మీసమున్న పక్షిని నేను!

హాయ్‌ నేస్తాలూ! ఏంటి అలా చిత్రంగా నా వైపు చూస్తున్నారు. మీసాలతో ఉన్నాననా? అవును మరి.. నేను మీసమున్న పక్షిని. బహుశా.. ఇలా మీసాలు ఉన్న పక్షిజాతి మేం తప్ప ఈ భూ ప్రపంచంలో ఇంకోటి లేదనుకుంటా!

Published : 07 Dec 2022 00:02 IST

హాయ్‌ నేస్తాలూ! ఏంటి అలా చిత్రంగా నా వైపు చూస్తున్నారు. మీసాలతో ఉన్నాననా? అవును మరి.. నేను మీసమున్న పక్షిని. బహుశా.. ఇలా మీసాలు ఉన్న పక్షిజాతి మేం తప్ప ఈ భూ ప్రపంచంలో ఇంకోటి లేదనుకుంటా! మరి మా గురించి తెలుసుకోవాలని ఉందా.. అయితే ఇంకేం ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది.

నా పేరు ‘ఇంకా టర్న్‌’. నా తీరులానే నా పేరు కూడా భలే చిత్రంగా ఉంది కదూ! నేను సముద్ర పక్షిని. పెరూ, చిలీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాను. నేను ముదురు బూడిద రంగులో ఉంటాను. నా మీసాలు మాత్రం తెలుపు రంగులో ఉంటాయి. ఎరుపు, ఆరెంజ్‌ రంగులో నా ముక్కు, పాదాలుంటాయి.

రాళ్ల మధ్యే గూడు

నేను దాదాపు 40 సెంటీమీటర్ల పొడవుంటాను. రాళ్లలో గుడ్లుపెడతాను. కొన్నిసార్లు హమ్‌బోల్ట్‌ పెంగ్విన్లు వదిలేసిన గూళ్లలో గుడ్లుపెట్టి పొదుగుతాను. నేను ఒక్కసారికి ఒకటి లేదా రెండు గుడ్లను మాత్రమే పెడతాను. వీటిలోంచి నాలుగువారాల్లో పిల్లలు బయటకు వస్తాయి. ఈ పిల్లలు ఏడు నుంచి ఎనిమిది వారాల్లో గూడు వదిలి ఎగిరి వెళ్లిపోతాయి.

ఏం తింటానంటే...

నేను సముద్ర పక్షిని కదా.. అందుకే, ఎక్కువగా చిన్న చిన్న చేపల్ని తిని నా కడుపు నింపుకొంటాను. నేను కాస్త కింగ్‌ఫిషర్‌ పక్షిలానే వేటాడతాను అనుకోండి. గాల్లో ఎగురుతూ ఒక్కసారిగా నీటిలోకి దూకి చేపల్ని నా ముక్కుతో ఒడిసిపట్టుకుంటా. తర్వాత వాటిని గుటుక్కుమనిపించి, నా బుజ్జి పొట్టను నింపుకొంటాను.

ఎంత పెద్ద మీసముంటే...

నేను దాదాపు 14 సంవత్సరాలు జీవిస్తా. మాలో కొన్ని 20 సంవత్సరాల వరకు కూడా బతికే ఉంటాయి. మీకు మరో విశేషం చెప్పనా... మా మీసం మా ఆరోగ్యానికి సంకేతం. మాకు ఎంత పెద్ద మీసం ఉంటే.. మేం అంత ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క! ఈ ప్రపంచం మొత్తం మీద మేం కేవలం 15లక్షల పక్షులం మాత్రమే ఉన్నాం. అంటే ఓ రకంగా మా సంఖ్య చాలా తక్కువే అని చెప్పుకోవాలి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఉంటా ఇక బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని