Published : 22 Nov 2022 00:17 IST

కరవు తీర్చిన కొరడా దెబ్బలు!

ప్రభాతపురి రాజ్యాన్ని నాగసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన ఎంతో దయాగుణం కలవాడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. తన రాజ్యంలో పేదరికం అనేది ఉండకూడదనే సంకల్పంతో విపరీతంగా దానధర్మాలు చేసేవాడు. లెక్కలేనన్ని ధర్మసత్రాలు కట్టించి రాజ్యంలోని ఏ ఒక్క పౌరుడు కూడా తిండికి, నీడకు ఇబ్బంది పడకుండా చూసుకున్నాడు.

ఇదిలా ఉండగా కొన్నేళ్ల తర్వాత ప్రభాతపురిలో కరవు పరిస్థితి ఏర్పడింది. పంటలు సరిగా పండక ఆహారోత్పత్తుల నిల్వలు క్షీణించటంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా పూర్తిగా మందగించాయి. ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి దిగుమతులు పెరిగి, ఎగుమతులు తగ్గి వాణిజ్యం దెబ్బతింది. ప్రజలు రోజుకు కనీసం ఒక్క పూట తినటానికి కూడా తిండి దొరకటం కష్టమైపోయింది. ప్రజల కడుపు నింపటానికి నాగసేనుడు అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి రాజప్రాసాదంలోని ధాన్యాగార గిడ్డంగిలోని ధాన్యం కూడా అడుగంటింది. ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది.

నాగసేనుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమేమిటో, ఈ దుర్భర స్థితి నుంచి రాజ్యాన్ని గట్టెక్కించే మార్గం ఏంటో మంత్రికూడా చెప్పలేకపోయాడు. ఇలాంటి పరిస్థితిలో, దూరదేశం నుంచి మిళిందవర్మ అనే ఆర్థికవేత్త పలు రాజ్యాలు పర్యటిస్తూ ప్రభాతపురికి చేరుకున్నాడు. నాగసేనుడు ఆయనకు అంతఃపురంలో ఆతిథ్యం ఇచ్చి రాజ్య సందర్శనకు తగిన ఏర్పాట్లు చేశాడు.

నాగసేనుడు ఒకరోజు మిళిందవర్మకు తన రాజ్యంలోని దుర్భిక్ష పరిస్థితిని వివరించి ‘నేను నా రాజ్య ప్రజలకు కష్టం అంటే ఏమిటో తెలియకుండా పరిపాలించాను. కానీ ఇప్పుడు వాళ్లు ఆకలితో అలమటించటం చూస్తూ కూడా ఏమీ చెయ్యలేక, ఏం చెయ్యాలో అర్థం కాక కుమిలిపోతున్నాను. ఇందుకు తగిన పరిష్కార మార్గం తమరికి తెలిస్తే దయతో సెలవియ్యండి’ అని అడిగాడు.

అప్పటికే ప్రభాతపురిలోని పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకున్న మిళిందవర్మ.. ‘రాజా! మీ రాజ్యంలోని క్షామానికి కారణం మీ మితిమీరిన దయాగుణం, దానధర్మాలే’ అన్నాడు. నాగసేనుడు ఆశ్చర్యపోతూ.. ‘అదెలా?’ అని అడిగాడు.

‘చెప్తా, మీరు నాతో రండి’ అంటూ నాగసేనుడిని తనతో పాటు మారువేషంలో ప్రభాతపురి రాజ్య సంచారానికి తీసుకెళ్లాడు మిళిందవర్మ. రాజ్యంలోని ఏ ధర్మసత్రంలో చూసినా జనం పనీపాటా లేకుండా గుంపులు గుంపులుగా కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకొంటూ ఉచిత భోజన వేళ కోసం ఎదురుచూడటం వాళ్లకు కనిపించింది.

ఒకచోట కొంతమంది మాటలు వీళ్ల చెవిన పడ్డాయి. ‘ఒరేయ్‌! ఇంతకుముందులా సత్రంలో ముప్పూటలా భోజనం పెట్టడం లేదురా..’ అని ఒకరంటే, మరొకరు... ‘ఇన్ని రోజులూ మనం పొలానికి వెళ్లి ఒళ్లు వంచి పని చేయకపోయినా మూడు పూటలా కమ్మని భోజనం దొరికేది ఇక్కడ. ఇక ముందు ఎలా పొద్దుపోతుందో ఏమో’ అని అంటే, ‘అంత బాధపడటం దేనికిరా? రాజు గారి దగ్గరికి వెళ్లి నాలుగు మొసలి కన్నీళ్లు కారిస్తే చాలు, ఇంట్లోకి కావాల్సిన సరకులు, కట్టుబట్టలతో సహా అన్నీ అయనే సమకూరుస్తారు’ అని ఇంకొకరు అన్నారు. అంతా విన్న నాగసేనుడికి ఎంతో బాధ కలిగింది. వాళ్లిద్దరూ తిరిగి అంతఃపురంలోకి వెళ్లాక.. మిళిందవర్మ నాగసేనుడితో ‘ఇప్పటికైనా అర్థమైందా రాజా! అపరిమితమైన మీ దానధర్మాల వల్ల ప్రజలు సోమరులుగా మారి కష్టపడి పని చెయ్యకుండా ఉచితంగా తమ కడుపులు నింపుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు ఏంచేస్తే మీ రాజ్యంలోని క్షామం పోయి, తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడతాయో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా!’ అని చెప్పి అక్కడ నుంచి మరో రాజ్య పర్యటన కోసం వెళ్లిపోయాడు. నాగసేనుడు తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు.
వెంటనే ‘తన రాజ్యంలోని ప్రజలందరూ ఎవరి వృత్తి పనులను ప్రతిరోజూ విధిగా చేసుకోవాలని, ఏ పనీ చెయ్యకుండా ఖాళీగా ఉంటూ పొద్దంతా కాలక్షేపం చేసేవాళ్లకు శిక్షగా వంద కొరడా దెబ్బలు పడతాయ’ని దండోరా వేయించాడు. ప్రభాతపురిలో అవసరానికి మించి ఉన్న ధర్మసత్రాలను మూసివేయించాడు. నిజంగా కష్టాల్లో ఉన్నవారికి, నిస్సహాయులకు మాత్రమే దానధర్మాలు చేస్తూ, అర్హత లేనివాళ్లు తన దగ్గరికి ధర్మం కోసం వస్తే, వాళ్లకు కొరడా దెబ్బలు ఇచ్చి పంపించేవాడు. కొన్ని రోజులు గడిచేసరికి ప్రభాతపురిలో పరిస్థితులు పూర్తిగా చక్కబడ్డాయి. పాడిపంటలు, వ్యాపారాలు అభివృద్ధి చెంది రాజ్యం ఆర్థిక స్థితి మెరుగుపడింది. ఈ మార్పునకు కారణమైన మిళిందవర్మకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు నాగసేనుడు.

- సోమిశెట్టి వేణుగోపాల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు