Published : 27 Nov 2022 00:57 IST

తాత మాట.. మనవడి బాట!

ఒక గ్రామాధికారికి ఊరిని పచ్చదనంతో నింపాలన్న కోరిక కలిగింది. అందుకోసం ఆయన ప్రత్యేకంగా పండ్ల, పూల మొక్కలతోపాటు నీడనిచ్చేవాటినీ తెప్పించాడు. ఈ పని కోసమే సిబ్బందిని నియమించాడు. స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తూ.. పనివాళ్లతో కుండీలు సిద్ధం చేయించడం, నీళ్లు పోయించడం, అంట్లు కట్టించడం చేయసాగాడు. త్వరగా పనులు పూర్తి చేయించాలని, సిబ్బంది కోసం ప్రత్యేకంగా వసతి కూడా ఏర్పాటు చేయించాడు. అలా కొద్దిరోజులపాటు అన్ని పనులనూ దగ్గరుండి చూసుకున్నాడు. కానీ, ‘ఈ పనిమీదే ఎంతకాలం ఉండగలడు?’ - అందుకే.. ఈ పచ్చదన బాధ్యతలను సిబ్బందిలోనే ఒకరికి అప్పగించాలనీ,
ఆ వ్యక్తి నిజాయతీపరుడై ఉండాలని అనుకున్నాడు.

అలా కొన్ని రోజులు గడిచాయి. అత్యవసర పని నిమిత్తం వేరే ఊరికి వెళ్తున్నాననీ, పనులు మాత్రం ఆగకూడదని కూలీలకు చెప్పి బయలుదేరాడా గ్రామాధికారి. ఆయన లేకపోవడంతో సిబ్బందికి పండగే అయ్యింది. ఎక్కడి పనులక్కడే ఆపేశారు. ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా..’ అన్నట్టు ఒక్క మాధవుడు మాత్రమే తన పని తాను చేసుకుంటూ.. కూలి డబ్బులు తీసుకొని వసతి గృహానికి వెళ్లిపోయేవాడు. మిగిలిన వాళ్లు పని చేయకుండా.. ముచ్చట్లతోనే కాలక్షేపం చేసేవారు. బుద్ధిగా పని చేసుకుంటున్న మాధవుడిని లౌక్యం తెలియని వాడంటూ ఎగతాళి చేసేవారు. సాయంత్రం కాగానే కూలి డబ్బులు మాత్రం కచ్చితంగా తీసుకునేవారు.

మరుసటి రోజు ఒక బాటసారి పనిచేసుకుంటూ ఉన్న మాధవుడి దగ్గరకు వచ్చాడు. వసతి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న పనివాళ్లను చూసి మాధవుడితో.. ‘నేను మూడు రోజులుగా గమనిస్తున్నాను. నువ్వు ఒక్కడివి మాత్రమే నిజాయతీగా పని చేస్తున్నావు. మిగతా వాళ్లు అసలు తమకేమీ పట్టనట్లుగా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. నువ్వు ఒక్కడివి మాత్రమే ఎందుకు పనిచేయాలి? వారిలా హాయిగా ఏ కష్టం లేకుండా కూలి డబ్బు తీసుకోవచ్చు కదా! గ్రామాధికారి కూడా ఊళ్లో లేరని విన్నాను. కాబట్టి.. ఆయన వచ్చేవరకూ ఆడింది ఆట.. పాడింది పాట కదా?’ అని అన్నాడు. ఆ మాటలకు బాటసారి వైపు చిరాగ్గా చూశాడు మాధవుడు.

‘పని చేయకుండా డబ్బులు తీసుకోవడం కూడా ఒక రకమైన దొంగతనమని మా తాత చిన్నప్పుడు తరచూ చెబుతుండేవాడు. చేసే పని ఏదైనా సరే, నిజాయతీగా ఉండాలని, ఎప్పుడైనా అదే గొడుగై మనల్ని కాపాడుతుందనేవాడు. మన అభివృద్ధికి కూడా అదే దారి చూపుతుందని ఆయన చెప్పిన మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. మా తాతయ్య అంటే నాకు చాలా గౌరవం. అందుకే.. ఆయన మాటలకు అంతకంటే ఎక్కువ విలువనిస్తాను. అంతే కాదు.. నా మనసులో ఏదైనా తప్పుడు ఆలోచన వచ్చినా.. ఆయన చెప్పిన కథలు గుర్తుకొచ్చి నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. గ్రామాధికారి ఇక్కడ ఉన్నాడా? లేడా? అనేది నాకు అవసరం లేదు. నా మనసే నాకు యజమాని. అయినా బాటసారివి.. ఇవన్నీ నీకెందుకు? సలహాలు ఇవ్వడం మానేసి.. నీ దారిన నువ్వు వెళ్లు’ అన్నాడు కాస్త కోపంగా.

వెంటనే, తన పనిలో తాను లీనమయ్యాడు. అప్పుడు బాటసారి.. ‘నీలాంటి వారు అరుదుగా ఉంటారు. ఇంతకీ నీ పేరేంటో తెలుసుకోవాలని ఉంది’ అని అడిగాడు. ‘నా పేరు మాధవుడు. అయినా నా పేరుతో నీకేం అవసరం?’ అని వెనక్కి తిరిగి చిరాగ్గా అనడంతో.. బాటసారి తన దారిన తాను వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు గ్రామాధికారి వచ్చి.. మొక్కల పనులను పరిశీలించాడు. ఇకనుంచి ఈ బాధ్యతలను మాధవుడికి అప్పగిస్తున్నట్లు అందరి ముందే ప్రకటించాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. బాటసారిగా మారువేషంలో వచ్చింది తానేనని జరిగిన విషయం మొత్తం వివరించాడు. పనివాళ్లను గట్టిగా హెచ్చరించడంతో.. మరోసారి పొరపాటు జరగదని క్షమాపణ కోరారు. గ్రామాన్ని నందనవనంగా తీర్చిదిద్దే బాధ్యతను తనకు అప్పగించడంతో.. తాత మాట నిజమైందని లోలోపలే సంతోషించాడు మాధవుడు.

-  బెలగాం భీమేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని