ఇంతకీ ఎవరు గొప్ప?

ఒకరోజు అడవిలోని జంతువులన్నీ చెట్టు నీడన సేద తీరుతున్నాయి. పక్షులు కూడా కొమ్మల మీద విశ్రాంతి తీసుకుంటున్నాయి. చిన్న చిన్న ప్రాణులేమో పొదల దగ్గర ఆటలాడుతున్నాయి. ఇంతలో వెనుక నుంచి ఒక జంతువు సరదాగా ‘మనందరిలో ఎవరు గొప్ప?’ అనే ప్రశ్న వేసింది.

Published : 25 Nov 2022 00:19 IST


ఒకరోజు అడవిలోని జంతువులన్నీ చెట్టు నీడన సేద తీరుతున్నాయి. పక్షులు కూడా కొమ్మల మీద విశ్రాంతి తీసుకుంటున్నాయి. చిన్న చిన్న ప్రాణులేమో పొదల దగ్గర ఆటలాడుతున్నాయి. ఇంతలో వెనుక నుంచి ఒక జంతువు సరదాగా ‘మనందరిలో ఎవరు గొప్ప?’ అనే ప్రశ్న వేసింది. దాంతో సేద తీరుతున్న జంతువులన్నీ అటుగా చూశాయి.

ముందుగా ఏనుగు లేచి నిలబడి, తొండం ఊపుతూ.. ‘అందరితో ప్రథమ పూజలందుకునే వినాయకుడికి మా తలకాయే అమర్చారు. దేవలోకాన్ని పరిపాలించే దేవేంద్రుని వాహనం కూడా ఐరావతమే. ఆకారంలోనూ మేమే పెద్ద. కాబట్టి మా జాతే గొప్ప’ అంది. ఈ మాటలను చెట్టు కింద కలుగులో ఉన్న చిట్టెలుక విన్నది. అది తల బయటపెట్టి.. ‘భారీ ఆకారం కలిగిన బొజ్జ గణపయ్యను మోసేది.. ముల్లోకాలు తిప్పేది మేమే. చిన్న ప్రాణులమైనా గణపతి వాహనంగా నిలిచాం. అందరూ మా గొప్పతనాన్ని గుర్తించాలి’ అని చెప్పిందది.

గరుడపక్షి విసురుగా రెక్కలు టపటపలాడిస్తూ.. చెట్టు మీద నుంచి కిందకు దిగింది. ‘సాక్షాత్తు ఆ శ్రీహరికే మేం వాహనం’ అని గర్వంగా చెప్పింది. ఇంతలో ఎలుగుబంటి మాట్లాడుతూ.. ‘సీతమ్మ కోసం లంక చేరటానికి సముద్రంపైన వారధి నిర్మించాలని శ్రీరాముడికి చెప్పిన జాంబవంతుడిది మా జాతే. వారధి నిర్మాణంలో మా పాత్ర ఎనలేనిది. అందువల్ల మేమే గొప్ప’ అని వివరించింది.

ఈ మాటలు విన్న కోతుల గుంపు కిచకిచమని అరుస్తూ.. ‘రామసేతు నిర్మాణంలో కష్టించి రాళ్లు మోసింది మా సైన్యమేనన్న విషయం మర్చిపోవద్దు’ అన్నాయి. ఎవరెన్ని చెప్పినా మేమే గొప్ప అని అరిచాయి కోతులు. ఇంతలో ఒక ఉడుత పిల్ల ముందుకు వచ్చి.. రామసేతు నిర్మాణంలో మా పాత్ర కూడా ఉంది. సాక్షాత్తు ఆ శ్రీరాముడే మమ్మల్ని శెభాష్‌ అని మెచ్చుకున్నారు’ అంటూ మూడు వేళ్లతో నిమిరిన ఆ గుర్తులను మరోసారి చూపించింది. అక్కడే ఉన్న దున్నపోతు.. ‘మేము నరకలోకాధిపతి యముడి వాహనం. మరణించిన తర్వాత ప్రతి జీవి పాపపుణ్యాల ఆధారంగా నరకానికి రావాల్సిందే. యముడినే కాదు మమ్మల్ని చూసినా అందరూ భయపడతారు. కాబట్టి మా జాతే గొప్పదిగా భావించాలి’ అని కోరింది.

పురి విప్పిన నెమలి తన అందాలు ఒలకపోస్తూ ముందుకొచ్చింది. ‘పరమేశ్వరుని పుత్రుడు, దేవగణాలకు సేనాధిపతి కుమారస్వామికి వాహనంగా ఉన్నది మేమే. అందుకే అందరిలో మేమే గొప్ప’ అంది. అప్పుడే పుట్టలోంచి బుస్‌.. బుస్‌ అంటూ నాగుపాము తల బయటపెట్టింది. అందరినీ ఉద్దేశించి.. ‘మీరంతా కేవలం వాహనాలు మాత్రమే. కానీ, ్జమేము ఏకంగా ఆ శివుడి మెడలోనే కొలువుదీరాం. మమ్మల్ని చూస్తే అందరూ భయపడాల్సిందే!’ అని చెప్పింది. ఇంతలో రావి చెట్టు జంతువులను ఉద్దేశించి.. ‘నన్ను కేవలం చెట్టుగా భావించకండి. నేను పవిత్రమైన మహావృక్షాన్ని. వృక్షాల్లో రాజును. భక్తులు నిత్యం ప్రదక్షిణలు, పూజలు చేస్తుంటారు. పరమాత్ముడు బాలకృష్ణునిగా రావి ఆకుపై విశ్రమించిన విషయం మర్చిపోవద్దు’ అని తమ గొప్ప చెప్పుకొంది.

ఇంతలో చెట్టు పైనున్న కాకి.. కావ్‌.. కావ్‌ అని అరుస్తూ నేల మీద వాలింది. ‘అందరూ పూజించే శనీశ్వరుడి వాహనం మేమే. కొన్ని కార్యక్రమాల్లో ఎవరికీ దక్కని ఆహ్వానాలు మాకు అందుతాయి. మేం తింటేనే పితృదేవతలు తరిస్తారని అంటారు. అందుకే అందరిలో మేమే గొప్ప’ అంది. చివరగా సింహం మాట్లాడుతూ.. ‘నేను మీకు మృగరాజుగానే తెలుసు. దుర్గాదేవి వాహనంగా ఉంది మాజాతే. మమ్మల్ని చూసి మీరెలా భయపడతారో, దుర్గమ్మను చూస్తే రాక్షసులూ అంతే.. ఆ అమ్మవారు దుష్ట సంహారం చేసి లోకానికి మేలు చేసింది. కాబట్టి మేమే గొప్ప’ అంది.

ఇంతలో దూరం నుంచి ఓ మునీశ్వరుడు వస్తూ కనిపించాడు. జంతువులన్నీ ఆయన దగ్గరకు వెళ్లి నమస్కరించాయి. జంతువుల మధ్య సాగిన చర్చను ఆయనకు వివరించి.. తమలో ఎవరు గొప్పో చెప్పమన్నాయి. దానికి మునీశ్వరుడు.. ‘దేవతామూర్తుల వాహనాలుగా ఉండటం అదృష్టంగా భావించాలి కానీ గొప్పగా చెప్పుకోరాదు. జంతువులు, పక్షులను వాహనాలుగా చేసుకోవటంలో అర్థం.. భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనని.. మీరంతా ముందు ఆ విషయాన్ని తెలుసుకోవాలి’ అని సమాధానమిచ్చాడు. దాంతో అడవి జీవులకు తత్వం బోధపడింది. తమ తప్పు తెలుసుకున్నాయి.

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని