Published : 05 Dec 2022 01:03 IST

బాధ్యత తెలిసిన బుజ్జి!

రోజు ఆదివారం. సెలవు కావడంతో ఉదయం పదకొండుకల్లా పని ముగించుకుంది వినీల. ఇంటికి అవసరమైన సరకులు తెచ్చుకోవడానికి పక్క వీధిలో ఉన్న సూపర్‌ మార్కెట్‌కు బయలుదేరింది. అప్పుడే నిద్ర లేచిన ఆమె కొడుకు అయిదేళ్ల బుజ్జి కూడా వస్తానని మారాం చేశాడు. ‘బయట ఎండగా ఉందిరా.. ఇంట్లో నాయనమ్మ దగ్గరే ఉండు. గంటలో తిరిగి వచ్చేస్తా’ అంది అమ్మ.  అయినా, బుజ్జి ఎంతకూ వినలేదు. ఏడుపు అందుకోవడంతో.. తనతోపాటు కొడుకును కూడా తీసుకెళ్లిందామె. ఇద్దరూ కలిసి ఒక పెద్ద సూపర్‌ మార్కెట్‌లోకి వెళ్లారు. బుజ్జికి టీవీ చూడటం అలవాటు. బాగా ఇష్టం కూడా. తను రోజూ టీవీలో చూసే వస్తువులు అనేకం అక్కడ కనిపించడంతో ఎక్కడలేని హుషారు వచ్చింది. ఈలోగా వినీల ఒక ట్రాలీని అందుకుని, ఒక్కో ర్యాక్‌ పక్క నుంచి నడుస్తూ, కావాల్సిన వస్తువుల్ని అందులో వేయసాగింది.

బుజ్జి కూడా అమ్మ వెనుకే నెమ్మదిగా నడవసాగాడు. అక్కడి అల్మారాల్లో పేర్చిన వస్తువులను నిశితంగా గమనిస్తున్నాడు. తనకు తెలిసిన బిస్కట్‌ ప్యాకెట్లు, చాక్‌లెట్లు, లాలీపాప్‌లు, జ్యూస్‌లను చిట్టి చేతులతో అందుకుంటూ.. అమ్మ సహాయంతో ట్రాలీలో వేయసాగాడు.

ఆ దుకాణంలో ఓ ర్యాక్‌ కింది వరుసలో పెద్ద కూల్‌డ్రింక్‌ సీసాలను పేర్చారు. వాటి పక్కగా నడుస్తున్న వినీల కాలు తగిలి.. ఓ సీసా కింద పడిపోయింది. పడిపోయిన సీసా వైపు ఓసారి చూసి, నిర్లక్ష్యంగా ముందుకు అడుగు వేసింది. అంతేకానీ దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. కొట్లో పనిచేసే వారే దాన్ని తీస్తారులే అనుకుంది.

కానీ బుజ్జి ఆలోచన వేరుగా ఉంది. ‘అమ్మ కాలు తగిలి సీసా పడిపోయింది కాబట్టి.. అమ్మే దాన్ని తీసి మళ్లీ ర్యాక్‌లో పెట్టాలి. కానీ, అమ్మ అలా చేయలేదు. దాంతో నేనే దాన్ని తీసి అక్కడ పెట్టాలి’ అని మనసులోనే అనుకున్నాడు. అలా అనుకున్నదే తడవుగా ఆ సీసా దగ్గర కూర్చుండిపోయాడు.

ఈలోగా బుజ్జి తన వెనక రావడం లేదని గుర్తించిన ఆమె.. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. నిండుగా ఉన్న ఆ సీసాని ఎత్తేందుకు కష్టపడుతూ కనిపించాడు బుజ్జి. అంత బరువుగా ఉన్నా, దాన్ని మాత్రం వదలడం లేదు. ‘బుజ్జీ.. ఆ సీసా అక్కడే ఉంచు. నేను వస్తున్నా’ అంటూ కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చింది వినీల. ఆమె వచ్చేసరికే సీసాని పైకి ఎత్తి, ర్యాక్‌లో పెట్టేశాడు. అమ్మ పడేసిన సీసాను సరిగ్గా సర్దినందుకు తెగ సంబరపడిపోయాడు బుజ్జి. లేత అరచేతులతో చప్పట్లు కొట్టాడు.

బుజ్జి చేసిన పనిని చూసి వినీల ఆనందపడింది. తన కాలు తగిలి పడిపోయిన సీసాను దుకాణం వాళ్లే చూసుకుంటారులే అని నిర్లక్ష్యంగా అలా వదిలేసింది. కానీ బుజ్జి మాత్రం ఆ సీసాను చక్కగా సర్దిపెట్టాడు.

‘పెద్దల్లో కనిపించే అనవసరపు భేషజాలు, అహంకారం పిల్లల్లో ఏమాత్రాన కనిపించవు. వారి మనసులు కల్మషం లేని మల్లెపువ్వులు’ అనుకుని బుజ్జిని ప్రేమగా ఎత్తుకుని ముద్దాడిందా తల్లి. తను చేసిన పనిని అమ్మ మెచ్చుకుందని అర్థం కావడంతో బుజ్జి ముఖం చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. కొంతసేపటికి, మొదట్నుంచి ఆ తల్లీకొడుకుల్ని గమనిస్తున్న ఓ తాతగారు వాళ్ల దగ్గరకు వచ్చారు. ‘మీ అబ్బాయి చిన్నవాడైనా భలే మంచి పని చేశాడమ్మా.. ఆ చిట్టి బుర్రలో వచ్చిన ఆలోచన చాలా గొప్పది. సహజమైంది కూడా.. ఇటువంటి బాధ్యతాయుతమైన పౌరులే దేశానికి అవసరం. మీవాడిని చూస్తుంటే ముచ్చటేస్తోంది’ అన్నారు.

తర్వాత బుజ్జి చేయి అందుకొని.. షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ‘వెల్‌డన్‌.. మై డియర్‌ లిటిల్‌ జెంటిల్‌మ్యాన్‌!’ అంటూ ఒక పెద్ద చాక్లెట్‌ను బహుమతిగా అందించారు. బుజ్జి కూడా తాతగారిని చూస్తూ ముసిముసిగా నవ్వాడు. సరకులు తీసుకొని ఇంటి దారి పట్టారా తల్లీకొడుకులు.

 ఎస్‌.హనుమంతరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు