Published : 25 Nov 2022 00:19 IST

ఇది మన పాండా!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. కాస్త పిల్లిలా, ఇంకాస్త బుజ్జి ఎలుగుబంటిలా కనిపిస్తున్న దీని పేరు రెడ్‌పాండా. దీన్ని లెస్సర్‌ పాండా అని కూడా పిలుస్తారు. మామూలుగా పాండా అనగానే మనకు చైనానే గుర్తుకు వస్తుంది కదా! కానీ ఈ రెడ్‌ పాండాలు భారత్‌, చైనాతోపాటు మరి కొన్ని దేశాల్లోనూ కనిపిస్తాయి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా! ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి.

ఈ రెడ్‌ పాండాలు మనదేశంతోపాటు, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో జీవిస్తున్నాయి. మన దేశంలోనైతే సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, డార్జిలింగ్‌, పశ్చిమబెంగాల్‌లోని కాలింపోగ్‌ జిల్లాలో ఈ రెడ్‌ పాండాలు కనిపిస్తుంటాయి. ఈ జీవుల కాళ్లు నల్లగా.. చెవులు, కళ్లు, మూతి దగ్గర తెల్లగా.. శరీరం, తోక.. ఎరుపు, గోధుమరంగు వెంట్రుకలతో భలే తమాషాగా ఉంటాయి. ఇవి 51 నుంచి 63 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. వీటి తోక 28 నుంచి 48 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. బరువేమో 3 నుంచి 15 కేజీల వరకు తూగుతాయి. ఇండియన్‌ రెడ్‌ పాండాలు మాత్రం 9 కేజీల బరువును మించి పెరగవు. చైనా రెడ్‌పాండాలు 15 కేజీల వరకు పెరుగుతాయి.

ఏం తింటాయంటే...

జెయింట్‌ పాండాలు వెదురును తింటాయి కదా.. ఈ రెడ్‌ పాండాలు కూడా ఎక్కువగా వెదురు మొలకలు, ఆకులు, చిన్న చిన్న కొమ్మల్ని ఆహారంగా తీసుకుంటాయి. అంతేకాకుండా ఇతర ఫలాలు, పువ్వులు, గుడ్లు, చిన్న చిన్న పక్షులు, క్షీరదాలనూ ఆహారంగా తీసుకుంటాయి. అంటే శాకాహారంతోపాటు మాంసాహారాన్నీ తింటాయన్నమాట.

కోపం ఎక్కువే...

జెయింట్‌ పాండాలతో పోల్చుకుంటే ఈ రెడ్‌ పాండాలు చిరుజీవులు. కానీ వీటికి కోపం చాలా ఎక్కువ. జెయింట్‌ పాండాల్లా ఇవి మనుషులతో కలివిడిగా ఉండలేవు. ఇవి ఎక్కువగా దాడి చేయడానికే ప్రయత్నిస్తాయి. చూడ్డానికి ముద్దుగా ఉన్నా, వీటికి పదునైన గోర్లు, దంతాలు ఉండటంతో ఇవి చాలా ప్రమాదకరమైన జీవుల జాబితాలోకే వస్తాయి.

ప్రమాదంలో ఉన్నాయి...

ప్రస్తుతం ఈ అరుదైన రెడ్‌పాండాలు ప్రమాదకరస్థితిలో ఉన్నాయి. నానాటికీ అడవులు తరిగిపోవడం, గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ఏర్పడుతున్న పర్యావరణ మార్పులే దీనికి ప్రధాన కారణం. మనుషులు వేటాడటం వల్ల కూడా వీటి సంఖ్య వేగంగా పడిపోతోంది. చర్మం, తోక కోసమే వీటిని ఎక్కువగా వేటాడుతున్నారు. గత యాభై ఏళ్లలో చైనాలో ఈ రెడ్‌ పాండాల సంఖ్య ఏకంగా 40శాతం తగ్గింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య 10,000 కంటే తక్కువుందని అంచనా. మీకు మరో విషయం తెలుసా.. మన భారత ప్రభుత్వం 2009లో ఈ రెడ్‌పాండా బొమ్మతో ఓ స్టాంప్‌ను కూడా విడుదల చేసింది. నేస్తాలూ మొత్తానికి ఇవీ రెడ్‌పాండా విశేషాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని