Published : 04 Dec 2022 00:20 IST

చిట్టి ప్రయత్నం.. గట్టి ఫలితం!

ప్రతి పది రోజులకోసారి అడవిలో నివసించే జీవులన్నీ సమావేశమవుతాయి. అందులో భాగంగానే ఆ రోజూ హాజరయ్యాయి. రాజైన సింహం సమావేశాన్ని ప్రారంభించింది. ‘అందరూ క్షేమమే కదా!’ అని అన్ని జంతువులు, పక్షులను చూస్తూ అడిగింది. ‘అందరం బాగున్నాం.. మృగరాజా!’ అని అన్ని జీవులూ ఒకేసారి బదులిచ్చాయి.

‘మీ సంక్షేమమే.. నా సంతోషం!’ సింహం కూడా బదులుగా అంది. ‘ఏమిటి విశేషాలు?’ సమావేశాన్ని పొడిగిస్తూ అంది సింహం. అప్పుడు చిన్ని అనే కాకి.. ‘నేను మాట్లాడవచ్చునా?’ అని అడిగింది. ‘మాట్లాడటానికే ఈ సమావేశం! మళ్లీ ప్రత్యేకంగా అనుమతి అడగాలా?’ అని చిట్టి అనే పావురం, చిన్ని వైపు విచిత్రంగా చూస్తూ అంది. కానీ చిన్ని, ఆ మాటలను పట్టించుకోకుండా ఇలా చెప్పసాగింది.

‘అందరూ బాగున్నామన్నారు. మనందరం బావుండేలా మృగరాజు పరిపాలిస్తోంది. సంతోషం. కానీ మీ క్షేమంలో నా పాత్ర కూడా ఉందని గమనించండి!’ అంది.

‘ఏమిటో అది?’ మళ్లీ వెక్కిరింపుగా అంది చిట్టి. ‘మృగరాజుకు ఎంతో ఇష్టమైన జూలును చిట్టి రోజూ బాగా దువ్వుతుంది. అందంగా ఉండేలా చూస్తుంది. సింహం తన అందాన్ని పెంచే జూలును బాగా చూసుకుంటున్న చిట్టిని ఏమీ అనదు. అందుకే దాన్ని మిగతా జీవులు కూడా ఏమి అనలేవు’ అని చిట్టి వెక్కిరింతకు సమాధానంగా అంది చిన్ని. ‘నేను చేసే పని..  సమాచారాన్ని సేకరించి అవసరమైన వారికి అది చేరవేయడం’ అని బదులిచ్చిందది. ‘ఏమిటో ఆ సమాచారం?’ మళ్లీ అంతే వెటకారంతో అడిగింది చిట్టి.

చిట్టి వెక్కిరింపు వెగటుగా ఉన్నా కూడా సింహం ఏమీ అనలేదు. ‘అడవిలోకి అకస్మాత్తుగా వేటగాళ్లు వస్తే వెంటనే మృగరాజుకు చెబుతాను. ఎవరైనా వలలో చిక్కుకుంటే చిట్టెలుకలకు విషయాన్ని చేరవేస్తాను. ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే వెంటనే వైద్యం చేసే కోతికి కబురుపెడతాను. నేను చెప్పేవి కబుర్లే కావచ్చు. కానీ అవి ఆలస్యం కాకుండా వెంటనే ఆచరణలోకి వచ్చేందుకు ఉపయోగపడతాయి’ అంది చిన్ని. ‘అయితే ఏమిటంట? అందుకు ఇప్పుడు మేమందరమూ నీకు దండ వేసి దండం పెట్టాలా? శాలువా కప్పి సన్మానించాలా?’ అని మళ్లీ తనదైన ధోరణిలో వెక్కిరిస్తూ అంది చిట్టి. చిన్నితో సహా అన్ని జీవులకు చిట్టి మాటలు బాధ కలిగించినప్పటికీ, మృగరాజుకు ప్రధాన అనుచరుడన్న భయంతో దాన్ని ఏమీ అనలేక మిన్నకుండి పోయాయి.

‘నాకు శాలువా వద్దు. సన్మానమూ వద్దు. నాకు కొంచెం ఓపిక తగ్గింది. సమాచారం అందించడానికి సహాయంగా మరొకరు కావాలి. మీలో ఒకరు నాకు తోడుగా రావాలి!’ అంది చిన్ని.

ఈ మాటలు విన్న అన్ని జీవులూ... ‘ఎవరైతే బావుంటుంది?’ అనుకుంటూ ఆలోచించసాగాయి. అది గమనించిన చిన్ని.. ‘అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. చిట్టి అయితే బావుంటుందని నాకు అనిపిస్తోంది. కానీ మృగరాజు అందుకు అనుమతించాలి’ అని తన మనసులోని మాట బయట పెడుతూ సింహం వైపు అభ్యర్థనగా చూసింది.

‘మృగరాజు ఒప్పుకొంటుందా?’ అని మిగతా జీవులన్నీ వాటిలో అవి అనుకుంటూ సింహం అభిప్రాయం కోసం ఎదురు చూడసాగాయి. ‘చిట్టిని, చిన్నికి సాయంగా పంపాలా, వద్దా?’ అని మృగరాజు తర్జనభర్జన పడసాగింది.

అంతా గమనిస్తున్న చిట్టి ఒక్కసారిగా లేచింది. ‘కాకి కబురు, గాలి కబురు ఒక్కటే. నా దృష్టిలో కబుర్లు చెప్పడం అంటేనే.. కాలాన్ని వృథా చేయడం. మళ్లీ ఇంతోటి నీ పనికి మరొకరి సాయం కావాలా? నీతో నేను కూడా రావాలా? మృగరాజు అందం పెంచడమే నా కర్తవ్యం. నా పని ముందు నీ పని ఏపాటిది. మరొక్కసారి నన్ను పిలిచే సాహసం చేయకు. అతిగా మాట్లాడకు. ఒక వేళ మృగరాజే నన్ను నీతో వెళ్లమని చెప్పినా నేను వినను. నీతో రానంటే రాను. ఇది నా మాట. మృగరాజు ప్రధాన అనుచరుడిని నేను. నా మాటే శాసనం!’ అని చిట్టి గట్టిగా ఎంతో గర్వంగా అంది.

దీంతో ఒక్కసారిగా మృగరాజుకు చిట్టి మీద కోపం వచ్చింది. ‘నేను చెప్పినా వెళ్లనంటావా? నా మాటే విననంటావా? చిన్నిని వెక్కిరిస్తే ఊరుకున్నాను కదా అని, ఇప్పుడు గర్వంతో నన్నే ధిక్కరిస్తావా? నా అందం పెంచడం కన్నా, చిన్నికి సాయంగా నువ్వు సమాచారాన్ని అందరికీ చేరవేయడమే ముఖ్యం. నేను చెబుతున్నాను. ఈ క్షణం నుంచి చిన్నికి తోడుగా వెళ్లాలి. చిన్ని మాటలు వినాలి. చెప్పింది చేయాలి’ అని సింహం ఒక్కసారిగా గర్జిస్తూ గట్టిగా అనేసరికి చిన్నితో సహా అన్ని జీవులూ ఉలిక్కిపడ్డాయి.

అప్పుడు చిట్టి లేచి... ‘మృగరాజా! మీరు నన్ను మన్నించాలి. రోజూ చిన్ని చేసే పనిలో కష్టం గమనించాను. చిన్నికి మరొకరి సహాయం అవసరమని గుర్తించాను. గతంలో ఇదే విషయం మీద చిన్నికి తోడుగా వెళతానని మీతో నేను అన్నాను. కానీ మీరు ఒప్పుకోలేదు. ఇప్పుడు మీ అనుమతి కోసమే గర్వంగా, వెటకారంగా మాట్లాడాను.. అంతే! మీరు అనుమతి ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది!’ అంది చిట్టి.

ఆ మాటలకు అన్ని జీవులూ ఆశ్చర్యపోయాయి. ‘చిట్టీ! నీ మనసు చాలా గొప్పది!’ అంటూ అభినందించాయి. మృగరాజు చిట్టి వైపు మెచ్చుకోలుగా చూస్తూ... ‘ప్రయత్నం చిట్టిది. ఫలితం గట్టిది’ అంది. ‘భలేగా చెప్పారు మృగరాజా..’ అంటూ చిన్నితో సహా జీవులన్నీ మరోసారి చిట్టిని అభినందిస్తూ చప్పట్లు కొట్టాయి.

- కె.వి.లక్ష్మణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని