన్ని తన కొమ్మ మీదకు తిరిగి వెళ్లిపోయింది.

అప్పుడే బుజ్జి అనే పావురం అక్కడకు వచ్చింది. చిట్టిని చూసి సంతోషంగా.. ‘నువ్వు తిరిగి కోలుకున్నావు.. నాకు అదే సంతోషం’ అంటూ తాను తెచ్చిన జామ పండును చిట్టికి ఇచ్చింది. బుజ్జిని చూడగానే చిట్టికి ఓపిక తిరిగి వచ్చినట్లయింది. ‘బుజ్జీ.. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లు.. ఇక్కడే ఉంటే ఈ కాకి నన్ను మళ్లీ పొడుస్తుంది’ అంటూ వాపోయింది. ‘బుజ్జీ.. తనను నేను పొడవలేదంటే నమ్మడం లేదు. నీకు తెలుసు కదా.. ఈ చిన్నికి సాయం చేయడం తప్ప మరోటి తెలియదని నువ్వైనా చెప్పు’ అంటూ బుజ్జి పక్కన చేరింది కాకి. ‘చిట్టీ.. నిన్ను గాయపరిచింది కాకే.. కాదనను.. కానీ చిన్ని కాదు. మరోసారి నువ్వు ఆ కాకి చేతిలో గాయపడకూడదని, అతి కష్టం మీద అక్కడి నుంచి నిన్ను తీసుకొచ్చి చిన్ని దగ్గర ఉంచాను. అప్పుడు నువ్వు గాయం బాధతో సొమ్మసిల్లి పడిపోయావు. అందుకే నీకు అవేమీ గుర్తు ఉండవు. ఆహారం కోసం బయటకు వెళ్లాను. చిన్నిని చూడగానే.. నిన్ను పొడిచింది అదేనని పొరబడుతున్నావు. సరిగ్గా చూడు.. నీకే తెలుస్తుంది’ అని వివరంగా చెప్పింది బుజ్జి.

బుజ్జి మాటలతో చిన్నిని పరిశీలనగా చూసింది చిట్టి. ‘చిట్టీ.. కాకులన్నీ పైకి ఒకేలా కనిపించినా వాటి గుణాల్లో తేడా ఉంటుంది. అంతెందుకు.. ఏ రెండు చెట్లూ ఒకేలా కాయవు. ఈ జామ చెట్టుకు ఒక్క పండూ లేదు. పక్కనే ఉన్న మరోటి మాత్రం విరగ కాచింది. చిన్ని చేసిన సాయాన్ని గుర్తించు’ అంది బుజ్జి. బుజ్జి మాటలతో చిట్టి ఆలోచించసాగింది. తనను బాధ పెట్టింది చిన్ని కాదని గ్రహించింది. ‘నాకు గతం పూర్తిగా గుర్తుకొచ్చింది. నీ గుణం తెలిసింది. సాయం చేశావు. గాయం బాధ తగ్గించావు. నాతో స్నేహం చేయవూ?’ అంటూ చిన్నివైపు చూస్తూ అడిగింది చిట్టి. ‘నన్ను అర్థం చేసుకున్నావు. అదే చాలు.. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. చిన్ని అంటే సాయమే కాదు.. స్నేహం కూడా..’ అని నవ్వుతూ అంది చిన్ని. ‘భలేగా చెప్పావు చిన్నీ..’ అంటూ మురిసిపోతూ అన్నాయి చిట్టి, బుజ్జి. 

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని