వావ్‌.. వావ్‌.. మ్యావ్‌.. మ్యావ్‌..!

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఈ రోజు మనం ఓ వింత కెఫె గురించి తెలుసుకుందాం. దాని పేరు క్యాట్‌ కెఫె. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈ కెఫెలో పిల్లులు ఉంటాయని. ఇది ఏ విదేశంలోనో ఉండి ఉంటుందనుకునేరు.! కానీ ఈ క్యాట్‌ కెఫె మన దేశంలోనే ఉంది.

Published : 30 Nov 2022 00:11 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఈ రోజు మనం ఓ వింత కెఫె గురించి తెలుసుకుందాం. దాని పేరు క్యాట్‌ కెఫె. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈ కెఫెలో పిల్లులు ఉంటాయని. ఇది ఏ విదేశంలోనో ఉండి ఉంటుందనుకునేరు.! కానీ ఈ క్యాట్‌ కెఫె మన దేశంలోనే ఉంది. అదెక్కడో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఇంకెందుకాలస్యం. ఈ కథనం చదివేయండి.

మహారాష్ట్రలోని ముంబయి నగరంలో ఉంది ఈ విచిత్ర క్యాట్‌ కెఫె స్టూడియో. ఇక్కడ పిల్లులే బాస్‌లు. ఈ కెఫెకు జనాలు తమ లాప్‌టాప్‌తో వచ్చి చక్కగా పనిచేసుకోవచ్చు. కాఫీ, టీలు తాగొచ్చు. ఆహారమూ తినొచ్చు. పిల్లులతో సరదాగా గడపొచ్చు. ఈ కెఫెను మృధు కోసల అనే అక్క ఏర్పాటు చేశారు.

షరతులు వర్తిస్తాయి..

క్యాట్‌ కెఫె అనగానే ఎంచక్కా పరుగుపరుగున వెళ్లొచ్చు అనుకునేరు. అవేమీ కుదరదిక్కడ. పిల్లులకు పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. అవి శుభ్రంగా ఉండటానికే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటాయి. అందుకే ఈ కెఫెలోకి వెళ్లాలనుకునేవారు ముందు తప్పనిసరిగా తమ చేతులను చక్కగా కడుక్కోవాల్సిందే. ఇక్కడ మనుషులతోపాటు పిల్లులూ తమ ఆహారాన్ని తింటూ ఉంటాయి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఆటంకపరచకూడదు. పిల్లుల అనుమతి లేకుండా వాటిని అస్సలు తాకకూడదు. ఇది కాస్త వింతగా అనిపించినా నిజం సుమా. అవి మనదగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే వాటిని తాకే ప్రయత్నం చేయాలి. అవి ఇష్టపడకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ బలవంతంగా వాటిని మన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయకూడదు. పిల్లులతో ఎంచక్కా సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు. కానీ ఫ్లాష్‌ మాత్రం రాకుండా చూసుకోవాలి.

‘ఇది మా అడ్డా...’

ఈ క్యాట్‌ కెఫె పూర్తిగా పిల్లుల సామ్రాజ్యం. ఇక్కడ అంతా వాటి ఇష్టప్రకారమే జరుగుతుంది. వాటికి నిద్రపోవాలనిపిస్తే నిద్రపోతాయి. లేవాలి అనిపిస్తే నిద్రలేస్తాయి. ఆడుకోవాలనిపిస్తే ఆడుకుంటాయి. తినాలనిపిస్తే తింటాయి. అల్లరి పనులు చేయాలనిపించినప్పుడు అల్లరీ చేస్తాయి. ‘ప్రతి పిల్లికీ ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. కొన్ని పిల్లులు బుద్ధిగా ఉంటే.. మరి కొన్ని విపరీతమైన అల్లరి చేస్తాయి. ఇంకొన్ని మనుషులతో బాగా మమేకమవుతాయి. వాటి మనసెరిగి మనం ప్రవర్తించాలి’ అంటారు ఇక్కడి నిర్వాహకులు.

దత్తత కూడా ఉందోచ్‌...

ఈ కెఫెకు వచ్చే వారు పిల్లుల్ని దత్తత  కూడా తీసుకోవచ్చు. అంటే వాటి ఆలనాపాలనాకు అయ్యే ఖర్చు భరించొచ్చు. కాకపోతే దీనికి కూడా పిల్లి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అంటే ఎవరైనా ఏదైనా పిల్లిని దత్తత తీసుకోవాలి అనుకుంటే.. ముందుగా వాళ్లు కొంత సమయం దాంతో వెచ్చించాలి. ఆ పిల్లి కూడా వారితో బెరుకు లేకుండా ఉండాలి. ఇలాంటి అనుబంధం ఏర్పడ్డాకే దత్తతకు అంగీకారం కుదురుతుంది.

ఓ ఆలోచన నుంచి...

ఇలాంటి క్యాట్‌ కెఫె మొట్టమొదట 1998లో తైవాన్‌లోని తైపీలో ఉండేది. దాని పేరు క్యాట్‌ ఫ్లవర్‌ గార్డెన్‌. క్రమక్రమంగా అమెరికా, స్పెయిన్‌, జపాన్‌లో ఇలాంటి క్యాట్‌ కెఫెలు పుట్టుకువచ్చాయి. ముంబయిలో ఉన్నది కేవలం క్యాట్‌ కెఫె మాత్రమే కాదు, సంరక్షణాలయం కూడా. 2008లో ఈ కెఫె స్థాపకురాలైన మృధు కోసల ఓ గాయపడ్డ పిల్లిని చేరదీశారు. అప్పుడే ఆమెకు ఓ ఆలోచన వచ్చి తర్వాత ఈ క్యాట్‌ కెఫెను ప్రారంభించారు. ఏది ఏమైతేనేం మనలాంటి చాలా మంది పిల్లలు ఇక్కడికి వచ్చి మ్యావ్‌.. మ్యావ్‌లతో ఆడుకోవడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు. పెద్దలు కూడా తమ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. నేస్తాలూ మొత్తానికి ఇవీ క్యాట్‌ కెఫె విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని