ఫలించిన కోతి ప్రయత్నం!

పరుగులు పెడుతూ.. ఓసారి వెనక్కి చూసింది పండు. అదొక కోతి పిల్ల. అడవిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో జంతువులన్నీ తలో దిక్కుకు పరుగులు పెట్టాయి.

Updated : 10 Dec 2022 04:21 IST

పరుగులు పెడుతూ.. ఓసారి వెనక్కి చూసింది పండు. అదొక కోతి పిల్ల. అడవిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో జంతువులన్నీ తలో దిక్కుకు పరుగులు పెట్టాయి. పక్షులన్నీ చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి. వేగంగా నడవలేని తాబేలులాంటి ప్రాణులు మంటల వేడికి ఉక్కిరిబిక్కిరి కాసాగాయి. తన వెనుకే వస్తున్నారనుకున్న అమ్మానాన్న కనబడకపోవడంతో ఒక్కసారిగా భయపడి పోయింది పండు. చుట్టూ చూడగా.. తాను మరో అడవిలోకి వచ్చినట్లు గ్రహించింది. భయం భయంగా ఒక పెద్ద చెట్టు ఎక్కి, కొమ్మపై కూర్చుంది. ఉదయం నుంచి ఏమి తినకపోవడంతో ఆకలితో కడుపు నకనకలాడుతోంది. ‘ఓయ్‌.. ఎవరు నువ్వు? ఈ అడవికి కొత్తగా వచ్చినట్లుందే..’ అంటూ పలకరించింది కొమ్మ మీదున్న చిలుకమ్మ.

‘అవును.. మా అడవిలో మంటలు వ్యాపించడంతో జీవులన్నీ భయపడి పారిపోయాయి. నేను ముందు నడుస్తుంటే, అప్పటి వరకూ వెనుకే వచ్చిన మా అమ్మానాన్న ఎక్కడో తప్పిపోయారు. నేనేమో ఇక్కడికి చేరా’ అంది పండు. అందుకు చిలుక కిలకిలా నవ్వుతూ.. ‘వాళ్లు తప్పిపోవడం కాదు. నువ్వే వాళ్లను వదిలి దారి తప్పావు’ అంది. ‘సరే.. నిన్ను మా రాజు గారి దగ్గరికి తీసుకెళతాను. ఆయన సరేనంటే.. ఇక నువ్వు ఇక్కడే ఉండవచ్చు’ అని చెప్పింది చిలుక. ‘రాజు సంగతి తరువాత.. ముందు నాకు బాగా ఆకలి వేస్తోంది. దగ్గరలో ఏమైనా పండ్లు దొరుకుతాయా?’ అని అడిగింది పండు. ‘ఈ అడవిలో అన్నీ ఉన్నాయి. కానీ, పండ్ల చెట్ల సంఖ్య చాలా తక్కువ. అదిగో ఆ కనిపించే సందులోంచి వెళితే ఓ సెలయేరు వస్తుంది. దాని ఒడ్డునే సీతాఫలం చెట్టు ఉంది. బహుశా ఇప్పుడు కొన్ని కాయలు ఉండవచ్చు. వెళ్లి తెచ్చుకొని తిను. తర్వాత అక్కడే నీళ్లు తాగిరా. నీ ఆకలి తీరిన తర్వాతే రాజుగారి దగ్గరకు వెళదాం’ అంది. ‘హమ్మయ్య’ అనుకుంటూ.. అటుగా వెళ్లి, చెట్టు మొత్తం వెతకసాగింది కోతి. చిటారు కొమ్మన కనిపించిన రెండు సీతాఫలాలను కోసుకుంది. అది తినడం చూసిన చిలుక... ‘ఓ పండూ.. ఈ అడవిలో చాలా నియమాలున్నాయి. పనిచేయని వారికి ఇక్కడ స్థానం లేదు. అందరూ ఈ అడవికి ఉపయోగపడేలా ఏదో ఒక పని చేయాలన్నది నియమం’ అంది.

‘అలాగా.. మీ నియమం బాగుంది.. మా అమ్మ కూడా ఎప్పుడూ ఆ మాటే చెబుతుంటుంది. పది మందికి ఉపయోగపడని జన్మ దండగ అని.. సరే సరే.. ముందు వెళ్లి రాజుగారిని కలుద్దాం పద’ అంటూ సీతాఫలం గింజలను చెట్టు కిందనున్న గొయ్యిలో దాచింది పండు. అవి రెండూ కలిసి గుహ వద్దకు వెళ్లగానే.. ఎదురుగా పెద్ద రాయిపై కూర్చొని కనిపించింది మృగరాజు. కోతిని చూపించి, విషయాన్ని వివరించింది చిలుకమ్మ. దాంతో మృగరాజు.. ‘దారి తప్పి వచ్చింది కాబట్టి, ఈ పిల్ల కోతిని మన అడవిలోనే ఉండనివ్వండి. ఇక్కడ మన పద్ధతులన్నీ కచ్చితంగా చెప్పండి’ అంది. ‘హమ్మయ్యా.. మృగరాజు అనుమతి లభించింది. నీకు ఇందాకే చెప్పాను కదా.. ఈ అడవిలో పనిచేసే వారినే ఉండనిస్తారు. బద్ధకస్తులు మృగరాజుకు ఆహారం కావాల్సిందే. కాబట్టి నువ్వు చేయగలిగిన పని ఏంటో నిర్ణయించుకో. బాగా పనిచేసి మృగరాజు మెప్పుపొందు’ అని కోతితో అంది చిలుకమ్మ. ‘నేనేం చేయాలో.. ఇందాకే నిర్ణయించుకున్నాను’ అంది పండు. ‘అప్పుడేనా?’ అని ఆశ్చర్యంగా చూసింది చిలుకమ్మ. ‘అవును ఈ అడవిలో.. పండ్ల మొక్కలు తక్కువగా ఉన్నాయని చెప్పావు కదా.. ఇక వాటి సంఖ్యను పెంచే పనిలో ఉంటాను’ అంటూ తాను తిన్న సీతాఫలం గింజలను గోతిలో నాటిన సంగతి చెప్పింది కోతి.  

‘గతంలో ఇలా చాలా మంది ప్రయత్నించారు. కానీ, ఎవ్వరూ మొక్కలు ఎదిగే వరకూ కాపాడలేకపోయారు’ అని బాధగా అంది చిలకమ్మ. ‘మంచి మనసుతో కష్టపడితే ఏదైనా సాధ్యమేనని మా నాన్న చెబుతుంటాడు. నా బాధలేవో నేను పడతాను. అడవిలో మిగిలిన నీ మిత్రులను నాకు పరిచయం చేయవా!’ అని అడిగింది పండు. ‘తప్పకుండా.. సాయంత్రం ఇక్కడే కలుద్దాం. నిన్ను ఎవరు ఏమడిగినా మృగరాజును కలిశానని చెప్పు. ఇక ఎవరూ నీ జోలికి రారు’ అంది చిలుకమ్మ. ‘అలాగే..!’ అంటూ గింజలు నాటడంలో మునిగిపోయింది పండు. ఓ పద్ధతి ప్రకారం పండ్ల గింజలు పాతడమే కాదు కొలను నుంచి తామరాకుల్లో నీటిని తెచ్చి.. వాటికి పోయసాగింది.

సాయంత్రానికి చిలుకమ్మ తన స్నేహితులు ఉడుత, కుందేలు, కోకిలను తీసుకొచ్చి పండుకు పరిచయం చేసింది. ‘అమ్మానాన్న నుంచి నేను తప్పిపోయినా.. నాకు మీ రూపంలో నిజమైన స్నేహితులు దొరికారు’ అని వాటితో అంది పండు. ఇక ఆ రోజు నుంచి ఎక్కడ విత్తనం కనిపించినా భద్రపరిచేది. వాటిని సురక్షిత ప్రదేశంలో నాటేది. ఆ కోతి శ్రమ వృథాగా పోలేదు. కొన్ని రోజులకు ఆ విత్తుల్లోంచి మొలకలు వచ్చాయి. వాటిని చూసిన మృగరాజు చాలా సంతోషించింది. పండుతోపాటు మొక్కలు కూడా ఎదిగాయి. ఒకప్పుడు అక్కడక్కడ మాత్రమే కనిపించే పండ్ల చెట్ల సంఖ్య.. చూస్తుండగానే బాగా పెరిగిపోయింది. దాంతో చుట్టుపక్కల అడవుల్లోని జీవులూ అక్కడికి వలస రాసాగాయి.
కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని