ఏదిస్తే.. అదే తిరిగొస్తుంది!

అదొక అడవి. పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. రకరకాల జంతువులు హాయిగా జీవిస్తున్నాయి. ప్రశాంతమైన కొలనులో రాయి పడినట్టుగా.. ఆ అడవికి కొత్తగా ఒక నక్క వచ్చింది.

Updated : 03 Dec 2022 06:16 IST

దొక అడవి. పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. రకరకాల జంతువులు హాయిగా జీవిస్తున్నాయి. ప్రశాంతమైన కొలనులో రాయి పడినట్టుగా.. ఆ అడవికి కొత్తగా ఒక నక్క వచ్చింది. అది మహా జిత్తులమారి. అది వచ్చినప్పటి నుంచి అడవిలో అలజడులు, అపోహలు, ఆర్తనాదాలు ఆరంభమయ్యాయి. ఆ నక్క కనిపించిన జంతువునల్లా అవహేళన చేస్తుండేది. అల్పజీవులను హింసిస్తుండేది. చిరుజీవుల ఆహారాన్ని గుంజుకొని మరీ.. నేల పాలు చేస్తుండేది. దాచుకున్న ఆహారం దొంగిలిస్తుండేది. వాటిలో వాటికి గొడవలు పెట్టి ఆనందిస్తుండేది.

రోజురోజుకీ దాని ఆగడాలు అధికమయ్యాయి. అడవిలోని జంతువులన్నీ ఆ నక్క జిత్తులను భరించలేకపోయేవి. దేశ సంచారం చేస్తున్న ఒక మునీశ్వరుడు వెళ్తూ వెళ్తూ.. ఆ అడవిలోని కొండ గుహలో విడిది చేశాడు. ఆ మునీశ్వరుడు చాలా మహిమకలవాడని తెలుసుకొని, జంతువులన్నీ ఆయన దగ్గరకు వెళ్లాయి. నక్క ఆగడాలు ఒక్కొక్కటిగా చెబుతూ బాధపడసాగాయి. దాని బుద్ధిని మార్చి.. తమ కష్టాలు తొలగించాలని కోరాయి. అంతా విన్న మునీశ్వరుడు.. మీ ఇబ్బందులు త్వరలోనే తీరుతాయని ఆ జంతువులకు మాటిచ్చాడు. మునీశ్వరుడి దగ్గరికి జంతువులు వెళ్లిన సంగతి జిత్తులమారి నక్కకు తెలిసింది. అవన్నీ తన మీద ఫిర్యాదు చేసి ఉంటాయని అనుకుంది. మునీశ్వరుడి కోపానికి గురి కాకూడదనుకొని.. వెళ్లి ఆయనను కలిసింది.

మునీశ్వరుడికి పాదాభివందనం చేసి.. ‘మునీశ్వరా! అడవిలోని జంతువులకు నేనంటే పడదు. నా మీద మీకు చాడీలు చెప్పే ఉంటాయి. నేనెవరినీ హేళన చేయలేదు. ఎవరినీ హింసించలేదు. ఎవరి ఆహారాన్నీ నేల పాలు చేయలేదు. దాచుకున్న తిండి దొంగిలించలేదు. బాధపడిన జంతువులను చూసి.. నేను ఏనాడూ సంతోషపడలేదు. ఇవన్నీ నేను చేస్తున్నట్లు మా అడవి జంతువులు మీకు ఫిర్యాదు చేసి ఉంటాయి. వాటిని అస్సలు నమ్మకండి. మీరు మహిమ కలవారని విన్నాను. నామీద ఆగ్రహించకుండా కరుణించండి’ అని వేడుకుంది నక్క.

‘గుమ్మడికాయల దొంగ’ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్టు.. ఏమీ అడగకుండానే, నక్క తాను చేసే పనులన్నీ ఏకరువు పెట్టి.. చెప్పకనే చెప్పిందని మునీశ్వరుడు మనసులోనే నవ్వుకున్నాడు. ‘నువ్వు ఊహించినట్టు జంతువులు నీపైన చాడీలు చెప్పలేదు. అడవిలోని జీవులన్నింటికీ మంచి బుద్ధిని ప్రసాదించమని కోరాయి. జరిగింది ఇదే.. నువ్వు ఏమీ ఆందోళన పడకు’ అని నక్కను ఊరడించాడు మునీశ్వరుడు. ఆ మాటలతో ఆ జిత్తులమారికి ధైర్యం వచ్చింది. ‘స్వామీ.. మునీశ్వరులు మహిమ కలవారని, కోరిన వరాలిస్తారని విన్నాను. నాకేదైనా వరం ప్రసాదించండి’ అని అడిగింది. వెతకబోయిన తీగ కాలికే తగిలిందని మునీశ్వరుడు అనుకున్నాడు. వెంటనే ఆయన.. ‘నక్కా.. నువ్వు ఏది ఇస్తే.. అదే నీకు తిరిగొస్తుంది. ఇదే నేను నీకు ఇస్తున్న వరం. ఇక నువ్వు వెళ్లవచ్చు’ అని అన్నాడాయన.

వరం పొందానన్న గర్వంతో గుహ నుంచి బయటకు వచ్చింది నక్క. అడవిలో వెళ్తున్న నక్కకు ఒక లేడి కుంటుతూ కనిపించింది. దాని సహజ బుద్ధి పోదు కదా.. అందుకే, ‘ఓహో.. కుంటి లేడీ, ఇక్కడున్నావా?’ అని హేళన చేస్తూ పలకరించింది నక్క. ఆ వెంటనే పక్కన వెళ్తున్న ఒక పంది నక్కను చూసి.. ‘ఓహో ఎత్తుపళ్ల నక్కా.. కుశలమేనా?’ అని వ్యంగ్యంగా అడిగింది. దాంతో ఒక్కసారిగా కంగారుపడింది నక్క. ఇంత వరకు ఎవరూ తనను అలా పలకరించలేదు మరి! పందితో తలపడ లేక అవమానంతో ముందుకు కదిలింది. అలా కొద్దిదూరం వెళ్లగానే.. చెవుల పిల్లి కనిపించింది. దాని చెవిని పట్టుకుని గిరగిరా గాలిలో తిప్పి వదిలిపెట్టింది నక్క. అక్కడి నుంచి మూడు నాలుగు అడుగులు వేయగానే.. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఏనుగు, తొండంతో నక్క తోకను గట్టిగా ఒడిసి పట్టుకొని గాలిలో గిరగిరా తిప్పి నేలకు కొట్టింది. ఆ దెబ్బకు నక్కకు నడుం విరిగినంత పనైంది. బతుకు జీవుడా.. అనుకుంటూ తుప్పల్లోకి నడిచింది.

అక్కడ కాస్త తేలికపడ్డాక.. ‘నాకు ఎందుకిలా జరుగుతోంది?’ అని ఆలోచనలో పడింది. అప్పుడు దానికి ముని వరం గుర్తుకొచ్చింది. ‘ఏదిస్తే అదే తిరిగొస్తుంది’ అన్న ఆయన మాటలు మనసులో మెదిలాయి. ‘వరమిచ్చి ఎంత పని చేశాడు మునీశ్వరుడు? ఇంతకీ అది నాకు వరమా? శాపమా?’ అని అర్థం కాక ఆలోచనలో పడింది నక్క. వెంటనే మునీశ్వరుడి దగ్గరకు పరిగెత్తింది. ఆయన అక్కడి గుహలో కనిపించలేదు. అప్పటికే ఆయన ప్రయాణం అడవి దాటిందని తెలుసుకొని దిగాలుపడింది. వేరే మార్గం లేక.. ‘ఇతరులకు మంచి చేస్తే తనకు మంచి జరగడం, చెడు చేస్తే చెడు జరగడం’.. ఆ నక్కకు అనుభవంలోకి వచ్చింది. దాంతో తన బుద్ధితోపాటు ప్రవర్తన కూడా మార్చుకుంది. జిత్తులమారి మంచిగా మారడంతో.. అడవి జంతువులన్నీ ఆనందించాయి. 

బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని