కోతికి గాయం.. నక్కకు పాఠం!

ఒక కోతి ఆహారం కోసం సమీపంలోని గ్రామానికి వెళ్లి అడవికి తిరిగి వస్తుండగా.. ముల్లు గుచ్చుకొని గాయపడింది. అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేకపోవడంతో ‘కాపాడండి.. కాపాడండి’ అని బాధతో అరిచింది.

Published : 23 Nov 2022 00:03 IST

ఒక కోతి ఆహారం కోసం సమీపంలోని గ్రామానికి వెళ్లి అడవికి తిరిగి వస్తుండగా.. ముల్లు గుచ్చుకొని గాయపడింది. అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేకపోవడంతో ‘కాపాడండి.. కాపాడండి’ అని బాధతో అరిచింది. అప్పుడే దాని ముందు నుంచి నక్క, తోడేలు వెళ్తున్నా.. కోతి అరుపులను పట్టించుకోకుండా, వాటి దారిన అవి ముందుకుసాగాయి. ఇంతలో వెనుక నుంచి వచ్చిన ఏనుగు, జింక.. ఆ కోతిని గమనించి దగ్గరకు వెళ్లాయి. చికిత్స కోసం దాన్ని ఎత్తుకొని.. ఎలుగుబంటి వద్దకు బయలుదేరాయి. దారిలో వాటికి ఒక జిరాఫీ ఎదురై ‘ఏం జరిగింది?’ అని ప్రశ్నించింది. అవి ఆ కోతి గాయపడిన సంగతిని చెప్పాయి. అది కూడా వాటితో జత కలిసింది. కోతి కాలులోని ముల్లును బయటకు తీసి.. కట్టు కట్టాక.. దాన్ని విశ్రాంతి తీసుకోమని చెప్పింది ఎలుగుబంటి.

ఇదంతా తెలుసుకున్న చిరుతపులి.. విషయాన్ని మృగరాజుకు చెప్పింది. సింహం వెంటనే నక్కను, తోడేలును పిలిపించి.. ‘గాయపడిన కోతిని ఎందుకు కాపాడలేదు?’ అని ప్రశ్నించింది. అప్పుడు నక్క, తోడేలు.. ‘మృగరాజా.. మాకు దాన్ని ఎత్తుకొని తీసుకెళ్లే సామర్థ్యం లేదు. మేము చాలా చిన్న  జంతువులం. అయినా, ఆ దారిలో ముళ్లు ఉంటాయని తెలిసి కూడా అజాగ్రత్తగా ఉండటం దాని తప్పే కదా!’ అని అడిగాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి.. ‘చూడండి.. ఆ కోతి కూడా ఏనుగంత పెద్దదేమీ కాదు. చిన్న జీవే కదా. ఇతరులకు సాయం చేయాలని మనసులో ఉండాలి కానీ ఎలాగైనా కాపాడవచ్చు. మీకు శక్తి లేకపోతే ఇతరుల సాయం తీసుకోవచ్చు కదా! మరికొంత ఆలస్యమైతే రక్తం పోయి.. దాని ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. సమయానికి ఆ ఏనుగు, జింక దాన్ని నా వద్దకు తెచ్చాయి కాబట్టి సరిపోయింది’ అని అంది.

అప్పుడు సింహం.. నక్క, తోడేలుతో ‘మీరు చేసింది చాలా తప్పు. అడవిలో మనమంతా కలిసి మెలిసి ఉండాలి. అది చాలా బాధతో అరుస్తూ ఉంటే, మీరు దాన్ని పట్టించుకోకపోవడం ఏంటి? మీకు శిక్ష పడాల్సిందే..’ అని అంది. ఇంతలో అక్కడికి కుందేలు వచ్చింది. అది ప్రతి రోజు ఉదయాన్నే మృగరాజు వద్దకు వచ్చి అడవిలోని విశేషాలన్నీ చెప్పేది. కానీ ఆరోజు ఆలస్యంగా రావడం చూసిన ఎలుగుబంటి.. ఎందుకు ఇంత ఆలస్యమైందని ప్రశ్నించింది. అప్పుడు కుందేలు.. ‘మృగరాజా.. ఈ నక్క బిడ్డ ఒక లోతైన గుంతలో పడి గాయపడింది. దాన్ని వెంటనే ఆ గుంతలోంచి పైకి తీసి దగ్గరలోని మరొక ఎలుగుబంటి వద్దకు తీసుకుని వెళ్లి వైద్యం చేయించాను. ఇప్పుడు అది కోలుకుంది. దాన్ని ఇంటికి చేర్చి వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది. నన్ను మన్నించండి’ అని వివరించింది. దాని మాటలకు సింహం నవ్వి.. ‘కుందేలా! నువ్వు చాలా మంచి పని చేశావు. ఒక ప్రాణాన్ని కాపాడావు. ఇప్పుడేమంటావు నక్కా..?’ అని ప్రశ్నించింది. అప్పుడు నక్క ‘అయ్యో! నా బిడ్డ గాయపడిందా.. వెంటనే వెళ్లి దాన్ని చూడాలి. నాకు చాలా ఆందోళనగా ఉంది మృగరాజా!’ అని వాపోయింది.

అది విన్న కుందేలు ‘నక్క బావా! ఇప్పుడు నీ బిడ్డకు వచ్చిన ఆపద ఏమీ లేదు. అది నీ ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది’ అని చెప్పింది. అప్పుడు కుందేలుకు, తన బిడ్డను కాపాడిన ఎలుగుబంటికి కృతజ్ఞతలు తెలిపింది నక్క. ఆ తర్వాత తోడేలు కూడా తనను మన్నించమని సింహాన్ని వేడుకుంటూ.. ‘రాజా.. నేను కోతికి సాయం చేద్దామంటే, ఈ నక్కే వద్దని చెప్పింది’ అని అంది.  అప్పుడు సింహం కోపంతో.. ‘ఆ నక్క వద్దంటే నీ బుద్ధి ఎటు పోయింది? ఈ రెండింటిని మన అడవి నుంచి బహిష్కరిస్తున్నా. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అని ఆదేశించింది. అప్పుడే అక్కడకు జిరాఫీపై ఎక్కి వచ్చిన కోతి ‘మృగరాజా! దయచేసి వాటి శిక్షను రద్దు చేయండి. మరొకసారి అవి తప్పు చేయవు. ఏదో తెలియక అవి అలా ప్రవర్తించాయి’ అని కోరింది. అప్పుడు మృగరాజు ‘చూశారా ఆ కోతి దయాగుణం.. మీరు తనకు సాయం చేయకపోయినా, అది మీకు శిక్ష వద్దని నన్ను కోరుతుంది. ఇప్పటికైనా బుద్ధిగా ఉండండి. తోటి జంతువుల పట్ల ప్రేమతో వ్యవహరించండి. మనం ఒకరికి సాయపడితేనే.. మనకు కూడా మరొకరు సహాయం చేస్తారు’ అని హితబోధ చేసింది. సింహం మాటలకు అక్కడున్న జంతువులన్నీ తలూపాయి.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని