Updated : 28 Nov 2022 05:21 IST

మా రాజు.. మహాత్ముడు!

రావత సామ్రాజ్యాన్ని పరిపాలించే దేవసేన మహారాజు అత్యంత బలవంతుడు. అతని సామ్రాజ్యంలో పదహారు సామంత రాజ్యాలు ఉన్నాయి. దేవసేనుడు సామంత రాజులను ఎప్పుడూ తన ఆధీనంలో ఉంచుకోవడానికి, నెలకు రెండు సార్లు వారితో సమావేశమయ్యేవాడు. సామ్రాజ్యాలన్నింటిలో మనమే ముందున్నామని.. ఇక్కడి ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని దేవసేనుడు పదే పదే చెప్పే మాటలు అబద్ధమని తెలిసినా, ఎవరూ అడ్డు చెప్పేవారు కాదు. గతంలో ఒక సామంత రాజు ‘మహారాజు చేతల మనిషి కాదు.. మాటల మనిషే’ అని చాటుగా అనడంతో పదవి నుంచి తొలగించి, ఆయన సోదరుడిని రాజుగా చేసాడు దేవసేనుడు. మహారాజు ఆజ్ఞకు విరుద్ధంగా అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తే.. బలగంతో అణిచివేసేవాడు. నాటి నుంచి సామంత రాజులు దేవసేనుడు ఏది చెప్పినా సై అంటున్నారు.

వాస్తవానికి రాజ్యాల్లో ప్రజలకు సరైన ఆహారం, వైద్యం లభించడం లేదు. ఈ సమస్యలు మహారాజుకు తెలియడం లేదు. మంత్రులు విలాసాలకు అలవాటు పడి, ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. ప్రజలు రాజు దగ్గరికి రావడానికి భయపడేవారు. మహారాజు ప్రతినెలా నిర్వహించే సమావేశాలకు ధర్మవరం సామంత రాజు ఇంద్రవర్మ మూడు నెలలుగా రావడం లేదు. ఏదో ఒక కారణం చెప్పి మంత్రిని పంపిస్తుండటంతో దేవసేనుడికి బాగా కోపం వచ్చింది. కొద్దిరోజులకు మహారాజు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రపంచ దేశాల్లోని చక్రవర్తులు, రాజులు విచ్చేసి విలువైన కానుకలు సమర్పించారు. సామంత రాజులు కూడా తమ ఖజానా నుంచి ఖరీదైన వజ్ర వైఢూర్యాలు తెచ్చి బహూకరించారు. ధర్మవరం మంత్రి ఒక పుష్పగుచ్ఛం తెచ్చి ఇవ్వగా.. దేవసేనుడు కోపంతో విసిరి పడేశాడు. మంత్రి మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు.

పుట్టినరోజు వేడుకలకు కూడా ఇంద్రవర్మ హాజరుకాకపోవడంతో ధర్మవరంపై దేవసేనుడు యుద్ధం ప్రకటించాడు. వేలాదిగా సైనికులతో బయలుదేరగా.. మార్గమధ్యలో ఎక్కడ చూసినా బీడు వారిన భూములు, ఎండిపోయిన చెరువులు, బక్కచిక్కిన మనుషులు కనిపించారు. ఎవరి ముఖాల్లోనూ ఆనందం కనిపించలేదు. దాంతో రాజుకు రాజ్య స్థితిగతులు అర్థమయ్యాయి. ధర్మవరంలో ఎటు చూసినా పచ్చని పంటలు, నిండిన చెరువులు, కళకళలాడుతున్న వాగులు, కాలువలు, పూలతోటలు కనువిందు చేశాయి. మహారాజును చూడడానికి ఒక్కరు కూడా పని మానేసి దారి దగ్గరికి రాకపోవడం అందరికీ ఆశ్చర్యం వేసింది. పొలం దున్నుతున్న ఒక రైతును సైనికులు బలవంతంగా మహారాజు ముందుకు తీసుకొచ్చారు.

‘మహారాజు వస్తుంటే.. దండం పెట్టాలని తెలియదా?’ అని రైతును కోపంగా అడిగాడు సేనాపతి. ‘క్షమించండి రాజా.. మీరెవరో మాకు తెలియదు. ఈ దారి వెంబడి మా రాజు ఎన్నోసార్లు ఒక్కడే ఒంటరిగా వెళ్లినా.. మమ్మల్ని ఏనాడూ ఇలా పిలిచి అడగలేదు’ అని రైతు ధైర్యంగా చెప్పాడు. ‘ఇదేనా మీ రాజు చెప్పిన సంస్కారం?’ అని ఓ సామంత రాజు ఎగతాళిగా అన్నాడు. రైతు నవ్వడంతో.. ‘ఎందుకు నవ్వుతున్నావు?’ అని కోపంగా అడిగాడు మహారాజు. ‘మహారాజా.. పని చేసుకునేవాడిని బలవంతంగా ఎత్తుకురావడమేనా మీ సంస్కారం. మా రాజు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటాడు. ఎవరి పనులు వారే చేసుకోవాలని, ఇతరులపై ఆధారపడవద్దని, ఆడంబరాలకు పోవద్దని చెబుతుంటారు. అందుకే ఇక్కడ ప్రజలందరూ కష్టపడి పనిచేస్తారు. అందుకే మా రాజ్యంలో కరవు అనేదే లేదు’ అన్నాడు రైతు.

ఆ మాటలు మహారాజులో ఆలోచన రేకెత్తించాయి. ‘మీ రాజు, మా మహారాజు నిర్వహించే సమావేశాలకు ఎందుకు రావడం లేదు. రాజ్యం బాగుందని గర్వమా?’ అని మంత్రి మెల్లగా రైతును అడిగాడు. ‘మా రాజు ఉత్తముడు. మూడు నెలల కిందట గోపాలపురంలో వరదలు వచ్చి రెండు చెరువులకు గండి పడింది. దాని మరమ్మతులు పూర్తయ్యే వరకూ రాజు అక్కడే ఉన్నాడు. కట్ట తెగిపోకుండా చేసి, నాలుగు ఊర్ల ప్రజల ప్రాణాలను కాపాడాడు’ అని రైతు చెప్పగానే దేవసేనుడి కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి. సామంత రాజులు సిగ్గుతో తల దించుకున్నారు. ‘నిరాడంబర జీవితం గడుపుతూ, నిత్యం జన సేవకుడిగా కృషి చేస్తున్న వ్యక్తిపైనా నేను యుద్ధం చేసేది?’ అనుకొని దేవసేనుడు బాధపడ్డాడు. తన పరివారాన్ని రాజధానికి పంపించి, మహారాజు ఒక్కడే ఇంద్రవర్మను కలుసుకోవడానికి సంతోషంతో బయలుదేరాడు.

దుర్గమ్‌ భైతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని