Published : 30 Nov 2022 00:12 IST

కప్ప సాయం.. సొరచేప మాయం!

ఒక చెరువులో అనేక రకాలైన చేపలు నివసిస్తూ ఉండేవి. వాటన్నింటికి నాయకత్వం వహించేది అరునిక. చేపల బాగోగులు చూసుకోవడమే కాకుండా, వాటి భద్రతపై ఎప్పుడూ నిఘా ఉంచేది. అదే చెరువులో పత్రకి అనే కప్ప కూడా నివసిస్తూ ఉండేది. పచ్చ రంగులో ఉన్న పత్రకి, చేపలతో స్నేహం కోసం తహతహలాడుతుండేది. ఎందుకంటే తనజాతి కప్పలు ఎవరూ ఆ చెరువులో లేరు. అరునిక మాత్రం పత్రకితో చేపలు ఎవరూ మాట్లాడటానికి, కలవడానికి ఒప్పుకొనేది కాదు.

ఒకరోజు ఆహార అన్వేషణలో భాగంగా కీటకాలను వెతుక్కుంటూ వెళ్తున్న పత్రకికి, అరునిక ఎదురైంది. అరునికతో పత్రకి.. ‘మిత్రమా.. నేను మీతోపాటే ఈ చెరువులో కలిసి బతుకుతున్నాను. నా జాతి వేరు కావొచ్చు.. కానీ మీతో స్నేహం కోసం నేను ఆరాటపడుతున్నాను. దయచేసి మీ నిబంధనలు సడలించి నన్ను మీలో చేర్చుకోండి’ అంది. అందుకు అరునిక.. ‘చూడు కప్పా.. నీ జాతి వేరు, మా జాతి వేరు. పైగా మా చిన్న పిల్లల్ని తినే జాతి మీది. నీ స్నేహం ఎప్పుడూ మాకు ప్రమాదమే. నువ్వు ఒక్కడివి ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే.. మీ జాతి వాళ్లు ఈ చెరువులో ఎక్కువగా ఉంటే మేము ఇక్కడ ఉండగలమా? అందుకే, జాతి వైరుధ్యాల దృష్ట్యా మన మధ్య స్నేహం మంచిది కాదు. వీలైతే ఈ చెరువు నుంచి మరో చెరువులోకి వెళ్లిపోయి నీ జాతి వాళ్లతో స్నేహం చేయి’ అని కోపంగా వెళ్లిపోయింది. అరునిక కటువైన స్పందనకు బాధపడింది పత్రకి.

కొన్నాళ్లకు ఆ చేపలకు అనుకోని ఆపద ముంచుకు వచ్చింది. భయంకరమైన తుపాను ప్రభావం వల్ల ఒక చేప పిల్ల వరదకు కొట్టుకొచ్చి ఆ చెరువులో పడింది. కొత్తగా వచ్చిన దాన్ని చూసి మనకు ఒక నేస్తం తోడు అయిందని చెరువులోని చేపలన్నీ సంతోషించాయి. అమాయకంగా కనిపిస్తున్న ఆ చేప పిల్లకు సాత్విక అనే పేరు కూడా పెట్టాయి. సాత్విక తొందరగానే ఆ ప్రదేశానికి అలవాటు పడింది. కొన్నిరోజుల తర్వాత సాత్విక శరీరంలో భారీ మార్పులు జరిగాయి. శరీరం పెద్దగా మారి దంతాలు కత్తుల్లా తయారయ్యాయి. భయంకరమైన రూపంతో కనిపిస్తున్న దాన్ని చూసి మిగతావి భయపడ్డాయి. అది మనలాంటి సాధారణ చేప కాదని, తనకంటే చిన్నగా ఉండే చేపలను మింగేసే సొర చేప అని వాటికి అర్థమైంది. సొరచేప పరిమాణం ఇంకా పెద్దగా మారింది. అది తన సహజ సిద్ధమైన వేటను మొదలుపెట్టింది. చేపల్ని వెంటాడి తినేస్తోంది. చేపల నాయకుడు అరునిక అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి ‘మిత్రులారా... ఇక ఇక్కడ మన మనుగడ కష్టం. మరికొన్ని రోజుల్లో మనమందరం సొరచేపకు ఆహారం కాబోతున్నాం. బయటపడే మార్గం నాకైతే ఏమీ తోచడం లేదు. మీకు ఏమైనా ఉపాయం తోస్తే చెప్పండి’ అని అంది. చేపలన్నీ మౌనం వహించాయి.

ఆ సమావేశానికి హాజరైన పత్రకి మాత్రం మౌనాన్ని వీడింది. ‘మిత్రులారా.. నా దగ్గర ఓ ఉపాయం ఉంది. త్వరలోనే నేను సొర చేప పీడ లేకుండా చేస్తాను’ అంది. ఆ మాటలకు చేపలన్నీ సంతోషించాయి. కానీ, ఇంత చిన్నగా ఉన్న కప్ప అంత పెద్ద సొర చేపను ఎలా ఎదుర్కొంటుందో అర్థం కాలేదు. ఇంతలో సొరచేప వస్తున్న అలికిడి కావడంతో చేపలన్నీ చెల్లా చెదురయ్యాయి. పత్రకి మాత్రం అక్కడే ధైర్యంగా.. సొరచేపకు ఎదురుగా నిలబడింది. ‘ఏయ్‌.. ఎంత ధైర్యం నీకు! మర్యాదగా పారిపో.. లేకపోతే క్షణాల్లో నా పొట్టలోకి వెళ్లిపోతావ్‌!’ అంటూ బిగ్గరగా నవ్వింది సొరచేప. ‘పోవోయ్‌.. దమ్ముంటే నన్ను పట్టుకో..’ అంటూ క్షణాల్లో మాయమైంది కప్ప. సొరచేపకు బాగా కోపమొచ్చి కప్పను మింగేద్దామనుకుంది. కానీ, అది కనబడకపోయే సరికి నిరాశ చెందింది. ఎప్పుడో ఒకసారి నాకు చిక్కకపోతుందా.. అని ఎదురుచూడసాగింది. తన ఉపాయంలో భాగంగా సొరచేపతో వైరం పెట్టుకున్న కప్ప, తదుపరి కార్యాచరణ మొదలుపెట్టింది.

చెరువు నుంచి బయటకు వచ్చిన కప్ప ఓ జాలరి దగ్గరకు వెళ్లింది. ‘అయ్యా... ఈ చెరువులో ఒక పెద్ద సొరచేప ఉంది. అది నీకు మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది. నన్ను ఎరగా వాడుకొని దాన్ని పట్టుకో..’ అంటూ ప్రాధేయపడింది. జాలరి సంతోషించి కప్పను గాలానికి గుచ్చి.. చెరువులోకి విసిరాడు. ఆ కప్పను చూసిన సొరచేప.. ఏ మాత్రం ఆలోచించకుండా దాన్ని మింగబోయి గాలానికి చిక్కింది. ఆ జాలరి సంతోషంగా సొరచేపను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన చేపలు నివ్వెరపోయాయి. తమ కోసం ప్రాణాలు అర్పించిన పత్రకి త్యాగాన్ని గొప్పగా పొగిడాయి. పత్రకి మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీళ్లు కార్చాయి. అంతకుముందు దాంతో అవి వ్యవహరించిన తీరుకు సిగ్గుపడ్డాయి.

- వడ్డేపల్లి వెంకటేష్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు