Updated : 01 Dec 2022 05:30 IST

ఎలుకే గెలిచిందోచ్‌!

డవిలో అది గుబురు కొమ్మల చెట్టు. ఆ చెట్టుపై అన్ని పక్షులు చేరి ఊసులాడుకుంటుండేవి. వాటి దృష్టి చిలకమ్మపై పడింది. ఆకుల్లో కలిసిపోయే రంగు చిలకమ్మకు అందాన్ని ఇవ్వడంతోపాటు ఆత్మరక్షణ కలిగించడం గొప్ప విషయంగా వర్ణిస్తుండేవి. అక్కడితో ఆగక కొన్ని పక్షులు చిలకమ్మను సొగసరని పొగడ్తలతో ముంచెత్తుతుండేవి. ఆ పొగడ్తల జల్లులో తడిసి ముద్ధైన చిలకమ్మకు కాస్త గర్వం పెరిగింది.

ఇప్పుడు ఎవరు పిలిచినా పలకడం లేదు. ఒకవేళ పలికినా ఊఁ..! అని మాత్రమే అనేది తప్ప, వేరేది మాట్లాడేది కాదు. ఎవరేమి కొత్త విషయాలు చెప్పినా అవన్నీ నాకు ముందే తెలుసు అంటూ రాగాలు తీసేది. రాను రానూ తన ప్రత్యేకత కోసం అందరినీ దూరం చేసుకుంది.

అదే చెట్టు కింద కలుగులో ఉంటున్న ఎలుక ఒకసారి తన మిత్రురాలు ఉడుతమ్మను కలవడానికి చెట్టుపైకి ఎక్కింది. ఉడుత కనిపించకపోవడంతో దాని గురించి చిలుకను అడిగింది. చిలుక ఊఁ అనలేదు, ఆఁ అనలేదు.

‘పాపం ఇంత అందమైన చిలకమ్మకు భగవంతుడు అంత పెద్ద లోపం పెట్టాడేమిటో?’ సానుభూతిగా మాట్లాడింది ఎలుక.

‘నాకు లోపముందంటావా?’ సర్రున లేచి ఎలుక మీద చిందులేసింది చిలుక. ‘మరి మాట్లాడకుండా అలా ఉండిపోతే ఏమనాలి?’ చురక తగిలించింది ఎలుక. ‘నువ్వు అడిగితే నేను సమాధానం చెప్పేయాలా?’ కోపంతో అడిగింది చిలకమ్మ.
‘ఒకరితో ఒకరు సయోధ్యగా ఉండడమే ప్రపంచం. ఆ మాత్రం నీకు తెలియదా?’ అంది ఎలుక.

‘రంగు తక్కువైనా, నీకు మిగతావన్నీ ఎక్కువలా ఉంది’ అంటూ వెక్కిరించింది చిలుక. ‘రంగులో ఏముంది? నువ్వు చెప్పినట్టు నాకు అన్నీ ఎక్కువే. గతంలో నా ముందు పులి, సింహం కూడా వణికిపోయిన రోజులున్నాయి తెలుసా?’ అంది ఎలుక.

‘చాలు, చాలు నీ కోతలు’ వెటకారంగా అంది చిలకమ్మ. ‘నేను నిరూపిస్తే ఏమి చేస్తావు?’ గడుసుగా అడిగింది ఎలుక. ‘నీ బానిసగా పడుంటాను, మరి నువ్వు నిరూపించకపోతే?’ పౌరుషంగా అడిగింది చిలకమ్మ.

‘నాకు ఓటమి భయం లేదు. నువ్వు మాట నిలబెట్టుకోగలవో.. లేదో... ముందు ఆలోచించు’ అంది ఎలుక. ‘అంత పెద్ద జంతువులు నీ ముందు వణుకుతున్నాయంటే నేను నమ్మేది లేదు. చేతల్లో చూపించాలంటే నీతరం కాదు. నువ్వు ఓడితే రోజూ నా అందం గురించి భజన చేయాలి. అంతేకాదు నా సేవలు చేస్తూ బానిసగా పడుండాలి’ అంటూ పందేనికి సిద్ధపడింది చిలుక.

‘అలాగే’ అని నవ్వుకుంటూ అంది ఎలుక. ఇంతలో ఉడుత అక్కడకు వచ్చింది. ఏం జరిగిందంటూ అడిగింది. ‘నీ మిత్రుడు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు. ఇప్పుడు చీకటి పడింది కాబట్టి సరిపోయింది. ఓటమి ఖాయం, రేపటి నుంచి ఈ ఎలుక నాకు బానిస’ హెచ్చరించింది చిలకమ్మ.

‘రేపటి వరకు ఎందుకు? ఇప్పుడే తేల్చుకుందాం పద’ అంటూ ఎలుక, చిలకమ్మను ఉసిగొల్పింది. సరేనంటూ ఎలుకను వెంబడించింది చిలుక. ఉడుత కూడా వెనుక వెళ్లింది. ఒకచోట సింహం ఆహారం కోసం నిల్చుంది. చిలకమ్మ చెట్టుపై నుంచి గమనిస్తోంది.

‘పెద్దవాళ్లతో పరాచికాలు ప్రాణానికే ముప్పు. వెనుదిరిగిపోదాం పద’ అని ఎలుకను వారించింది ఉడుత. ‘తియ్యగా మాట్లాడితే ప్రపంచాన్నే జయించగలమన్నది నా నమ్మకం’ అని ఉడుతకు ధైర్యం చెప్పి సింహం ముందుకు వెళ్లింది.

‘మృగరాజుకు ప్రణామాలు. కుశలమేనా?’ అంటూ పలకరించింది ఎలుక. ‘కుశలమే!’ అంది సింహం. ‘వేటగాడొకడు మీ ఆచూకీ చెప్పమని తిరుగుతున్నాడు’ అంది ఎలుక. ‘అప్రమత్తంగా ఉంటాను’ గజగజా వణుకుతూ అంది సింహం.
చిలకమ్మ ఆశ్చర్యపోయింది. సింహం వెళ్లిపోయాక.. ‘చూశావుగా.. ఇక పులి దగ్గరకు వెళ్దాం పద’ అని నవ్వుకుంటూ అంది ఎలుక. ఇప్పుడు ఆహారాన్వేషణలో ఉన్న పులి కనిపించింది. ‘పులి మామా! పక్క ఊరు నుంచి నీ చుట్టం వచ్చింది. నీ మేనమామంట. అందరూ అనుకుంటుంటే విన్నాను. నిన్ను తనతో పాటు తీసుకుపోవడానికి తిరుగుతోంది. నువ్వే ఇంత ఉన్నావంటే నీ మేనమామ ఎంత ఉంటాడో’ అంది ఎలుక. ‘అయితే నేను కనిపించిన సంగతి చెప్పకు’ వణుకుతూ చెప్పి, అక్కడ నుంచి నెమ్మదిగా జారుకుంది పులి.

అవాక్కైన చిలకమ్మ నోరెళ్లబెట్టింది. ‘చిలకమ్మా.. రుజువులు సరిపోతాయా?’ అంది ఎలుక. ‘నువ్వు ఘనుడవే! రేపటి నుంచి నాకు దొరికిన ఆహారంలో నీకు కొంత పెడతాను’ ఓటమిని ఒప్పుకొంటూ వెళ్లిపోయింది చిలుక. ‘నాకంతా అయోమయంగా ఉంది. అసలేం జరుగుతోంది? చిలకమ్మ అహంకారం తగ్గింది. రోజూ నీకు ఆహారం ఇస్తానని అంటుంది ఎందుకు?’ అర్థంకాక అడిగింది ఉడుత.

చిలకమ్మతో వేసుకున్న పందెం గురించి పగలబడి నవ్వుకుంటూ చెప్పింది ఎలుక. ‘ఇది అసలే చలికాలం.. రాత్రి బయట ఎవ్వరున్నా చలికి గజగజ వణికిపోవాల్సిందే. సింహం, పులికి కూడా మినహాయింపు లేదు. నా తియ్యటి సంభాషణకు అవి కృతజ్ఞతా పూర్వకంగా సమాధానమిచ్చాయి. చలి కాబట్టి వణకక తప్పలేదు. దట్టంగా ఈకలు ఉన్న చిలకమ్మకు చలి అంత పెద్దగా తెలియదు. అదీగాక గర్వంతో ఆ విషయాన్ని గుర్తించలేకపోయింది. పద నేను కూడా చలికి తట్టుకోలేకపోతున్నాను’ అంటూ కలుగువైపు దారి తీసింది ఎలుక. ‘మొత్తానికి గడసరివే’ అంటూ కితాబిచ్చింది ఉడుత.

బి.వి.పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని