Published : 24 Nov 2022 00:24 IST

అమ్మ చెప్పిన మాట వినాలి!

దొక గేటెడ్‌ కమ్యూనిటీ. వాకింగ్‌ ట్రాక్‌ మీద మధ్యలో ఓ గొంగళి పురుగు వయ్యారంగా తిరుగుతోంది. దానికి వాళ్ల అమ్మ పెట్టుకున్న పేరు... ‘జాలీ’. అలా రోడ్డు మధ్యలో వెళుతున్న జాలీని చూసిన చీమ, దాని తల్లి దగ్గర చేరి.. ‘వదినా! పిల్లను అలా మధ్యలో నడవనిస్తున్నావేంటి? మనుషులు నడుస్తుంటుంటారు. పిల్లలు సైకిళ్లు తొక్కుతారు. ఇంకా కార్లు కూడా వెళ్తుంటాయి. అపార్ట్‌మెంట్లో వాళ్లు వాకింగ్‌ చేస్తున్నప్పుడు మనల్ని పట్టించుకోరు. అలా మధ్యలో నడవకూడదని చెప్పలేదా?’ అని అడిగింది.

‘అమ్మను కదా నా మాట వినదు. ఎన్నోసార్లు పక్క నుంచి వెళ్లమని చెప్పాను. విననే వినదు’ అంది దిగులుగా. ‘అవునా! నేను చెప్పి చూస్తాలే’ అంది చీమ, దాన్ని జాలిగా చూస్తూ. మరి తల్లికి పిల్లల గురించి బెంగ ఉంటుంది కదా! పిల్లలు ఏమైపోతారో అని! కానీ మన జాలీ, చీమను ఏ మాత్రం లెక్క చేయలేదు. దాని మాటలు అస్సలు పట్టించుకోలేదు.

‘ఇంతలేదు.. ఇది నాకు చెప్పొచ్చింది’ అని ఎగతాళి చేసింది. దానికి చీమ ఏమీ బాధపడలేదు. దాని తెలివి తక్కువతనానికి జాలి పడింది. తన బాధను అంతా అటుగా వెళుతున్న పిల్లికి చెప్పింది. ఇతరులకు సహాయం చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్న చీమను చూసి ముచ్చట పడిందా పిల్లి. అందరూ ఇలా ఆలోచించాలి అనుకుంది.

‘ఆ పని నేను చేసి పెడతాలే!’ అని చీమకు మాట ఇచ్చింది. ‘సరే! నేను పనికి వెళ్తున్నాను పిల్లి బావా’ అని చెప్పి చీమ వెళ్లిపోయింది. అప్పుడు పిల్లి, జాలీ చెంత చేరి దాన్ని పక్కకు పిలిచింది. అంత పెద్ద జంతువు తననేమన్నా చేస్తుందేమోనని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ దాని దగ్గరకు వచ్చింది.

అప్పుడు పిల్లి... ‘భయపడకు. నేను నిన్ను ఏమి చేయను. నాతో రా.. నీకు ఒకటి చూపిస్తాను’ అంటూ దాన్ని తీసుకువెళ్లి దారి మధ్యలో చచ్చిపోయిన గొంగళి పురుగుల్ని కొన్నింటిని చూపించింది.

‘చూశావా.. అవి ఎందుకు చచ్చిపోయాయో నీకు తెలుసా?’ అని అడిగింది. తెలియదన్నట్లు బిక్క మొహం పెట్టింది జాలీ. ‘నడిచేవాళ్లు షూస్‌ వేసుకుంటారు. వేగంగా నడుస్తూ చూడక తొక్కేస్తారు. అప్పుడు వాటి కింద నలిగి చచ్చిపోయాయి ఇవి. మరొకటి సైకిల్‌ కింద పడి నలిగిపోయింది. అప్పుడు వాళ్ల అమ్మానాన్న ఎంత బాధ పడతారో ఆలోచించావా? వాళ్లు పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటారుగా...’ అంది దాని కళ్లలోకి చూస్తూ. ‘అవును...’ అంటూ తల ఊపిందది బుద్ధిగా. ‘చక్కటి సీతాకోకచిలుకలాగా నీకు అవ్వాలని లేదా?’ అని అడగడంతో.. ఉందని తలూపింది.

అప్పుడు ‘జాలీ! అమ్మమాట వినని వాళ్లు ఎవరూ ఈ లోకంలో బాగుపడలేదు. నిన్ను మీ అమ్మ ఎక్కడికీ వెళ్లొద్దు అనటం లేదు కదా. పక్క నుంచి వెళ్లమని చెబుతోంది. అదీ నీ మంచి కోసమే కదా. నీ ప్రాణాన్ని కాపాడుకోమనేగా చెప్పింది. పెద్దల మాట చద్దిమూట. తప్పక వినాలి’ అని హితబోధ చేసింది. అప్పుడు దాని బుర్రకు ఆ విషయం అర్థమైంది. పిల్లిని క్షమించమని చెప్పి దాని తల్లి దగ్గరికి చేరింది. ఇకనుంచి నీ మాట తప్పకుండా వింటానని తల్లి ఒడిలోకి చేరిపోయింది జాలీ.

అంతే కాదు. అది తను నేర్చుకున్న పాఠాన్ని.. స్నేహితులకు కూడా చెప్పి.. అవి కూడా వినేలా చేసింది. దాంతో ఆ రోజు నుంచీ ఏ గొంగళి పురుగూ ఆ ట్రాక్‌ మీద చనిపోలేదు. చూశారా పిల్లలూ! జాలీ ఎంత మంచిగా మారిపోయిందో. మరి మీరూ మీ అమ్మ చెప్పిన మాట ఇక మీదట వింటారుగా!

- యలమర్తి అనూరాధ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని