Updated : 26 Nov 2022 03:08 IST

మాస్టారి పాఠం!

రామాపురంలో అది ఒక ఉన్నత పాఠశాల. వేసవి సెలవుల తర్వాత తరగతులు మళ్లీ ప్రారంభమయ్యాయి. బదిలీ మీద తెలుగు భాషను బోధించడానికి ఉపాధ్యాయుడు రాఘవరావు ఆ పాఠశాలకు వచ్చారు. మొదటి రోజు అందరి పరిచయాలు అయ్యాయి. ఆరో తరగతి విద్యార్థి రవి చదువు, ఆటపాటల్లోనూ ముందుంటాడు. అంతేకాదు అతనికి మంచి చిత్రకారుడు అన్న పేరు కూడా ఉంది. ఒకరోజు తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెబుతుండగా.. చివర బెంచీలో కూర్చున్న రవి పాఠం అయ్యే లోపల రంగు కాగితంపై మాస్టారు బొమ్మ గీసి పుస్తకంలో పెట్టేసుకున్నాడు. పక్కనే కూర్చున్న గిరి గబుక్కున రవి పుస్తకంలో ఉన్న ఆ కాగితాన్ని తీసుకెళ్లి మాస్టారుకు ఇచ్చాడు. ‘గీసింది నువ్వా?’ అన్నారు మాస్టారు. ‘నేను కాదు సార్‌! రవి గీశాడు’ అన్నాడు గిరి. మాస్టారు ఆ కాగితాన్ని తీసుకొని, ఏమీ మాట్లాడకుండా తరగతి గది నుంచి వెళ్లిపోయారు.

‘ఇంకేం.. మాస్టారు నీకు మంచి బహుమతి ఇస్తారు. అంతేకాదు ఇక మీదట మార్కులు కూడా బాగానే వేస్తారు’ అని తోటి విద్యార్థులు రవితో అన్నారు. తను మాత్రం ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు తెలుగు మాస్టారు తరగతి గదిలోకి రాగానే.. ‘రవి.. లేచి నిలబడు’ అన్నారు. రవి నిలబడ్డాడు. ‘నిన్న నువ్వు చేసిన పని బాగాలేదు’ అన్నారు మాస్టారు. విద్యార్థులంతా నివ్వెరపోయారు. మాస్టారు మెచ్చుకుంటారని అనుకుంటే ఇలా అంటున్నారేంటని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ‘నిన్న పాఠం వినకుండా.. నువ్వు నా బొమ్మ గీయడం మంచి పద్ధతి కాదు’ అన్నారు మాస్టారు. ‘సార్‌! మీరు చెప్పబోయే పాఠాన్ని నేను ఒక రోజు ముందుగానే చదివి పూర్తిగా అర్థం చేసుకుంటాను’ అన్నాడు రవి. ‘నీ విషయం సరే.. నువ్వు కూర్చున్న బెంచీలో మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి? నిన్న నేను చెప్పిన పాఠం గురించి అడుగుతాను చెప్పండి’ అని గిరి, రమేష్‌ను అడిగారు. వారిద్దరూ నిలబడి నీళ్లు నమిలారు.  

‘చూశావా... నీవల్ల వారిద్దరూ పాఠం వినలేదు. నువ్వు వేసే బొమ్మ మీదనే వారు దృష్టి పెట్టారు. వారికి ఒక క్లాస్‌ వృథా అయ్యింది’ అన్నారు మాస్టారు. ‘తప్పయింది సార్‌!.. క్షమించండి’ అన్నాడు రవి. ‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని మరవొద్దు. నువ్వు అన్నింట్లో మొదటి శ్రేణిలో ఉంటావని నాకు తెలుసు. అందుకు నిన్ను అభినందిస్తున్నా. కానీ, నిన్న చేసిన పనికి నీకు రెండు శిక్షలు విధిస్తున్నా’ అన్నారు మాస్టారు. అవేంటోనని అందరూ ఆత్రుతగా వినసాగారు. ‘సరే సార్‌’ అన్నాడు రవి. ‘ఈ రోజు అన్ని తరగతులు అయిపోయాక.. నువ్వు నిన్నటి పాఠాన్ని గిరి, రమేష్‌కు అర్థం అయ్యేలా చెప్పాలి. తర్వాత.. నేను అందులోంచి వాళ్లను ప్రశ్నలు అడుగుతాను. సరైన సమాధానాలు చెబితేనే మనం ఇంటికి వెళ్లేది. అంతే కాదు.. రేపు నాలుగు పూల మొక్కలను తీసుకొచ్చి.. మన పాఠశాల ఆవరణలో నాటాలి. పదిరోజుల పాటు వాటి బాగోగులు మొత్తం నువ్వే చూడాలి. ఇవే నీకు నేను వేస్తున్న శిక్షలు’ అన్నారు మాస్టారు.
‘అలాగే సార్‌’ అన్నాడు రవి. ఆరోజు తరగతులన్నీ అయిపోయాక.. గిరి, రమేష్‌కు వారు వినని పాఠం అర్థం అయ్యేలా చెప్పి.. రాఘవరావు మాస్టారు గదికి తీసుకెళ్లాడు. ‘నువ్వు వెళ్లి ఆవరణలో కూర్చో’ అని రవిని బయటకు పంపించి వేశారు మాస్టారు. వరండాలో రవిని చూసిన ప్రధానోపాధ్యాయుడు.. తన గదికి పిలిపించుకుని.. ‘రాఘవరావు మాస్టారు చాలా మంచివారు. ఆయన పాఠాలను క్రమశిక్షణతో వినాలని అంటారు. నీకు శిక్ష వేసిన సంగతి తెలిసింది. మొక్కలు కొనడానికి నీకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. ఇదిగో తీసుకో’ అని వంద రూపాయలు ఇవ్వబోయారు. ‘మీరు ఇస్తున్న డబ్బును కాదంటున్నందుకు క్షమించండి సార్‌! ఇంతకు ముందు నేను చిత్రలేఖనం పోటీల్లో గెలుచుకున్న డబ్బు నా కిడ్డీ బ్యాంకులో ఉంది. వాటిలో నుంచి కొంత మొత్తాన్ని మొక్కల కోసం వినియోగిస్తాను. తెలుగు మాస్టారు చెప్పింది అక్షరసత్యం. ఇక మీదట అలాగే నడుచుకుంటాను సార్‌’ అని బదులిచ్చాడు రవి.

ఆ నిర్ణయాన్ని ప్రధానోపాధ్యాయుడు అభినందించారు. ఆయన గది నుంచి బయటకు వచ్చిన కాసేపటికి.. మాస్టారు, గిరి, రమేష్‌ కూడా వరండాలోకి వచ్చారు. ‘రవీ.. వీరిద్దరూ నిన్నటి పాఠంలో అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పారు. ఇక ఇంటికి వెళదాం పదండి’ అన్నారు మాస్టారు. మరుసటి రోజు రవి నాలుగు పూల మొక్కలు కొనుక్కొచ్చి.. పాఠశాల ఆవరణలో నాటాడు. రోజూ ఉదయం, సాయంత్రం ఆ మొక్కలకు నీళ్లు పోయసాగాడు. అప్పటి నుంచి అన్ని తరగతుల్లోనూ విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినసాగారు. చూస్తుండగానే.. మొక్కలు చక్కగా పెరగడంతో, రవిని అభినందించారు రాఘవరావు మాస్టారు.

యు.విజయశేఖర రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని